'హిందుత్వం - సామాజిక న్యాయం' ఒకే ఒరలో ఇమడవు..!!

Submitted by Praneeth Kumar on Sat, 30/03/2024 - 08:58
'Hinduism - Social Justice' are not the same..!!

'హిందుత్వం - సామాజిక న్యాయం' ఒకే ఒరలో ఇమడవు..!!

ఖమ్మం, మార్చి 30, ప్రజాజ్యోతి.

‘సనాతన ధర్మానికి’ తమ మద్దతు అంటూ బిజెపి బహిరంగంగా ప్రకటించినప్పుడే అసలు రహస్యం బయట పడింది. సనాతన ధర్మం సామాజిక న్యాయాన్ని, సమానత్వ భావనను వ్యతిరేకిస్తుందని తెలుపుతూ గతేడాది మేధావులు చాలా పదునైన, విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసినప్పుడు, మోడీ దానిని గట్టిగా సమర్థించుకున్నాడు. సనాతనధర్మ వినాశనమే లక్ష్యంగా ఓ రహస్య ఎజెండాను కాపాడుతున్నారని ఆరోపిస్తూ, ఆ ధర్మాన్ని వ్యతిరేకించే వారినుద్దేశించి తీవ్రస్థాయిలో మాట్లాడారు. ‘సనాతన ధర్మ’ విరోధులకు వ్యతిరేకంగా ఎదురుదాడి చేయడానికి హిందూత్వ ప్రచారదళంలో చేరాలని మంత్రుల్ని, తన పార్టీ సభ్యుల్ని రెచ్చగొట్టాడు కూడా. సామాజిక న్యాయం, దళితుల గౌరవం గురించి పదే పదే మోడీ చేస్తున్న వాదనల వెనకున్న కపటత్వంతో పాటు అంబేద్కర్‌ పై ఆయన కురిపిస్తున్న ప్రశంసలు, సంత్‌ రవిదాస్‌ విగ్రహం పట్ల ఆయన చూపిస్తున్న గౌరవంలోని డొల్లతనాన్ని ఈ సంఘటన బట్టబయలు చేసింది. భారతదేశాన్ని వేల ఏండ్ల పాటు ఐక్యంగా ఉంచిన ఆలోచనలు, విలువలు, సాంప్రదాయాలను ‘సనాతన ధర్మం’ కలిగి ఉందని మోడీ ప్రకటించాడు. అయితే ‘పురాతన’, ‘శాశ్వత’, ‘సార్వత్రిక సత్యాలు లేదా చట్టాలు’ లాంటి అస్పష్టమైన పదాలను తప్ప, ‘సనాతన ధర్మానికి’ సంబంధించిన ఆలోచనలు, విలువలు, సాంప్రదాయాలను కలిపే విషయం గురించి మోడీ గానీ, తన నేరమయ హింసాత్మక దళం గానీ వివరించలేదు. ఈ వివరణ లేకపోవడమనేది ‘సనాతన ధర్మం’ ప్రాథమిక, విశిష్ట ‘వర్ణ లేదా జాతి వ్యవస్థ’ లక్షణాన్ని మరుగున పడేస్తుంది. తనకు వనరుగా ఉండే దండు ‘సనాతన ధర్మాన్ని’ రక్షించడానికి ముందుకు వెళ్ళింది. వారు ఉత్ష్టమైన వాక్చాతుర్యంతో దాని సారాన్ని దాచిపెట్టి, లోకజ్ఞానం, మానవ విలువలు, వ్యక్తిగత విధులు, బాధ్యతలు, ప్రవర్తనా ప్రమాణాలు, నైతిక విలువలు లాంటి మాటలతో దానిని నిర్వచిస్తున్నారు. ‘సనాతన ధర్మం’ నిజస్వభావాన్ని దాచి పెట్టడానికి దాని చుట్టూ వారల్లుతున్న అస్పష్టమైన అధ్యాత్మికవాదాన్ని సద్గురువులు, ప్రముఖులిచ్చిన వివరణల్లో మనం చూడవచ్చు. మీరు సహజంగా వీటన్నింటికీ మూలాన్ని కనుగొనే విధంగా ‘సనాతన ధర్మం’ మొత్తం ప్రక్రియనీలో ప్రశ్నల్ని లేవనెత్తుతుందని వారు పేర్కొన్నారూ. ఇలాంటి మరొక వ్యక్తి, ‘సనాతన ధర్మం’ అందర్నీ ప్రేమించి, అందర్నీ కలుపుకొని పోతుందని వ్యాఖ్యానించారు. ఒకవేళ మనం ఈ వాదనలను ‘సనాతన ధర్మం’ సారంగా అంగీకరించినా, ఇలాంటి శాశ్వతమైన సత్యాలే మనకు అన్ని మతాల్లో కనిపిస్తాయి. కానీ ఈ అభిప్రాయం అమానవీయ కుల, లింగ వివక్షతను ఎదుర్కొంటున్న దళితులు, ఇతర బలహీన కులాల వారి దినచర్యలో భాగంగా ఎదుర్కొంటున్న అనుభవాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి వాస్తవానికి సనాతన ధర్మాన్ని వేరుగా ఉంచేదేమిటి..?? నిరాధారమైన వాటిని సమర్థించుకోలేని స్థితి నుండి హిందూత్వ తత్వవేత్తలు తప్పించుకోవడానికి సంక్లిష్టమైన వివరణలు, న్యాయ సమ్మతమైన ఆగ్రహంతో నిమిత్తం