జ్ఞానం ముసుగులో 'అజ్ఞానుల ప్రవచనాలు'.

Submitted by Praneeth Kumar on Fri, 15/12/2023 - 09:50
The prophecies of the ignorant in the guise of knowledge.

జ్ఞానం ముసుగులో 'అజ్ఞానుల ప్రవచనాలు'.

ఖమ్మం, డిసెంబర్ 15, ప్రజాజ్యోతి.

మానవులంతా ఒకే జాతివారని చెప్పేందుకు ప్రత్యేక సాక్ష్యాధారాలేం అవసరం లేదు. ఒక కుక్క మరో కుక్కని చూసినపుడు అది తన జాతికి చెందిన జంతువే అని గ్రహించగలుగుతుంది. మనిషికి మాత్రమే తోటి మనిషిని చూసినపుడు అనేక సందేహాలు కలుగుతుంటాయి. అంటే జంతువుకంటే మనిషే నికృష్టంగా ప్రవర్తిస్తున్నా డన్నమాట. ఈ మతం, ఆ మతం అని కాదు దాదాపుగా అన్నీ ఒకటే, బయటికి అన్నీ వేరు వేరుగా కనిపిస్తాయి. కాని, మూర్ఖత్వాన్ని ప్రచారం చేయడంలో ఒకే రకంగా ప్రవర్తిస్తాయి. వేర్వేరు భాషల్లో ప్రవచనాలు, బోధలు, సూక్తులు, దైవ వాక్కుల పేరుతో వేరు వేరు ప్రాంతాల్లోని జనానికి అసత్యాలు బోధిస్తుంటాయి. మూఢ విశ్వాసాలు ప్రచారం చేయడంలో అన్నీ సమైక్యంగా కృషి చేస్తాయి. అసలు విషయం గ్రహించలేక, జనం ‘మా మతమే గొప్పది ఇతరులది కాదు’ అని పోట్లాడుకుంటూ ఉంటారు, వారిలో వారు ద్వేష భావంతో రగిలిపోతుంటారు. మతం గుప్పిట్లోంచి బయటపడిన వారికే నిజాలు బోధపడతాయి, జీవిత సత్యాలు అర్థమవుతాయి.
జై శ్రీరామ్‌ అంటూ మనోభావాలు దెబ్బతిన్నాయనే వారు కొందరుంటారు. మీకు హిందూ మతమే దొరి కిందా..?? ఇతర మతాల్ని విమర్శించే గుండె ధైర్యం మీకు ఉందా..?? అని సవాలు విసురుతుంటారు. అలాంటి వారు ఒక విషయం ఆలోచించాలి. ముందు ఎవడి ఇల్లు వాడు శుభ్రం చేసుకుని కదా వీధిలోకి చూడాలి..?? ఆ తర్వాత ఎదురిల్లూ ఈ పక్క ఆ పక్క ఇళ్ళూనూ, మీ ఇంట్లో మురికి అలాగే పెట్టుకుని, ఇతరుల ఇళ్లు శుభ్రం చేయడానికి బయలుదేరుతారా.. బయలు దేరరు కదా..?? ఇదీ అలాంటిదే మత మౌఢ్యాన్ని నిరసించేవారు అన్ని మతాల్లోని మౌఢ్యాన్ని నిరసిస్తారు, ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి. ముందు కాస్త అవగాహన పెంచుకోవాలి, ఆ తరువాతే నోరు విప్పాలి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాను ఎవరికి వారు విశ్లేషించుకుని, ఆలోచించుకోండి.
ఎవడైనా శివనింద చేస్తే వాడి నాలుక ఎడం చేత్తో పట్టుకుని, పైకి లాగి – కత్తితో మొదటికి పరపరా కోసెయ్యాలి.
శివనింద తట్టుకోలేక పోతే ప్రాణం వదిలిపెట్టెయ్యాలి.
ఈ రెండింటికి నువ్వు చాలకపోతే, చెవులు మూసుకుని వెళ్ళిపోవాలి.
శివనింద వినరాదు – అనరాదు – చేయరాదు.
ఇలాంటి మూర్ఖపు బోధనలు చేసేవారు మనమధ్యనే ఉన్నారు. వివేకం అడుగంటిన వారు గడ్డిపోచ ‘పాటి’ వారు మన మధ్యనే ఉన్నారు, జాగ్రత్త. వారిని దరికి రానీయకండి. మీ వివేకాన్ని కప్పేసుకోకండి, మతాలు సాగించే పేచీలు ఎలా ఉంటాయో మహాకవి గుర్రం జాషువా వర్ణించిన తీరు చూడండి. ఒకడు రుద్రాక్ష మాలికలు నెత్తికి చుట్టి/శివమూర్తియై భూమి కవతరించు/ ఒక డూర్ధ్వపుండ్రంబులురువుగా తగిలించి/ శివలింగమును జూచి చీదరించు. ఒకడు రెండును గాని వికట వేషము దాల్చి/ పై వారి మీద సవాలు చేయు. ఒకడు గంజాయి దమ్ముకు దాసుడై పోయి/ బూడిద గురవడై పుట్టివచ్చు. మనుజులారా మాది ఘనమైన మతమని/ ఒకడు తరిమి తరిమి ఉగ్గడించు/ పెక్కు మతము లిట్లు పేచీలు సాగింప/ మార్గమేది ఐక్యమత్యమునకు/ చిలిపి రాళ్ళకు నగిషీలు చెక్కి చెక్కి/ కాలమెంత యుగాంతాన గలిపిరొక్కొ/ చదువనేర్చిన వెర్రిని చంపగలరె..??
