రాజకీయం అంటే 'బలమే నీతి' - 'ధనమే రీతా..??'

Submitted by Praneeth Kumar on Thu, 28/03/2024 - 09:30
Is Strength is righteousness - Money is wisdom..!!

రాజకీయం అంటే 'బలమే నీతి' - 'ధనమే రీతా..??'

ఖమ్మం, మార్చి 28, ప్రజాజ్యోతి.

కుమార్తె కవిత అరెస్టయినప్పుడు, కేసీఆర్ ఎందుకు వెంటనే స్పందించలేకపోయారు..?? కేజ్రీవాల్ అరెస్టును ఖండించినప్పుడు మాత్రమే కవిత పేరు కూడా చేర్చి ఎందుకు మాట్లాడారు..?? ఆమె అరెస్టయినప్పుడు, కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు ఈడీ అధికారులతో వాదనలు చేశారే తప్ప, అదంతా అన్యాయమని గట్టిగా జనం ముందు ఎందుకు అనలేకపోయారు..?? మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత ప్రమేయం, ఏమంత గర్వకారణమైన అంశం కాదన్న సంకోచం ఏదైనా కేసిఆర్, ఇతర బిఆర్‌ఎస్‌ నేతల మనసులను ఆవరించిందా..?? ఒక కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తే వేలకొలది కేజ్రీవాల్‌లు పుట్టుకువస్తారని, అరవింద్ ఒక మనిషి కాదు, ఒక భావన అని ఆమ్ ఆద్మీపార్టీ ఎట్లా గట్టిగా అనగలుగుతోంది..?? దేశంకోసమే నా జీవితం అంటూ కేజ్రీవాల్ జైలు నుంచి పంపిన సందేశాన్ని ఆయన భార్య ఎట్లా సగర్వంగా దేశం ముందు చదవగలిగింది..??
పై ప్రశ్నలు, ఒకే కేసులో అరెస్టయిన ఇద్దరిలో ఒకరు నైతికంగా ఎక్కువ, మరొకరు తక్కువ అని చెప్పడం కోసం కాదు. రెండు రాజకీయ సంస్థల ప్రతిస్పందనల్లో ఉన్న తేడాలను చెప్పడానికి కూడా కాదు. ఎన్నికల సందర్భంగా ఆవిష్కృతమయిన రాజకీయ-వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి ఆ ప్రశ్నలు పనికిరావచ్చు. పెరిగిపోతున్న కర్కశతకు, నిర్దాక్షిణ్యతకు సమాధానంగా రూపుదిద్దుకోగలిగే ప్రతి కథనాలను గుర్తించడానికి కూడా సహాయపడవచ్చు.
కేసీఆర్ గనుక, మొన్నటి ఎన్నికల్లో అధికారం పోగొట్టుకోకపోయి ఉంటే, ఓడిపోయినాక మరీ ప్రస్తుత దయనీయ స్థితికి ఆయన పార్టీ చేరుకోకపోయి ఉంటే, బహుశా కవిత అరెస్టు జరిగేది కాదేమో..?? రేపటి కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగానూ ఆయన ఉపయోగపడగలిగే పరిస్థితి లేదు. ఆ నిరుపయోగత్వం నుంచే కవిత అరెస్టు సులువుగా జరిగిపోయింది. మద్యం కేసులో ఆమె కథానాయిక కాదు. సంధానకర్త వంటి 💐పాత్రలో మాత్రమే ఆమె ఉన్నారట, కేసుకు ఆ పాత్రే కీలకం మరి. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి పూర్వరంగంగా ఆమె అరెస్టు జరిగింది. ఆమెను ప్రధాన ముద్దాయిల్లో చేర్చి కూడా, అరెస్టు చేయకుండా ఉండే సామర్థ్యం, చాతుర్యం దర్యాప్తు సంస్థలకు ఉన్నాయి కానీ, అంతటి ఔదార్యం ప్రకటించవలసిన అవసరం ఇప్పుడు లేదు. కవిత మీద కానీ, బిఆర్ఎస్ మీద కానీ కేంద్ర ప్రభుత్వం, బిజేపీ, మోదీ, షా కత్తిగట్టారనుకోవడానికి తగిన రాజకీయ వాదన చెలామణిలో లేదు. తెలంగాణ అధికార కుటుంబ సభ్యురాలై ఉండి కూడా, రాష్ట్ర రాజకీయాలలో అప్రధానమైన పాత్రలోనే మిగిలిపోయిన వ్యక్తి, ఇట్లా రాష్ట్రం దాటి దేశ రాజధానిలో ఏదో ధనార్జన మార్గంలో, అది కూడా ఏమంత గౌరవప్రదం కాని మద్యం వ్యాపారంలో, ప్రమేయం పెట్టుకోవడం ప్రజలు హర్షించలేదు. కుంగి కునారిల్లిన దశలో, బిఆర్‌ఎస్‌కు మోదీ మీద కత్తులు నూరగలిగే విలాసత్వమూ లేదు.