లేకుండా వారు సనాతన ధర్మంలో ఉన్న శాశ్వతమైన సత్యం అంటే కఠినమైన, అమానవీయ, శ్రేణీగత, వారసత్వ, పుట్టుక ఆధారిత కులవ్యవస్థను దాచి ఉంచలేరు. అత్యంత అణచివేత, హానికరమైన ‘వర్ణాశ్రమ ధర్మం’ లేక ‘కుల ధర్మం’ కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశాన్ని కలుపుతున్న ఏకైక ముఖ్యమైన ఆలోచన, విలువ, సాంప్రదాయం అనే వాస్తవాన్ని వారెలా విస్మరిస్తారు..?? కాబట్టి మోడీ, సంగ్ పరివార్‌ ప్రత్యేకమైన బుద్ధి మాంద్యంతో బాధపడుతున్నట్లు కనిపిస్తున్నారు. వేదాలు, ఉపనిషత్తులు, ధర్మ సూత్రాలు, గహ్య సూత్రాలు, పురాణాలు, భగవద్గీతలు అన్నీ వర్ణ లేదా జాతి ధర్మ వ్యవస్థను సమర్థిస్తాయని వారు నిరాకరించగలరా..?? వర్ణధర్మం నుండి పక్కకు మళ్లుతున్నందుకు కఠినమైన శిక్షను విధించడమే కాక, వర్ణధర్మ పరిరక్షణ పాలకుల ప్రాథమికమైన బాధ్యత అని చెప్పే మనుస్మతిని మనం పట్టించుకోకూడదని వారు కోరుకుంటున్నారా..?? ఒకవేళ మోడీ వర్ణ లేదా జాతి ధర్మాన్ని, సనాతన ధర్మం నుండి వేరుచెయ్యాలనుకుంటే, విమర్శకుల్ని అప్రతిష్టపాలు చేయడానికి ముందే ఆయన ప్రజలకొక విషయాన్ని స్పష్టం చేయాల్సి ఉంటుంది. అది అతనికి ఖచ్చితంగా తెలియకుంటే శ్రేణీగత, వివక్షాపూరిత మైన ‘వర్ణ లేదా జాతి ధర్మం’ వారి పవిత్రమైన గ్రంథాల్లో భాగంగా ఉన్నాయా లేవా అనే విషయం పై అవగాహన కోసం వారు సాధువుల్ని, సంతుల్ని, శంకరాచార్యుల్ని వేడుకోవచ్చు. అయితే, మోడీ ఈ పని చెయ్యడమనేది, వాస్తవాల మీద కాక ఆశల మీద ఆధారపడిన నమ్మకం కావచ్చు ఎందుకంటే అది అతని కపటత్వాన్ని బయట పెడుతుంది. మేధావుల వ్యాఖ్యల ఫలితంగా ఏర్పడిన వివాదం హిందూత్వ దళం అసలు రంగును బయట పెడుతుంది. మోడీ, ఆయన అనుచరగణం ప్రజల ముందు 19వ శతాబ్దానికి చెందిన సనాతనవాదులకు (మార్పును వ్యతిరేకించే) నిజమైన వారసులుగా చెప్పుకుంటున్నారు. ఈ కాలంలో బ్రాహ్మణ సమాజం, ఆర్య సమాజ్‌, ప్రార్థనా సమాజ్‌, రామకష్ణ మిషన్‌, తమను తాము సనాతన వాదులుగా పిలుచుకునే వారి నాయకులు ప్రతిపాదించిన సంస్కరణ వాద ఆలోచనలను ఎదుర్కొనేందుకు అనేక సాంప్రదాయ సనాతన హిందూ సంస్థలు ఆవిర్భవించాయి. ఈ నాయకులే, ఆ ‘సనాతన ధర్మానికి’ ప్రాచుర్యం కల్పించారు. ‘హిందూ’ అనే పదం పర్షియన్‌ మూలాలు కలిగి ఉన్నందువల్ల ఈ ‘సనాతన వాద’ సేవా తత్పరులు ‘హిందూ’ పదాన్ని ఇష్టపడక, దానికి బదులుగా ‘సనాతన ధర్మం’ అనే పదానికి ప్రాధాన్యత ఇవ్వడం ఆసక్తికరమైన విషయం. దళితులు ఆరాధించే అంబేద్కర్‌ గౌరవం, సమానత్వ దార్శనికతను నెరవేర్చడానికి తాను కషి చేస్తున్నట్టు చేసే నటనను గత దశాబ్ద కాలపు మోడీ పాలనా కాలం బహిర్గతం చేస్తుంది. దానికి బదులుగా మన దేశంలో పీడితులు, దోపిడీకి గురైన ప్రజల పోరాటాల ద్వారా సాధించుకున్న కొన్ని అధికారికహక్కులు, కొద్దిపాటి గౌరవాన్ని అతని పాలన ఒక క్రమపద్ధతిలో ధ్వంసం చేసింది. పెరిగిపోతున్న నేరాల రేటు, కుంచించుకు పోతున్న ఉద్యోగావకాశాలు, పెరిగిపోతున్న ఆర్థిక వివక్షత, దిగజారుతున్న దళితులు, గిరిజనుల జీవన స్థితిగతుల పై నిర్ధారణను ధ్రువీకరిస్తాయి. మోడీ హిందూత్వ, కార్పోరేట్‌ పాలనలో దళిత వ్యతిరేక, గిరిజన వ్యతిరేక నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇది, సమాజంలో మొత్తంగా మనువాద భావజాల ప్రాబల్యాన్ని సూచిస్తుంది.