ప్రతి శివరాత్రికి ఈశా ఫౌండేషన్‌ నిర్వాహకుడు జగ్గీ వాసుదేవ్‌ ఐదు లక్షల యాభైవేల, ఐదు వందల టికెట్లు అమ్ము కుంటూ ఉంటాడు. దేవుడు, ఆధ్యాత్మికత పేరుతో వ్యాపారం చేస్తున్నాడని స్వయంగా తమిళనాడు ఆర్థిక మంత్రి పిటిఆర్‌ పళనివేల్‌ త్యాగరాజన్‌ ప్రకటించాడు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాలను తమ గుప్పిట్లోంచి వదిలేయాలని, వాటిని భక్తులకు అప్పగించాలనీ జగ్గీ వాసుదేవ్‌ చేసిన ప్రకటనకు ప్రతిస్పందనగా ఆర్థిక మంత్రి, జగ్గీ బండారం బయట పెట్టాడు. ఆధ్యాత్మికత పేరుతో ధనిక వర్గాన్ని మోసం చేస్తూ, వ్యాపారాలు చేస్తున్న బాబాల – స్వాముల బండారం బయట పెట్టాల్సిందే. ఆదివాసుల భూములు అక్రమంగా ఆక్రమించుకుని ‘ఈషా’ ఫౌండేషన్‌ స్థాపించుకున్న మోసగాడు జగ్గీవాసుదేవ్‌. తన భార్యను హత్య చేసిన హంతకుడతను. అలాంటి వాడి మీద ప్రభుత్వం ఎందుకు ఉదాసీన వైఖరితో ఉంది..?? ఇంతవరకు కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..??
ఇటీవల స్వామి ఆనంద్‌ స్వరూప్‌ వ్యభిచారం బయట పడింది. ముస్లింలు, క్రైస్తవులు భారతదేశం నుండి వెళ్ళిపోవాలని ప్రభోదించిన శంకరాచార్య పరిషత్‌ అధ్యక్షుడు స్వామి ఆనంద స్వరూప్‌ శ్రీలంకలో వేశ్యలతో పట్టుబడ్డాడు. ఒక గదిలో ఒకేసారి ఇద్దరు మహిళలతో దొరికిపోయాడు. వీడియో జర్నలిస్ట్‌లు కెమెరాలతో ఆ గదిలోకి ప్రవేశించే సరికి బట్టలు కప్పుకుంటూ ఆ ముగ్గురూ నానా తంటాలు పడ్డారు. స్వామి ఆనంద స్వరూప్‌ అనే వాడికి దేహశుద్ది జరిగింది. ఈ మొత్తం చిత్రించిన వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. బుద్ది, జ్ఞానంలేని వాళ్లు ఈ దేశంలో స్వామీజీలు అయిపోతున్నారు. లేదా బూర్జువా రాజకీయ పార్టీలలో నాయకులై అధికారం చేజిక్కించుకుంటున్నారు. ఈ పరిస్థితి మారాలి. మతాలకు రాజకీయాలకు ఉన్నలింకు తెగితేనే అది సాధ్యం. కేవలం పదిహేను వందల ఏళ్ళ క్రితం మదీనాలో అంటే దేవదూత అనబడే ప్రాఫెట్‌ మహ్మద్‌ జన్మస్థానంలోనే ఖురాన్‌ అంటే ఏమిటో ఎవరికి తెలియదు. సాధారణ శకం 570-632 జ.జు మధ్య కాలంలో జీవించిన ప్రాఫెట్‌ మహ్మద్‌ జ్వరంతో చనిపోయాడని చరిత్రలో నమోదై ఉంది. మరి ఆదేవదూతను ఏ దేవుడూ బతికించలేదు. ఖురాన్‌ సృష్టి ప్రారంభం నుండే ఉంది అని ముస్లిం మత పెద్దలు ప్రచారం చేసుకుంటారు. అన్ని మతాల మత పెద్దలదీ ఇదే వరస, అబద్దాలనే ప్రచారం చేశారు. ఇంకా చేస్తునే ఉన్నారు. మా మతంలో చంద్రుడికి చాలా ప్రాముఖ్యం ఇవ్వబడింది. ఎందుకంటే చంద్రుడు రాత్రి వేళల్లో మాకు అవసరమున్నప్పుడు వెలుగునిస్తాడు. సూర్యుడిలాగా పగటి పూట వెలగడు పగటి పూట వెలుతురు ఎవడికి కావాలి..?? దీని వల్ల ఏం తెలుస్తుందంటే మతాలన్నీంటిలోకి మా ముస్లిం మతమే తెలివైనదని అని అన్నాడు. ఒక ముస్లిం మత పెద్ద మౌలాన హుజూర్‌ ముఖ్‌ ముద్దీన్‌ ఖాన్‌ వారి తెలివిగల మతం గురించి ఈ తెలివిగల మతపెద్ద ఎంత తెలివిగా మాట్లాడారో కదా..?? పగటి వెలుగులన్నీ సూర్యుడిస్తున్నవేనన్న ప్రాథమిక అవగాహన లేని ఈ మౌలాన, మూర్ఖత్వాన్ని ఎవడు ఛేదించాలి..?? సూర్యుడి వెలుగులు లేకపోతే చెట్లు, జంతువులు, మనుషులు ఏవీ బతకలేవని ఈయనకు ఎవరు చెప్పాలి.?? ఇక, విటమిన్‌ డి పరిజ్ఞానం కలగాలంటే ఇంకా ఎన్ని శతాబ్దాలు గడవాలి..??
