ఉనికి కోల్పోతున్న సమాచార హక్కు..!!

Submitted by Praneeth Kumar on Mon, 18/12/2023 - 09:47
Right To Information Act Missing It's Direction..!!

ఉనికి కోల్పోతున్న సమాచార హక్కు..!!

ఖమ్మం, డిసెంబర్ 18, ప్రజాజ్యోతి.

దేన్నయినా సరే పీకిపాకం పెట్టడమంటే రాజకీయ నాయకులకు మహా ఇష్టం. ముఖ్యంగా జనానికి కాస్త మేలు చేసే విధానాలూ, చట్టాల అంతు చూడకుండానైతే నేతలకు నిద్రపట్టదు. దానికి ఉదాహరణ సమాచార హక్కు చట్టానికి పట్టిన దుర్గతే. ప్రజాస్వామ్య ప్రభుత్వాలేవీ రహస్యంగా పనిచేయకూడదు. దేశ రక్షణ వంటి కొన్ని అంశాల గురించి తప్ప సాధారణ పాలనా వ్యవహారాలకు సంబంధించిన అన్ని వివరాలనూ ప్రజలకు చెప్పితీరాలి. ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏమి చేయబోతున్నారనే సమాచారాన్ని పాలకులు కచ్చితంగా జనానికి అందించాలి. అందుకు వీలుకల్పిస్తూ ఆవిర్భవించిందే సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం.
పద్దెనిమిదేళ్ల క్రితం పురుడుపోసుకున్న ఆ శాసనం మొదట్లో కొన్నాళ్ల పాటు కాస్త పద్ధతిగానే అమలైంది. ఎన్నో అవినీతి బాగోతాలను అది బట్టబయలు చేసింది. దెబ్బకు పార్టీలకు అతీతంగా పాలకులందరికి స.హ చట్టం కంటగింపు అయ్యింది. పైకి పోసుకోలు కబుర్లు చెప్పేవారే కానీ, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే నాయకులు నేడు అరుదైపోయారు కదా. అటువంటి వారికి ఆర్టీఐ అంటే కడుపులో మంట ఎక్కువైంది. ప్రజలకు అన్నీ తెలిసిపోతే తమ కూసాలెక్కడ కదిలిపోతాయోనన్న భయం పుట్టింది. నేతలకు తోడుదొంగలైన అధికారులకు ఆర్టీఐ జడుపు జ్వరం పట్టుకుంది. అంతే స.హ చట్టాన్ని సర్వనాశనం చేసే దుర్మార్గ ప్రయత్నాలు దేశవ్యాప్తంగా జోరందుకున్నాయి. ప్రజల సమాచార హక్కుకు సర్కారీ సంకెళ్లు బిగుసుకున్నాయి. ఆకాశ గంగ దివి నుంచి పాతాళానికి పతనమైనట్లు ఆర్టీఐ చట్టం అమలు క్రమంగా పడకేస్తూ నేడు పూర్తిగా సమాధి స్థితికి చేరింది.