ఏడుగురు దళిత యువకులను గుజరాత్‌ రాష్ట్రంలో ఉనాలో బహిరంగంగా కొట్టడం. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని హత్రాస్‌లో ఒక దళిత మహిళ పై అత్యంత క్రూరంగా సామూహిక అత్యాచారానికి పాల్పడితే, అది ఆమె మరణానికి దారితీయడం. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో సోధీ ఘటనలో ఓ బీజేపీ నాయకుడు ఓ గిరిజన వ్యక్తి పై మూత్ర విసర్జన చేయడం లాంటి సంఘటనలు దేశం యొక్క అంతరాత్మను కదిలించాయి. సంగ్ పరివార్‌, హిందూత్వ శక్తుల అండతో బీజేపీ ప్రభుత్వాలు సష్టించిన మనువాద వాతావరణంలో దళితులు, గిరిజనులకు వ్యతిరేకంగా ఇలాంటి హేయమైన నేరాలు పాల్పడడానికి కులతత్వ శక్తు లెలా ప్రోత్సాహం ఇస్తున్నాయో ఈ భయంకరమైన చర్యలు తెలియజేస్తున్నాయి. ఇవే శక్తులు, సమాజంలోని సామాజిక పీడిత వర్గాలకు సహాయ పడేందుకు ప్రభుత్వ నిశ్చయీకరణ చర్యల పట్ల ఒక శత్రుపూరిత వాతావరణాన్ని ఒక క్రమపద్ధతిలో పెంచి పోషిస్తున్నాయి. బీజేపీ పాలనలో బలహీన వర్గాలకు లభించే కొద్దిపాటి ప్రయోజనాలను కాలరాసేందుకు ప్రభుత్వమే ఈ శక్తులతో లాలూచీ పడుతుంది. యూనివర్శిటీలు, ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది. ఎస్సీలకు రిజర్వ్‌ చేయబడిన 42 శాతం ఖాళీ పోస్టులు, ఎస్టీలకు రిజర్వ్‌ చేయబడిన 39 శాతం, ఓబీసీ లకు రిజర్వ్‌ చేయబడిన 54 శాతం ఖాళీపోస్టుల్ని భర్తీ చేయడంలో 45 సెంట్రల్‌ యూనివర్సిటీలు వైఫల్యం చెందాయి. ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో ఎస్సీలకు రిజర్వ్‌ చేయబడిన 80 శాతం ఖాళీ పోస్టులను ఇంత వరకు భర్తీ చేయకపోవడంతో అది అధ్వాన్నమైన యదార్ధ స్థితిగా నిలిచింది. మోడీ నాయకత్వంలో ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ సేవలు, ఉన్నత విద్యలో ప్రయివేటీకరణ వేగవంతం కావడానికి తోడు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు లేకపోవడంతో పాటు రిజర్వేషన్ల విషయంలో రాజ్యాంగ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి కేటాయింపుల గణనీయమైన తగ్గింపు, ఖర్చులలో కోతలు విధించడం ద్వారా వివక్షత కొనసాగింపులో మోడీ ప్రభుత్వమే స్వయంగా తోడుగా నిలిచింది. దీనితో పాటు 2017-18 లో ఎస్సీ సబ్‌ప్లాన్‌, ఎస్టీ సబ్‌ప్లాన్లను రద్దు చేయడం ద్వారా మోడీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభివద్ధికి ఉద్దేశించబడిన యంత్రాంగాన్ని ధ్వంసం చేసింది.