◆ కేజ్రీవాల్ విషయం అట్లా కాదు.
దేశమంతా గెలిచినా ఢిల్లీలో తాము గెలవలేకపోతున్నామని, ఉన్నచోట ఉండకుండా అతను ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్నాడని, అన్నిటి కంటె మించి, ‘ఇండియా కూటమి’లో భాగమయ్యాడని బిజేపీకి ఆయనంటే కోపం ఉంది. కేజ్రీవాల్ అరెస్టులో నైతిక నిష్ఠ కంటె, పగా ప్రతీకారాలూ ఎక్కువని అంటే, బిజేపీ వీరాభిమానులు కూడా పెద్దగా ఖండించబోరు. 370 నుండి 400 స్థానాల లక్ష్యాలను అందుకోవడానికి కేజ్రీవాల్ ఒక అవరోధం కూడా కావచ్చు. ఇన్ని రాజకీయ కారణాలున్నంత మాత్రాన, కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో లేరని కాదు. కాకపోతే, తన మీద అభియోగం తప్పని, ఇదంతా కక్షసాధింపు అని ఆయన చెప్పుకుంటే జనం వింటారు, హేళన చేయరు. అరవింద్ కేజ్రీవాల్ అవినీతి సొమ్ము తీసుకుని, గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఈడీయే చెబుతోంది, కవిత విషయంలో ఆ రాజకీయ కారణం కూడా లేదు.
సమాజంలోని అన్ని రంగాలకు, ఏదో ఒక నైతికమైన చెలియలికట్ట ఉంటుంది. కొందరు వ్యక్తులో, కొన్నిచిహ్నాలో ఆ హద్దులకు ప్రమాణంగా ఉంటారు. రాజకీయ రంగంలో ఒకప్పుడు జయప్రకాశ్ నారాయణ్, తరువాత విపి సింగ్, కొందరికి వాజపేయి, అబ్దుల్ కలాం, అట్లాగే, అన్నా హజారే. ఆయా కాలాల్లో కొంత నైతిక ప్రభ వెలిగించారు. కారుచీకటి అనుకున్న కాలంలో కూడా జనం ఏదో ఒక ఔన్నత్యాన్ని గుర్తించి లేదా భావించి, దాన్ని ఆశగా నిలుపుకుంటారు. అన్నాహజారే పది పన్నెండేళ్ల కిందట, ఈ కేజ్రీవాల్ తో కలిసి ఢిల్లీలో చేసిన హడావుడి, రెండో యూపిఎ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసింది. భ్రష్ఠు పట్టిపోవడానికి తగినంత అవినీతి, దుష్పరిపాలన ఆ ప్రభుత్వం చేయలేదని కాదు. నరేంద్రమోదీ వెలిగిపోవడానికి ముందు, యుపిఎ ప్రభుత్వం కేవలం చీకటి యుగం మాత్రమేనని నమ్మకంగా చెప్పి, జనాల మనస్సులను సిద్ధం చేసిన కూటమి ఆ నీతిపరులదే. తాము చేసిన అవినీతి వ్యతిరేక ఆందోళన ఇంతటి నిరంకుశ పాలనను తీసుకువస్తుందని ఊహించలేదని ఒక్క యోగేంద్ర యాదవ్ మాత్రమే పశ్చాత్తాపపడ్డట్టున్నారు. తాము ఎటువంటి పర్యవసానాలకు కారణమయ్యారో, సిసోడియా, కేజ్రీవాల్ అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు. ఇప్పుడు, నైతికమైన