బదిలీపై వెళ్లిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ధర్మేంద్ర

Submitted by narmeta srinivas on Fri, 18/11/2022 - 19:55
బదిలీపై వెళ్లిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ధర్మేంద్ర

సమర్థవంతంగా పనిచేసిన ధర్మేంద్ర : జనగామ డిఐఈఓ బైరి శ్రీనివాస్

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజా జ్యోతి) నవంబర్ 18 : కొడకండ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత ఐదున్నర సంవత్సరాల కాలం పాటు ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహించిన శ్రీధర్ల ధర్మేంద్ర బదిలీపై హన్మకొండ జూనియర్ కళాశాలకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కళాశాలలో ప్రిన్సిపాల్ ధర్మేంద్రకు శుక్రవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా డిఐఇఓ బైరి శ్రీనివాస్ మాట్లాడుతూ ధర్మేంద్ర కొడకండ్ల లోనే కాకుండా జనగామ జిల్లా ఇంటర్ విద్యలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ముఖ్యంగా ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణలో సమర్థవంతమైన పనితీరుతో రాష్ట్రస్థాయిలో జనగామ జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఎస్ ఈజిసి డైరెక్టర్ అందే యాకయ్య, గ్రామ సర్పంచ్ పసునూరి మధుసూదన్, సీనియర్ నాయకుడు, ఏఎంసి డైరెక్టర్ కుందూరు అమరేందర్ రెడ్డి లు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ప్రిన్సిపాల్ ధర్మేంద్ర కళాశాల అభివృద్ధిలో భాగంగా హరితహారం, మధ్యాహ్న భోజనం అందించడం, కళాశాల ఉత్తీర్ణత శాతాన్ని పెంచడంలో ఎంతగానో కృషి చేశారని అన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ ధర్మేంద్ర మాట్లాడుతూ ఐదున్నర సంవత్సరాలు ఇక్కడ పనిచేయటం నా ఉద్యోగ జీవితంలో ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. కళాశాల అభివృద్ధిలో తనతో సహకరించిన అధ్యాపక బృందం, గ్రామ పెద్దల సహకారం మరువలేనిదని తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ధర్మేంద్రను అధ్యాపకులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ అధ్యాపకుడిగా పని చేస్తున్న ఏ భార్గవ రాజుకు ప్రిన్సిపాల్ గా (ఎఫ్ఏసి) జనగామ డిఐఈఓ శ్రీనివాస్ ఉత్తర్వులు అందించగా తక్షణమే ఆయన విధులలో చేరారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.