కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాల పై పోరాటం చేయాలి -సిపిఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్

Submitted by bosusambashivaraju on Sun, 25/09/2022 - 14:33
There should be a fight against the anti-people policies of the central government  - CPM Mandal Secretary Munigela Ramesh

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 24 ( ప్రజాజ్యోతి ) : -  స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో  శనివారం సిపిఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా బిజెపి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాల పై స్టేషన్ ఘనపూర్ తహసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్ ఆధ్వర్యంలో ధర్నా చేసి తహసీల్దార్ పూల్ సింగ్ చౌహన్ కు వినపత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మునిగెల రమేష్ మాట్లాడుతూ బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తోందని అన్నారు. జీఎస్టీ పేరుతో నిత్యవసర సరుకులకు రేట్లు పెంచి సామాన్యుడు బతకలేని పరిస్థితికి తెస్తుందని, ఆహార పాల ఉత్పత్తులు డ్రై ఫ్రూట్స్ బియ్యం వంట సామానులకు ఇలా తదితర వస్తువులకు పలు విధాలుగా జీఎస్టీ పేరుతో పన్నులు వేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నదని అన్నారు. జీఎస్టీని ఆహార ఉత్పత్తుల్లో ఉపసంహరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  2014లో గ్యాస్ సిలిండర్ ధర 450 ఉంటే ఇప్పుడు 1150 కి చేరిందని  వాపోయారు.  ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే, విమానం, ఓడరేవులు విద్యుత్తు,  రోడ్లు, బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి సహజ వనరులు ఇలా పలు ప్రభుత్వ రంగ సంస్థలను ఇప్పటికే 80 శాతం వరకు ప్రైవేట్ వాళ్లకు అమ్మకానికి పెట్టిందని అన్నారు.  ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆపకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.  మోడీ అధికారంలోకి వచ్చే ముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పలు సంస్థలలో ఉద్యోగాలు తీసేసిన పరిస్థితి ఉందని,  ఖాళీగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో వెంటనే ఖాళీలు భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేయడం కోసం నాలుగు లేబర్ కోడ్ చట్టాలను తెచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తోందని  అన్నారు. వెంటనే కార్మిక చట్టాలను రద్దు చేసుకోవాలని కోరారు.  వ్యవసాయ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసి కార్పొరేట్ వ్యవస్థకు అప్పజెప్పడం కోసం ప్రభుత్వం పూనుకుందని,  కనీస మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వెంటనే రైతు పండించిన పంటకు డాక్టర్ స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టు కనీస మద్దతు ధర ప్రకటించాలని  కోరారు.  

ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రతిపక్ష నాయకుల పైన కేసులు పెట్టిస్తున్నారని, రాజ్యాంగాన్ని కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తున్నారని అన్నారు.  అక్రమంగా అరెస్టు చేసిన రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని మైనార్టీ దళితులు, గిరిజనుల పై దాడులు ఆపాలని ఫెడరల్ రాజ్యాంగాన్ని కాపాడాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలను ఐక్యం చేసి పోరాటాల నిర్వహిస్తామని రమేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు మంద మహేందర్, చిలుముల్ల భాస్కర్, పార్టీ ప్రజా సంఘాల నాయకులు వంగపండ్ల సోమయ్య,  శాతపురం రవి, నీరటి సంపత్, లింగనబోయిన శ్రీకాంత్, సుంచు రాములు,  శీను,  భాస్కర్,   సురేష్ తదితరులు పాల్గొన్నారు.