బెంచ్ మార్క్ లేవీ సమాజంలో లేవని, అక్కరలేదని కూడా బిజేపీ భావిస్తున్నది. నీతి కబుర్లు చెప్పేవారందరూ అవినీతిపరులని నిరూపణ అయిందని, బలంగా ఉండి, దేశాన్ని దృఢత్వం వైపు తీసుకువెళ్లగలిగే తన వంటి రాజకీయ శక్తి ఉనికిలో ఉండగా మరొక ఎంపిక అవసరమే లేదని ప్రజలకు చెబుతోంది. ప్రాంతీయ పార్టీలు, చిన్న పార్టీలు అన్నీ అయితే కుటుంబ పార్టీలో లేదా అవినీతి పార్టీలో అయి ఉంటాయని ప్రధాని తన సభల్లో పదే పదే చెబుతూ వస్తున్నారు. తను మాత్రమే ప్రజలే కుటుంబంగా జీవిస్తున్నానని చెప్పుకుంటున్నారు. ప్రజల దృష్టిలో ఈ నాయకులను పలచన చేసినంత మాత్రాన సరిపోదు కాబట్టి, ఆ పార్టీల బలాన్ని, బలగాన్ని ఛిన్నాభిన్నం చేయడానికి ఒకవైపు దర్యాప్తు యంత్రాంగాలను, మరొక వైపు రాజకీయచాణక్యాన్ని ప్రయోగిస్తున్నారు.
బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి కూడా కేసుల పద్మవ్యూహంలో చిక్కుకోవడం వల్ల మాత్రమే తన పార్టీని నిష్క్రియాత్మకం చేసుకోవలసివచ్చిందని చెబుతారు. అఖిలేశ్ యాదవ్ తల మీద కూడా అనేక కత్తులు వేలాడుతున్నాయి. మమతా బెనర్జీ ‘ఇండియా కూటమి’కి వెడంగా మెలగడానికి తగిన కేంద్రకారణమే ఉన్నదని ఊహిస్తున్నారు. నాడు కేసీఆర్ కూడా మాటల్లో మంటలు కురిపించినా, లోలోపల భయభక్తులతో ఉండడానికి కారణాలున్నాయంటారు, జగన్ సంగతి తెలిసిందే. అట్లాగని, ఈ దండోపాయానికి అందరూ, అన్ని వేళలా లొంగిపోతారని అనడానికి లేదు. కొందరు నిలబడతారు, మరికొందరు ఓపిక నశించాక తిరగబడతారు. జైలులో సుదీర్ఘకాలం గడిపినా, ఇంకా కేసులు ముగియక పోయినా, లాలూ ప్రసాద్ బేలగా మారలేదు, జనాకర్షణా కోల్పోలేదు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా తన మీద జరుగుతున్న రాజకీయ దాడికి కుంగిపోయేటట్టు కనిపించడం లేదు. అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి తమ ఓటమికి కారణమైన కేజ్రీవాల్‌తో కాంగ్రెస్ తన సంబంధాలు మెరుగు పరుచుకోవడం విశేషం. ‘ఆప్’ విస్తరణ ప్రయత్నాలమీద బిజేపీతో సమానంగా కాంగ్రెస్ కూడా ఒకప్పుడు అసహనం చూపింది. కొంత కాలం కిందట రెండు పార్టీల మధ్య పొత్తు అసాధ్యమనిపించింది. కానీ, సర్దుబాటు చేసుకోవడంతో పాటు, ఆశ్యర్యకరంగా ఇప్పుడు ఒకరికొకరు నిలబడుతున్నారు కూడా. