ముగిసిన ఆర్మూర్ మున్సిపల్ వివాదం... ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సూచనలతో వెనక్కి తగ్గిన కౌన్సిలర్లు...: మీడియా సృష్టి అంటూ కౌన్సిలర్ల వ్యాఖ్య...

Submitted by SANJEEVAIAH on Sat, 21/01/2023 - 17:39
ఫోటో

ముగిసిన ఆర్మూర్ మున్సిపల్ వివాదం

ముకుమ్మడిగా ప్రెస్ మీట్ ఏర్పాటు

మీడియా సృష్టి అని నెట్టేసిన వైనం

జీవన్ రెడ్డి సూచనలతో సద్దుమణిగిన వివాదం

(నిజామాబాద్, ప్రజాజ్యోతి, జనవరి 21)

 

ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ వివాదంలో కౌన్సిలర్లు యూ టర్న్ తీసుకున్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిసే వరకు పంతం పట్టుదలతో ఉన్న కౌన్సిలర్లు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సూచన మేరకే యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి ఆర్మూర్ చేరుకున్న కౌన్సిలర్లు మూకుమ్మడిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేయడం విశేషం. అయితే ఈ వ్యవహారం మొత్తం వెనకాల ఉండి నడిపిన వారికి చుక్కెదురు అయింది. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకొని కౌన్సిలర్లకు పలు రకాల హామీలు ఇవ్వడంతోనే కౌన్సిలర్ అందరూ వెనుకడుగు వేసినట్లు సమాచారం. అలాగే మున్సిపాలిటీలో ఎలాంటి విభేదాలు లేవని ఇదంతా మీడియా సృష్టి అంటు కౌన్సిలర్ల లు వివాదానికి పులిస్టప్ పెట్టారు. చేసిందంతా చేసి తమకేమీ తెలియదు అన్నట్లు చెప్పి చేతులు దులుపు కున్నారు.

ఖందేష్ సంగతేమిటి.?

ఆర్మూర్ మున్సిపాలిటీలోని వార్డుల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులలోను మున్సిపల్ చైర్పర్సన్ భర్త పండిత్ పవన్ తో పాటు ఆయన సోదరుడు ప్రేమ్ లు కూడా కలుగజేసుకోవడంతో కౌన్సిలర్లు అలుకాపానుపు ఏక్కారు. వారి ఇష్ట ప్రకారంగానే పనులు చేస్తున్నారనే అనేది ప్రధాన ఆరోపణ ఉంది. అయితే పార్టీలోను సీనియర్ నాయకుడైన ఖందేష్ కు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీ తోనే పలువురు కౌన్సిలర్లు కలిసి తిరుగుబాటు జెండా ఎత్తినట్లు తెలుస్తుంది. ఈ కోవలోనే కౌన్సిలర్లు అందరూ ఏకమై ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిసినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న రాజకీయ వ్యవహారాలతో పాటు ఇతర పార్టీల వ్యవహారాలు బి అర్ ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఆర్మూర్ లోని కీలకమైన మున్సిపాలిటీలో విభేదాలు రావడం అనేది ఇబ్బందికరంగా మారుతుందనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకొని కౌన్సిలర్లు అందరికీ నచ్చజెప్పి పంపడం విశేషం. అయితే గతంలో జరిగిన వ్యవహారంతో ముడిపడి ఉండడం వల్ల ఎన్నికల తర్వాత ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఆర్మూర్ పుర పాలక సంస్థ పై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తుంది. అప్పటివరకు ఎలాంటి విభేదాలు ఉన్నప్పటికీ అందరి కలిసి ఉండాలని ఎమ్మెల్యే సూచించినట్లు సమాచారం. ఈ కోవలోనే మున్సిపల్ చైర్ పర్సన్ సైతం కలుపుకునే కౌన్సిలర్లంతా ఒకే గొంతుకై మాట్లాడడం జరిగిందని పార్టీ వర్గాలే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ బోధన్ మున్సిపాలిటీలో గతంలో జరిగిన చైర్మన్ వివాదం లాగే ఆర్మూర్ మున్సిపల్ వివాదం కూడా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కలగజేసుకోవడంతో సద్దుమణిగింది. ఏది ఏమైనా రాజకీయాలలో అవసరం, అవకాశం కలిసి వస్తే ఏదైనా జరుగుతుందని చెప్పడానికి మంచి ఉదాహరణ ఇదే మరి.