గొప్పగా చెప్పుకునే ఖురాన్‌ లోని కొన్ని అంశాలు చూద్దాం. మానవీయ విలువల్ని అది ఎంతగా నిలుప గలుగుతుందో ఆలోచిద్దాం..!!
అల్లాను నమ్మని వారిని కనిపించిన చోటనే నరికి చంపండి (2:191), ముస్లింలు, ముస్లింలు కాని వారితో స్నేహం చేయరాదు (3:28), ఇస్లాం తప్ప ఇంకే మతమూ ఒప్పుకోబడదు (3:85), ఇస్లాంను విమర్శించే వారిని వికలాంగులను చేసి వేలా డదీయండి (5:33), ఖురాన్‌ కాక, ఇతర గ్రంథాలను నమ్మే వారిని భయభ్రాంతులను చేసి వారి తలలు తీయండి (8:12), అల్లాను నమ్మనివారిని భయభ్రాంతులను చేయుటకు ముస్లింలు తమవద్ద ఉన్న అన్ని ఆయుధాలను వాడాలి (8:60), అల్లాను నమ్మనివారు మూర్ఖులు ముస్లింలు వారితో పోరాడాలి (8:65), అవకాశం దొరకగానే అల్లాను నమ్మని వారిని ఎక్కడ దొరికితే అక్కడ చంపేయండి (9:5), యూదులు, క్రిస్టియన్లు భ్రష్టులు వారితో పోరాడండి (9:30), మీ ఇంటి చుట్టు పక్కల ఉండే అవిశ్వాసులతో యుద్ధం చేయండి (9:123), అల్లాను నమ్మని వారిని కాలుతున్న బట్టలతో ఇనుప చువ్వలతో, మసిలే నీళ్ళతో శిక్షించండి వారి చర్మం, శరీరం కరిగిపోవాలి (22:19), అల్లాను నమ్మని వారితో శాంతికోసం, సంధికోసం, ప్రయత్నించకండి వారు దొరికినంతనే నరికేయండి (47:4),
శివనింద చేసిన వాణ్ణి ఏం చేయాలో ఓ హిందూ గురువు చెప్పాడు కదా..?? అల్లాను నమ్మని వాణ్ణి ఏం చేయాలో ఈ ముస్లిం గ్రంథం కూడా చెపుతోంది. ఇలాంటి మతాలు, మత గ్రంథాలు, మత గురువులూ మనకు అవసరమా..?? ఇవి మానవ సంక్షేమం కోసం, ప్రపంచ శాంతి కోసం దోహదం చేసేవేనా..?? ఉగ్రవాదం బలపడడానికి ఇవి కారణం కాదా..??
నోబెల్‌ పురస్కార గ్రహీత మలాలా యూసఫ్‌ జారు ఏమన్నారో గుర్తుచేసుకోండి ముందు తరాలకు విద్యను అందించాలి లేకపోతే వారికి ఉగ్రవాదులు తుపాకులు అందిస్తారు అని ఆమె చెప్పిన మాట నిత్యజీవితంలో మనకు కనపడుతూ ఉంది. మన కళ్ళ ముందు ఉన్నా మనం చూడని, చూడలేని విషయాలు అనేకం ఉంటాయి. కొన్ని భయం వల్ల చూడం, కొన్ని బలమైన భావజాల ప్రభావం వల్ల మనకు కనిపించవు. ఒక్కోసారి మనకు అలవడిన దృక్కోణం వల్ల గానీ, మనం ఎంచుకున్న దృక్కోణం వల్లగానీ, కొన్ని విషయాలు కళ్ళముందు ఉండి కూడా కనిపించవు. వీటిలో విడి విడి విషయాలే కావు. సామాజిక క్రమాలు కూడా ఉంటాయి. వీటిని మనకు చూపించడం సాహిత్యం చేసే పనులలో ఒకటి – అన్నారు మానవ హక్కుల ఉద్యమ నేత బాలగోపాల్‌. 'నిజమే అలాంటి సాహిత్యాన్ని సృష్టించుకుంటూ, దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం ఇప్పుడు మన అందరి తక్షణ కర్తవ్యం' అన్నది మా వాదన.