దేవర్పుల బస్టాండ్ ను పరిశీలించిన ఆర్టీసీ విజిలెన్స్ పోలీసులు

Submitted by sridhar on Tue, 13/09/2022 - 11:30
Devarpula bus stand RTC vigilance police inspected
  • బస్టాండ్ స్థలాన్ని పరిశీలించి వాస్తవ నివేదిక అందజేస్తాం
  • డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ ఎం రామమూర్తి
     

దేవరుప్పుల: సెప్టెంబరు 12, ప్రజాజ్యోతి:- ప్రయాణికుల సౌకర్యార్థం మండలకేంద్రంలో గత  40 సంవత్సరాల క్రితం దానం గా  ఇచ్చిన భూమి లో  బస్టాండ్ నిర్మించగా కాలక్రమం లో బస్టాండ్ ప్రాంగణం నిరుపయోగంగా మారడం వల్ల ఆ బస్టాండ్ కు  దానం ఇచ్చిన వారి వారసులు తిరిగి  ఆ భూమిని వశం చేసుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలనే దురుద్దేశం తో రాజకీయంగా  పావులు కదుపుతూ చక్రం తిప్పారు. ఈ విషయాన్ని గమనించిన ప్రజా సంఘాలు, ప్రతి పక్షాలు, వివిధ పార్టీల నాయకులు , గ్రామస్తులు బస్టాండ్ స్ధలంలో ప్రజల సౌకర్యార్థం మరుగుదొడ్లు కట్టించాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

బందులు, రాస్తారోకోలు సైతం నిర్వహించారు. అప్పట్లో ఈ విషయం వివాదాస్పదంగా  మారింది. ఈ విషయంలో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల వరకు పిర్యాదులు  అందాయి. చివరకు  ఆర్టీసీ ఎండీ  సజ్జనార్ కు  పిర్యాదులు అందగా సోమవారం  ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు విచారణ నిమిత్తం దేవరుప్పుల బస్టాండ్ ప్రాంగణాన్ని పరిశీలించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పిస్తామని డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ ఎం రామమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ యాదగిరి,ఏ డి సి ఎం సుధాకర్, పలువురు గ్రామస్థులు ఉన్నారు.