ఇదేనా ‘మాతృవందనం’ ..??

Submitted by Praneeth Kumar on Wed, 27/03/2024 - 09:59
Is this 'mothers greeting'..??

ఇదేనా ‘మాతృవందనం’ ..??
◆ కేటాయింపులు నాస్తి - ఖర్చులు జాస్తి.
◆ కఠిన నిబంధనలతో లబ్దిదారుల అనాసక్తత.
◆ ఆరోగ్య రక్షణలో ఇబ్బంది పడుతున్న గర్భిణులు.

ఖమ్మం, మార్చి 27, ప్రజాజ్యోతి.

మహిళలంటే ఎనలేని ప్రేమ చూపటమే కాదు అంతా మీకోసమే అన్నట్టుగా బిజేపి ఓటు రాజకీయం చేస్తోందనటానికి తాజా ఉదాహరణ 'మాతృవందనం' పథకం. గర్భిణుల కోసం ప్రవేశ పెట్టిన ఈ పథకం కూడా ఓట్లుగా మలుచుకోవటానికేనని స్పష్టమవుతోంది. వాస్తవ పరిశీలనలో 'మాతృవందనం' పథకానికి కేంద్రం తూట్లు పొడుస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం గర్భిణులు, పాలిచ్చే తల్లుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆర్భాటంగా ప్రారంభించిన ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం కఠినతరమైన నిబంధనలు, నిధుల కొరత కారణంగా నీరుగారిపోతోంది. మరోవైపు ఈ పథకానికి బడ్జెటరీ కేటాయింపులు నానాటికి తగ్గిపోతున్నాయి. ఫలితంగా గర్భిణులు తమకు అందజేస్తున్న అరకొర ఆర్థిక సాయం కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది.
జాతీయ ఆహార భద్రతా చట్టంలోని నిబంధనలను అనుసరించి 2017లో మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకాన్ని తీసుకొచ్చింది. తొలిసారి గర్భం దాల్చిన మహిళలకు, పాలిచ్చే తల్లులకు రూ.5000 ఆర్థిక సాయాన్ని అందజేస్తానని తెలిపింది. గర్భిణులు, పాలిచ్చే తల్లులు పాక్షికంగా ఉపాధి కోల్పోతారని, అంతేకాక తల్లీబిడ్డల ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని, అందుకోసం ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. 2022లో ఈ పథకాన్ని ఆధునీకరించి మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన మిషన్‌ శక్తి పథకంలో చేర్చారు. సవరించిన ఈ పథకానికి పిఎంఎంవీవై 2.0 అని పేరు పెట్టారు. భ్రూణహత్యలను నివారించడానికి రెండో శిశువుకు (ఆడపిల్ల అయితే) రూ.6000 అలవెన్సును ప్రకటించారు. రుబీనా షేక్‌ అనే మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి రూ.10,000 ఖర్చు చేసింది. ఆ తర్వాత ఆమెకు రెండో బిడ్డ పుట్టింది. ప్రధానమంత్రి మాతృవందన యోజన (పిఎంఎంవీవై) పథకం కింద తనకు రావాల్సిన రూ.6,000 ఆర్థిక సాయం కోసం ఆమె ఇంకా ఎదురు చూస్తోంది. గర్భిణులకు సాయం అందించడానికి కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని ఏడు సంవత్సరాల క్రితమే ప్రవేశపెట్టినప్పటికి దాని అమలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనికి బడ్జెటరీ కేటాయింపులు కూడా నానాటికీ తగ్గిపోతున్నాయి. అడ్డంకిగా మారిన నిబంధనలు
ఈ పథకానికి అర్హత సాధించాలంటే మహిళలు భగీరథ ప్రయత్నమే చేయాల్సి వస్తోంది. వారు తమ బ్యాంక్‌ ఖాతా వివరాలు, ఆధార్‌, రేషన్‌ కార్డు వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులు, తల్లీపిల్లల రక్షణ కార్డు (ఎంసీపీ)లోని రిజిస్ట్రేషన్‌ వివరాలు అందజేయాల్సి ఉంటుంది. అయితే చాలా మంది మహిళల వద్ద ఈ కార్డులు, వివరాలు సరిగా లేవు. పోనీ ఎలాగొలా ఆ వివరాలన్నీ సమర్పించగానే అసలు కష్టాలు మొదలవుతాయి. సొమ్ము చెల్లింపునకు సంబంధించిన వాయిదాల సమయంలో అనేక నిబంధనలను