'ప్రజాస్వామ్యం' అంటే మన పాలకులకు 'ప్లాస్టి'క్కు పండులా ఉంది..!!

Submitted by Praneeth Kumar on Tue, 19/12/2023 - 09:50
'Democracy' is like a 'plastic' fruit for our rulers..!!

'ప్రజాస్వామ్యం' అంటే మన పాలకులకు 'ప్లాస్టి'క్కు పండులా ఉంది..!!

ఖమ్మం, డిసెంబర్ 19, ప్రజాజ్యోతి.

రాజులు, రాజ్యాలు వస్తూ పోతూ ఉంటేనే ప్రజల బాగోగులు తెలిసేది, బాగు పడేది. 'పాత సీసాలో కొత్త సారా' అన్నట్టు అదే రాజులు అటూ ఇటూ వస్తూపోతూ తమకు పాచి పట్టకుండా చూసుకుంటారేమో అనిపిస్తుంది. ప్రవాహం ఉంటేనే నీళ్లలో పాచి పట్టకుండా ఉండేది. అందుకే నాటకీయ పరిణామాల్లో అనిపించేటట్టు గోడ మీది పిల్లుల్లా మాత్యులు అమాత్యులై పోతుంటారు ఒక్క ఉదుటన. ఇంకొందరేమో మేము ఇంత మంది ముఖ్య మంత్రుల దగ్గర పని చేశామని, తమ మెడలో తామే సర్టిఫికేట్లు వేసుకొని వ్యాపారం చేస్తుంటారు. అదే దాని పై ఎన్ని పార్టీలు మారింది ఉండనే ఉండదు. అది గోప్యంగా ఉంచుతారు ఈ ‘గోపి’లు.
ఒక్కోసారి ప్రజాస్వామ్యాన్ని చూస్తే అమితమైన ఆకర్షణ వేస్తుంది. ఎప్పటికైనా ప్రజలే రాజులని, వాళ్ళే పాలకులని ఇంకా ఏవేవో ఊహలు గుసగుస లాడతాయి మన మనసులో, అవన్నీ నిజం కాకపోవచ్చు కాని ఎంతో కొంత నిజం లేకపోనూ లేదందులో. అయితే ఈ ప్రజాస్వామ్యమనే 'ప్లాస్టి'క్కు పండు పై మనకు ఏవైనా అనుమానాలు, ఆశలు ఉంటే డా అంబేడ్కర్‌ మహాశయుడు చెప్పిన మాటలు వినాలి. 'ఎడారిలో ఎండమావులు కనిపిస్తే దాహంగా ఉన్నవాళ్ళకు నిజంగా అవి నీళ్ళలాగే కనిపించి అక్కడిదాకా నడిచే శక్తి వస్తుంది'. సరిగ్గా సేమ్‌ టు సేమ్‌ ప్రజా స్వామ్యం పై అవే ఫీలింగులు కలుగుతాయి. అవే ఫలితాలు వస్తూ పోతుంటాయి కొన్ని భ్రమలు కల్పిస్తూ. నిరంకుశ పాలన అని, ఇంకోటని ఎంతసేపూ నాయకులను నాయకులే తిడుతుంటారు. ఓడినవారిలో ఒక్కరూ ప్రజల్ని ఒక్క పరుషమైన మాటా అనరు. అలాగే గెలిచినోళ్లు ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని ఒకటే పొగిడేస్తుంటారు, మాటలకు అస్సలు తడుముకోకుండా. గెలిచినప్పుడు ఉండే పవరది, ఓడినప్పుడు ఉండే ఫియరది. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయ్యాయని పాత డైలాగులే వాడతారు కొందరు. బోట్లు ఆడీ కార్లు, ఆడీకార్లు బోట్లు అయ్యాయని చెప్పుకోవాలిప్పుడు. ఆడీ కారు రోడ్డు మీద చూడడానికే కాని మారుతి ఎనిమిది వందలో లేదా ఇంకో మామూలు కారులోనో పోవడం చూస్తుంటాము. మాటలకు హద్దులుండవు, ఊహలకూ అంతే ఉండదు. మేము వాటిని నిజం చేశామని చెప్పే ప్రబుద్ధులు ఎక్కువే. ఏమైతేనేం ఇక్కడి మా గెలుపు దేశానికే మార్గదర్శనం చేస్తుందని గెలిచిన చోట్ల చెప్పే మాటలు ఓడిన చోట