స్వాతంత్య్రం సిద్ధించిన ఏడున్నర దశాబ్దాల తర్వాత కూడా దళితుల సాధారణ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. 58 శాతం దళితులకు భూమి లేదు, మోడీ పరిపాలనలో ఆదివాసీలను, దళితులను పెద్ద సంఖ్యలో అభివద్ధి పేరుతో వారి భూముల నుండి బలవంతంగా వెళ్ళగొడుతున్నారు. స్వంత భూములున్న 50 శాతం దళితులకు సాగునీటి సౌకర్యాలు లేవు. సాధారణ జనాభాలో 33.3 శాతం జనాభాతో పోల్చినప్పుడు 65.8 శాతం దళితులు, 81.4 శాతం గిరిజనులు బహుమితీయ (మల్టీ డైమెన్షనల్‌) పేదరికంలో జీవిస్తున్నారు, ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. ఎస్సీలలో అక్షరాస్యతా రేటు కేవలం 66 శాతం గానే ఉండగా, ఎస్టీల్లో అది 59 శాతం కన్నా తక్కువగా ఉంది. అంటే జాతీయ సగటు రేటు 73 శాతం కంటే కూడా తక్కువగా ఉంది. అంతే కాకుండా 2022 నాటికి ఎస్సీలలో నిరుద్యోగ రేటు 8.4 శాతంగా చాలా ఎక్కువగా ఉంది. ఎస్సీలలో అసంఘటితరంగ కార్మికులు చాలా ఎక్కువగా 84 శాతంగా ఉన్నారు.

ఈ గణాంకాలు మోడీ నాయకత్వంలోని మతతత్వ, కార్పోరేట్‌ ప్రభుత్వం దళిత వ్యతిరేక, పేద ప్రజల వ్యతిరేక స్వభావాన్ని తెలియజేస్తుంది. మోడీ హిందూత్వ లేక ‘సనాతన ధర్మ’ భావజాలంలో సామాజిక న్యాయాన్ని వెతకడం అంటే ఎండమావిలో నీటిని వెతకడం లాంటిదే అన్నది మా వాదన.