పాటించాల్సి వస్తోంది. ఆస్పత్రిలో ఎప్పుడు పరీక్ష చేయించుకున్నారు, గర్భాన్ని ధ్రువీకరిస్తూ ఎప్పుడు నమోదు చేశారు, వ్యాక్సిన్లు ఎప్పుడు తీసుకున్నారు వంటి వివరాలన్నింటిని ఎప్పటికప్పుడు సమర్పించాల్సి ఉంటుంది. పైగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళల్లో విద్యావంతులు తక్కువ. సమాచార సాంకేతిక పరిజ్ఞానం కూడా వారికి సరిగా అందుబాటులో ఉండదు. పైగా సాంస్కృతిక సంప్రదాయాలు, నమ్మకాలు మహిళల పై ఆంక్షలు విధిస్తుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో తొలిసారి గర్భం దాల్చిన మహిళల్లో కేవలం 67 శాతం మంది మాత్రమే కనీసం నాలుగు సార్లు వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు.
తగ్గుతున్న కేటాయింపులు
తొలిసారి శిశువుకు జన్మనిచ్చిన తల్లికి అందజేస్తున్న ఆర్థిక సాయం 2017 నుండి ఎదుగూ బొదుగూ లేకుండా అలాగే ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ద్రవ్యోల్బణాన్ని బట్టి ఆర్థిక సాయాన్ని కనీసం రూ.1,599 నుంచి రూ.6,599 వరకూ పెంచాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీ వరకూ 32.1 మిలియన్ల లబ్దిదారులకు రూ.14,427 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ పథకం కింద ఎంత మంది మహిళలు రెండు వాయిదాల సొమ్మును అందుకున్నారన్న సమాచారం లేదు. ఉదాహరణకు 2022 నవంబర్‌ వరకూ కేవలం 20% మంది అర్హులైన మహిళలు మాత్రమే అన్ని వాయిదాల సొమ్మును అందుకున్నారని ఓ సంస్థ తెలిపింది. ఈ పథకం కింద గర్భిణులకు అందజేస్తున్న సాయం వారి ఆర్థిక అవసరాలను ఏ మాత్రం తీర్చడం లేదు. దీంతో గర్భిణులుగా ఉంటూనే వారు అనారోగ్యకమైన పనులు చేయాల్సి వస్తోంది. అయినప్పటికి ఈ పథకానికి 2020-21తో పోలిస్తే 2023-24లో బడ్జెట్‌ కేటాయింపులు 17 శాతం మేర తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి రూ.2,067 కోట్లు కేటాయించారు.
ఆధార్‌ తప్పనిసరి కావడంతో పిఎంఎంవీవై కింద 2020 నుంచి 2021 వరకూ పేర్లు నమోదు చేసుకున్న లబ్దిదారుల సంఖ్య 7 శాతం పెరిగింది. అయితే 2022 నవంబర్‌ నాటికి ఆ సంఖ్య అంతకుముందు అదే సంవత్సరంతో పోలిస్తే 46 శాతం తగ్గింది. ఈ పథకం కింద ఆర్థిక ప్రయోజనం పొందాలంటే లబ్దిదారులకు ఆధార్‌ నెంబర్లు తప్పనిసరి అని కొత్తగా మార్గదర్శకాలు రూపొందించారు. ఈ కారణంగా లబ్దిదారుల సంఖ్య బాగా తగ్గిపోయింది. పెరుగుతున్న ఖర్చులు
2022లో దేశంలో 19.8 మిలియన్ల మంది గర్భిణులు, పాలిచ్చే తల్లులు ఉండగా వారిలో 16.1 మిలియన్ల మంది మాత్రమే ఈ పథకం కింద పేర్లు నమోదు చేసుకున్నారు.  బడ్జెటరీ కేటాయింపులతో పోలిస్తే గర్భిణులు, పాలిచ్చే తల్లుల ఆరోగ్య పరిరక్షణ కోసం అవుతున్న ఖర్చు మూడు రెట్లు అధికంగా ఉంది. రెండోసారి గర్భం దాల్చిన  మహిళలకు అందిస్తున్న సాయం దీనికి అదనం. అంటే ప్రస్తుత కేటాయింపులు తొలిసారి గర్భం దాల్చిన వారికి ఆర్థిక సాయం చేయడానికి కూడా సరిపోవడం లేదు. తాజాగా లబ్దిదారులకు ఆన్‌లైన్‌ ద్వారా వారి ఖాతాల్లో నేరుగా సొమ్ము జమ చేస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని 46.6 శాతం మహిళలకు మాత్రమే ఇంటర్నెట్‌ సదు పాయం అందుబాటులో ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పథకం సంపూర్ణ అమలుకి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.