◆ ఆయువుపట్టు మీద కొడితే ఎంతటి వారైనా విలవిల్లాడిపోతారు.
సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వాలు అలాగే దారుణంగా దెబ్బతీశాయి. ఆర్టీఐ శాసనానికి ప్రాణాధారమైనవని సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానమే అభివర్ణించిన సమాచార కమిషన్లను సర్కార్లు నిర్వీర్యం చేశాయి. అడిగిన సమాచారాన్ని ఇచ్చేందుకు అధికారులు మొండికేస్తే ప్రజలు కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్లను ఆశ్రయిస్తారు. అలా దాఖలయ్యే రెండో అప్పీళ్లూ ఫిర్యాదులను విచారించి, సర్కారీ యంత్రాంగం నుంచి జనానికి సమాచారం ఇప్పించడం కమిషన్ల కర్తవ్యం. ఆర్టీఐ చట్ట నిబంధనలను బుట్టదాఖలు చేసే అధికారుల పై జరిమానా కొరడా ఝళిపించడమూ వాటి పనే. అంతటి కీలకమైన కమిషన్లు ఖాళీ అయితే ‘మా సమాచార హక్కును కాలరాస్తున్నారం' టూ అధికారుల పై ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయగలరు..?? ఆ అవకాశం వారికి లేనప్పుడు ఇక వచ్చిన దరఖాస్తులను వచ్చినట్లు తిరగ్గొట్టే సర్కారీ సిబ్బంది పై ఈగైనా వాలదు. ప్రభుత్వ దస్త్రాల్లో దాగిన అక్రమాలు కాదు కదా, వాటి ఆనుపానులు కూడా బయటికి రావు. అందుకోసమే న్యాయపాలిక గట్టిగా మొట్టికాయలు వేస్తున్నా సమాచార కమిషనర్ల నియామకాలను సర్కార్లు పేరపెడుతున్నాయి.
జార్ఖండ్ ప్రధాన సమాచార కమిషనర్‌ (సీఐసీ) పదవి 2019 నవంబర్‌లో ఖాళీ అయ్యింది. దరిమిలా అక్కడ మిగిలిన ఏకైక కమిషనర్‌ తాత్కాలిక సీఐసీ అయ్యారు. ఆయన పదవీ కాలమూ 2020 మే నెలలో ముగిసిపోయింది. ఆనాటి నుంచి కమిషన్‌ ఖాళీగా పడి ఉండి సమాచార హక్కు చట్టాన్ని వెక్కిరిస్తోంది.
త్రిపురలో కూడా 2021 జులై నుంచి సమాచార కమిషనర్లు ఎవరూ లేరు.
తెలంగాణలోనూ దాదాపు పది నెలలుగా అదే దుస్థితి.
స.హ చట్టం ప్రకారం కేంద్రంలో, ప్రతి రాష్ట్రంలో ప్రధాన సమాచార కమిషనర్‌తో పాటు పది మందికి మించకుండా కమిషనర్లు ఉండాలి. ప్రస్తుతం కేంద్ర సమాచార కమిషన్‌లో సీఐసీతో పాటు ఇద్దరంటే ఇద్దరే కమిషనర్లు పనిచేస్తున్నారు.
బిహార్‌లో ఒకే ఒక్క కమిషనర్‌ తప్ప ఇంకెవరూ లేరు.
ఒడిశా, పశ్చిమ్‌ బెంగాల్‌ కమిషన్లలో ముగ్గురు.
ఏపీ, కర్ణాటకలో అయిదుగురు చొప్పునే ఉన్నారు.
ఇలా కమిషనర్లు లేక విచారణలు జరగక రెండో అప్పీళ్లు, ఫిర్యాదులు విపరీతంగా పెండింగ్‌లో పడుతున్నాయి.
సతర్క్‌ నాగరిక్‌ సంఘటన్‌ సంస్థ నివేదిక ప్రకారం ఈ ఏడాది జూన్‌ నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 27 కమిషన్లలో 3.21లక్షలకు పైగా కేసులు అపరిష్కృతంగా మూలుగుతున్నాయి. పారదర్శకంగా పరిపాలిస్తూ, ప్రజలకు జవాబుదారీగా మెలగాల్సిన ప్రభుత్వాలు జనం కళ్లుగప్పి చీకటి బాగోతాలకు తెగబడుతున్నాయి. సమాచార కమిషన్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చి తమ పబ్బం గడుపుకొంటున్నాయి.
సమాచార కమిషనర్ల పోస్టులు ఖాళీ కావడానికి ఒకటి రెండు నెలల ముందే కొత్తవారి ఎంపిక ప్రక్రియ ప్రారంభం కావాలని సుప్రీంకోర్టు ఏనాడో తీర్పిచ్చింది. ఎవరి మాటా వినని మొండి రాజుల్లా ప్రవర్తిస్తున్న పాలకులు ‘సుప్రీం’ ఉత్తర్వులనూ బుట్టదాఖలు చేస్తున్నారు. దాని పై న్యాయపాలిక ఇటీవల స్పందిస్తూ కమిషనర్ల నియామకాల్లో ప్రభుత్వాల వైఫల్యం కారణంగా ఆర్టీఐ చట్టం నిర్జీవమవుతోందని ఆవేదన వెలిబుచ్చింది. సత్వరం పోస్టుల భర్తీ చేపట్టాలని కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలనూ అది ఆదేశించింది. మొద్దు రాతి చిప్పలకు పర్యాయపదాలైన ప్రభుత్వాలకు అది చెవికెక్కుతుందా..?? కమిషనర్ల నియామకాలను తప్పక చేపట్టాల్సి వస్తే ప్రభుత్వాలు ఇంకో దొంగదారిని అనుసరిస్తున్నాయి. వృత్తి జీవితాంతం సర్కారీ సేవలోనే గడిపిన విశ్రాంత అధికారులు, తమ అడుగులకు మడుగులొత్తే వ్యక్తులనే ఎక్కువగా కమిషనర్లుగా కొలువుతీరుస్తున్నాయి. తమ రాజకీయ యజమానులకు ఇబ్బందేమీ రాకుండా భయ భక్తులతో విధులు నిర్వర్తిస్తున్న వారు స.హ చట్టానికి వెన్నుపోటు పొడుస్తున్నారు.
2022 జులై నుంచి 2023 జూన్‌ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 27 సమాచార కమిషన్లు దాదాపు 2.15 లక్షల కేసుల్లో ఆదేశాలు జారీచేశాయి. వాటిలో ఎనిమిది వేల కేసుల్లోనే అవి సంబంధిత అధికారులకు జరిమానాలు విధించాయి. అంటే సగటున వందకు నాలుగు సందర్భాల్లో కూడా అవి ఆర్టీఐ విఘాతకులకు తగిన శిక్షలు విధించడం లేదు. క్రమం తప్పకుండా వార్షిక నివేదికలను ప్రచురించాలన్న చట్ట నిబంధనకూ కమిషన్లు నిలువు పాతరేస్తున్నాయి.
సమర్థులు, అధికారపక్షాలతో అంటకాగని వారు, భిన్న రంగాలకు చెందిన ప్రజ్ఞావంతులు కమిషనర్లు అయితేనే స.హ దరఖాస్తుదారులకు న్యాయం జరుగుతుంది. ఆ మేరకు కమిషనర్ల నియామక విధివిధానాలు మారాలి. ఎంపికలు నిష్పాక్షికంగా సకాలంలో పూర్తికావాలి. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందన్నది భారతీయుల విశ్వాసం. అలాగే వ్యవస్థలను రక్షించుకుంటేనే అవి మనల్ని రక్షించగలవు. ప్రజలతో పాటు పాలకులకూ ఆ విషయం అవగతమైతేనే దేశంలో ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టగలుగుతుంది అన్నది మా వాదన.