"అందరి సహకారంతో మహబూబ్ నగర్ ను మరింత అభివృద్ధి చేస్తాం"

Submitted by Kramakanthreddy on Wed, 21/09/2022 - 15:19
We will further develop Mahbub Nagar with everyone's cooperation."
  • "అర్హులైన మిగిలిపోయిన వారందరికీ ఆసరా పెన్షన్లు ఇస్తాం "
  • "పట్టణంలో అన్ని వార్డులు కవర్ అయ్యే విధంగా మెగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తాము"
  • ---రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్

 మహబూబ్ నగర్, సెప్టెంబర్ 21 (ప్రజాజ్యోతి ప్రతినిధి) :  ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో మహబూబ్ నగర్ ను ఎంతో అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు .బుధవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జేజేఆర్ ఫంక్షన్ హాల్ లో 2,3,5,6 వార్డులకు సంబంధించిన లబ్ధిదారులకు నూతన ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్ పట్టణం మొత్తం నెలకు 31 లక్షల రూపాయలు పెన్షన్ల కోసం ఇస్తే ,ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకు 4 కోట్ల ఆరు లక్షల రూపాయలను  పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు .గతంలో పట్టణం మొత్తం  10,000 మందికి పెన్షన్ ఇస్తే,ఇప్పుడు 19010 మందికి పెన్షన్ ఇస్తున్నట్లు వెల్లడించారు. మహబూబ్ నగర్ టౌన్ లో కేవలం పెన్షన్ల కొరకు 389 కోట్లు ఇచ్చామని తెలిపారు. అప్పన్నపల్లి మొదటి రైల్వే బ్రిడ్జి పూర్తి చేసేందుకు 12 ఏళ్ల సమయం పట్టిందని, ఇల్లు కోల్పోయిన లబ్ధిదారులకు సరైన న్యాయం జరగలేదని, కానీ తాము చేపట్టిన రెండవ బ్రిడ్జిని కేవలం 12 నెలలలో పూర్తి చేస్తున్నామని డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అంతేకాక దేశంలోనే అతి పెద్దదైన 2097 ఎకరాలలో అర్బన్ ఎకో పార్కు ను అప్పన్న పల్లి సమీపంలో ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. పట్టణంలోని అన్ని కాలనీలలో మంచినీరు, రోడ్లు,డ్రైన్లు, పార్కులు ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లతో పేదవారు మూడు పూటలా కడుపునిండా అన్నం తింటున్నారని ,ఇలాంటి పేన్షన్ ఇచ్చే పథకం ఏ రాష్ట్రంలో లేదని ,అంతేకాక రైతు బీమా, దళిత బందు, రైతుబంధు ,సీఎంఆర్ ఎఫ్ వంటి పథకాలు ఏ రాష్ట్రంలో అమలు చేసేందుకు సాహసించడం లేదని మంత్రి అన్నారు.

త్వరలోనే 500 కోట్ల రూపాయలతో పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించనున్నామని తెలిపారు. పట్టణంలో పాఠశాల భవనాల నిర్మాణం కోసం 209 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని తెలిపారు. పెన్షన్లు రానివారికి తప్పకుండా ఇస్తామని, పెన్షన్లు,డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం పేద ప్రజలను ఎవరైనా మోసం చేస్తే వదిలిపెట్టేది లేదని మంత్రి హెచ్చరించారు. తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల మహబూబ్నగర్లో భూములు, ఇండ్ల విలువలు పెరిగాయని , అందరి సహకారంతో మహబూబ్నగర్ ను మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. పట్టణంలో వివిధ జబ్బులతో బాధపడే వారి కోసం వార్డుల వారీగా, కొన్ని వార్డులకు కలిపి మెగా హెల్త్ క్యాంపులను  ఏర్పాటు చేయాలని మంత్రి జిల్లా కలెక్టర్ ను, మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు మాట్లాడుతూ మహబూబ్ నగర్ లో గత 15 ఏళ్లలో కానీ అభివృద్ధి ఇప్పుడు కనిపిస్తున్నదని, అధికారులు ,ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తున్నందున ఇది సాధ్యమైందని అన్నారు. ఇంకా అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  మున్సిపల్ చైర్మన్ కె సి నర్సింహులు, డిసిసిబి ఉపాధ్యక్షులు కొరమోని వెంకటయ్య ,మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రెహమాన్, వార్డు కౌన్సిలర్లు వనజ, రామాంజనేయులు, గోవింద్ ,మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఆర్ డి ఓ అనిల్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.