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి గట్టి రాజకీయ నినాదం లేదని అంతా అంటున్నారు కానీ, భారతీయ జనతా పార్టీకి కూడా ఈ సారి నినాదాల కొరత ఉన్నది. పరివార్ వాద్, భ్రష్ఠాచార్ అన్నీ అయిపోయాయి. అబ్ కీ బార్ మోదీ సర్కార్, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ పోయిన సారే అయిపోయాయి. చార్ సౌ కే పార్ అన్నది పర్వాలేదు కానీ, అది ప్రధాన నినాదం కాలేదు. నినాదమే కాదు, రాజకీయ వాదనే లేదు. రామాలయ ప్రతిష్ఠ ఒక్కటే ఆధారపడదగ్గ ఘనతగా కనిపిస్తున్నది. సాధ్యమైనంత అధిక విజయాలను పోయినసారే సాధించినందున, ఈసారి తరుగే తప్ప పెరుగుదల ఉండదన్నది సాధారణాభిప్రాయం. అయినాసరే, సకల శక్తులను మోహరించి అధికస్య అధికం సాధించాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే, ప్రతిపక్షం అనైతికీకరణ, నిరాయుధీకరణ. ఈ వ్యూహాన్ని గుర్తించి, అవినీతి ముద్రలను ఖాతరు చేయక, రాజకీయ దురుద్దేశ్యాలను ఎలుగెత్తి చాటడమే బాధిత పక్షాలు కనీసంగా చేయవలసింది. ఎన్నికల బాండ్లలో దాగిన రహస్యాలు తెలుస్తున్నప్పుడు, తన నీతి గురించి, ఇతరుల అవినీతి గురించి కేంద్ర ప్రభుత్వ నాయకులు ఎట్లా మాట్లాడగలుగుతారని ఆశ్చర్యం వేస్తుంది. కేంద్ర అధికార పార్టీకి అందిన అనామకపు సొమ్ముతో పోలిస్తే, ఆప్ కు అందిన వందకోట్లు ఎంత..?? రాజకీయ పార్టీలన్నీ అంతో ఇంతో బాండ్ల వీరులే కాబట్టి, పెద్ద కలకలం రాలేదు కానీ, బిజేపీ రాజకీయ సొమ్ము ఏమంత స్వచ్ఛమైనది కాదని, అది దాన దండోపాయాలతో సమకూర్చుకున్నదని బాండ్ల విశ్లేషణలు చెబుతున్నాయి. అధికార పార్టీ వేల కోట్ల అవినీతి విరాళాల మీద జాతీయ మీడియా మౌనం పాటిస్తుంది. కేజ్రీవాల్ అరెస్టు కు మాత్రం ప్రైమ్ టైమ్ లన్నీ అంకితం చేస్తుంది. కార్పొరేట్లతో తన ధనానుబంధం ఎంతటిదో తెలిసిపోయినా, పార్టీలో చేరే పేరు మోసిన అవినీతిపరులకు అభయమిస్తున్నట్టు అందరూ గుర్తించినా, బిజేపీకి ఎందుకు పరువు భయం కలగడం లేదు..?? అన్ని నీతులను రద్దు చేసిన చోట, బలమే నీతి, ధనమే రీతి కాబట్టి. ఉద్వేగాలు వెదజల్లి మనసులను కట్టి వేసిన తరువాత, ఇంద్రజాలికులదే సర్వాధికారం కాబట్టి. ప్రతిపక్ష నేతల నేరం అవినీతిపరులు కావడం కాదు, బలహీనులు కావడమే వారి అసలు పాపం అన్నది మా వాదన.