ఉండవు అదే రాజకీయ శాస్త్రం, రాజనీతి శాస్త్రం చెప్పేది. అసలు ఇలాంటప్పుడు చాణక్యుడేమి చెప్పాడబ్బా అని వెదుకుతారు కూడా. ఇక భగవద్గీత పుట్టినవాడు మరణించక తప్పదు అంటుంది కాబట్టి గెలిచినవాడు ఓడక తప్పదు అని కొద్దిగా తమకు అనుకూలంగా మార్చుకొని తృప్తిపడే అవకాశం కూడా ఉంది. ఓడినవాడు ఓడానని గెలుస్తుంటే, గెలిచినవాడు ఎందుకు గెలిచానని ఏడుస్తాడట యుద్ధాల విషయంలో. ఐస్‌క్రీము ఫ్యామిలీ ప్యాకు తినవలసి నోళ్లు ఒక చిన్న కప్పుతో, ఒక చిన్న కేకుతో ఇక చాల్లే అనుకునే అవకాశమూ ఉంది ఈ ఎన్నికల్లో  రాష్ట్రాల్లో వచ్చినవెన్ని, పోగుట్టుకున్నవెన్ని అన్న విషయం తెలుసుకోవాలి. మిత్రుల్ని కలుపుకొని, తమ శక్తి తెలుసుకొని, అవతలివారి బలహీనతల్ని వాడు కోవలసింది పోయి చిన్నచిన్న విజయాలతో పొంగి పోయేవారిని చూస్తే జాలేస్తుంది. పెద్దయ్యాక ఏమవుతావురా అంటే సైకిల్‌ షాపు పెడతా అన్న తమాషా డైలాగులు గుర్తొస్తాయి ఒక్కొక్కసారి. నాయకుడన్నవాడికి కొద్దిగా త్యాగం కూడా తెలిసుండాలని అనిపిస్తుంది. దేశాన్ని మొత్తం పాలించే విధంగా ప్రణాళిక వేయవలసిందిపోయి చిన్న చిన్న విజయాలకు ఎవరి భుజం వాళ్లు సెహభాష్‌ అని కొట్టుకొని మురిసి పోతే అవతలివాడికే లాభం. దీర్ఘకాలిక శత్రువులు ఎవరు, స్వల్పకాలిక శత్రువులెవరు అని తెలుసుకోవాలి. సొంతంగా మెదళ్లు పని చేయకపోతే ఇప్పుడు కృత్రిమ తెలివి అని ఒకటి బాగా పని చేస్తోంది కాబట్టి వాటిని వాడుకోవచ్చు. అప్పుడు నిజంగా ఉండే తెలివి సైతం సహకరించవచ్చు. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే, జేబులు ఖాళీలాయనే అని బాధ పడకుండా అనుభవం వచ్చిందని సంతోషించాలి. ఇప్పుడు అంతకన్న మార్గం లేదు జీవించడానికి. మార్కెట్లో ఉన్న వ్యక్తిత్వ వికాస పుస్తకాలన్నీ తిరగెయ్యాలిప్పుడు. అలాగే కాళ్ళకు పని పెట్టాలి మిగిలిన రాష్ట్రాల్లో. ఊరకే భారత్‌ జోడో అంటే సరిపోదు, మిత్రోంకో జోడో అని పెద్దన్న వేషం కట్టాలిప్పుడు. దేశం కోసం త్యాగాలు చేశామని చెప్పడం కరెక్టే కాని దేశం బాగుపడాలంటే రానున్న అధికారంలోనూ త్యాగం చేసి కొంత మిత్రులకివ్వాలి, అదే నిజమైన త్యాగం. నేను దేశాన్నంతటిని కులాలకు, మతాలకు అతీతంగా ఏకతాటిపై నడుపుతానంటే మంచిదే కాని దానికి సహకరించే వాళ్ళను దగ్గరికి తీసుకోవాలి, వ్యతిరేకంగా ఉన్న శక్తుల్ని బలహీనం చేసి నీవు బాధ్యతాయుతమైన స్థానంలో ఉంటావా లేక రాజులు వస్తుంటారు పోతుంటారు అని చేతులెత్తేసి తత్వాలు చెప్పుకుంటావా అన్నది మీరే తేల్చుకోవాలి. ప్రజలందరిని ఒక తాటిమీదకు తెస్తేనే రాజవుతాడు. విడగొడుతూ రాజైనోడు ఎక్కువ రోజులు రాజుగా ఉండడు అన్నది మా వాదన.