జనరల్ బాడీ లో మాట్లాడుతున్న ఎంపీపీ గుత్తా ఉమా దేవి

Submitted by veeresham siliveru on Wed, 14/09/2022 - 15:11
MP Gutta Uma Devi speaking in the General Body
  • ఒక్క పంచాయతీకైనా కేంద్ర ఉత్తమ అవార్డు రావాలి- ఎంపీపీ గుత్తా ఉమాదేవి

సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 14 , ప్రజా జ్యోతి : సంస్థాన్ నారాయణపురం మండలంలోని ఒక్క గ్రామపంచాయతీకైనా కేంద్ర ప్రభుత్వ ఉత్తమ అవార్డును సాధించాలని మండల పరిషత్ అధ్యక్షురాలు గుత్తా ఉమా ప్రేమ్చందర్ రెడ్డి కోరారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం నాడు ఎంపీపీ అధ్యక్షతన జరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 14 అంశాలను పరిగణలోనికి తీసుకుంటూ ఉత్తమ గ్రామపంచాయతీలను దేశవ్యాప్తంగా ఎంపిక చేస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న లక్ష గ్రామపంచాయతీల లో కేవలం 90 గ్రామపంచాయతీలను మాత్రమే ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక చేసి అవార్డును ప్రకటించనున్నట్లు తెలిపారు . ఈ అవార్డును పొందిన గ్రామపంచాయతీకి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ నిధులు, పథకాలు అదనంగా సమకూరుతాయని తెలిపారు.  

ఇందుకోసం కేంద్రం ప్రకటించిన 14 అంశాలను పూర్తిచేసిన గ్రామపంచాయతీలు ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. ఉత్తమ మండలంగా అవార్డులు పొందాలంటే మండలంలోని 31 గ్రామపంచాయతీలు అన్ని అంశాలను పూర్తిచేసి ఎంపీడీవో కార్యాలయంలో పేర్లను నమోదు చేయించుకోవాలని సూచించారు. ఇందుకోసం గ్రామ సర్పంచులు కార్యదర్శులు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని నిబంధనల మేరకు పనులను పూర్తి చేసుకోవాలన్నారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి కొన్ని శాఖల అధికారులు రావడంలేదని ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్చందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శిశు సంక్షేమ శాఖ నుంచి అధికారులు రాకపోవడాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముందుగా తేదీని ప్రకటించి సమాచారం ఇచ్చిన అధికారులు రాకపోవడం సమంజసం కాదన్నారు. సర్పంచులు ఎంపీటీసీలు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల అధికారులే సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు.

మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఉపాధ్యాయులను ఇతర మండలాలకు డిప్యూటేషన్లపై పంపించవద్దని పలువురు సర్పంచులు కోరారు. ముఖ్యంగా వావిళ్ళపల్లి జనగాం చిల్లాపురం లచ్చమ్మ గూడెం గిరిజన తండాల పరిధిలోని ఉపాధ్యాయులను ఇతర మండలాలకు డిప్యూటేషన్లపై పంపిస్తున్నారని వావిళ్ళపల్లి గ్రామ సర్పంచ్ జక్కర్తి పాపయ్య ఆరోపించారు. దీనికి స్పందించిన ఎంపీపీ తనకు తెలియకుండా ఉపాధ్యాయులు ఎవరిని డిప్యూటేషన్ల పై పంపించవద్దని ఇన్చార్జి ఎంఈఓ సుదర్శన్ రెడ్డిని ఆదేశించారు. ఇక్కడ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే ఇతర ప్రాంతాలకు ఉపాధ్యాయులను పంపించడం సరి అయింది కాదని సూచించారు. మండలంలోని అన్ని గ్రామాలకు పశు వైద్యం అందడం లేదని గుజ్జ గ్రామ సర్పంచ్ మహిళా యాదవ రెడ్డి సభలో ఆరోపించారు. ప్రతి గ్రామానికి ఒక రోజున కేటాయించి వైద్యం చేయాలని డిమాండ్ చేశారు.  దీనికి ఎంపీపీ సమాధానమిస్తూ మండలంలో ప్రస్తుతం ఒకే వైద్యాధికారి ఉన్నాడని 31 గ్రామపంచాయతీలకు తిరగడం ఇబ్బందికరంగా ఉందన్నారు.

అయినా ప్రతి ఊరికి వైద్యం అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నూతనంగా ఏర్పడిన అల్లం దేవి చెరువు గ్రామపంచాయతీకి ప్రత్యేక రేషన్ షాపులు కేటాయించాలని సర్పంచి సూరి యాదయ్య తాసిల్దార్ను కోరారు. నూతన రేషన్ షాపు మంజూరు కావాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా మంజూరు చేయాల్సి ఉంటుందని ఉంటుందని తాసిల్దార్ శ్రీనివాసరాజు తెలిపారు. ఈ రేషన్ షాపుల సమస్యలు చాలా గ్రామాలలో ఉందని కలెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకువెళ్తానని హామీని ఇచ్చారు. సర్వేల్ గ్రామంలో కొందరికి రేషన్ కార్డులు పెన్షన్లు మంజూరు కాలేదని ఎంపీటీసీ ఈసం యాదయ్య తాసిల్దారును కోరారు. గతంలో ఉన్న ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇన్కమ్ టాక్స్ కారు ట్రాక్టరు ఏడున్నర ఎకరాలకు పైబడిన భూమి ఉన్నవారికి రేషన్ కార్డు పెన్షన్ మంజూరు కాలేదన్నారు.   రేషన్ కార్డులకు గతంలోనే దరఖాస్తులు చేసినందున కొన్ని రాలేదని వాటిని మళ్లీ సరి చేస్తామని ఎంపీడీవో తాసిల్దార్లు తెలిపారు. అన్ని శాఖల పనితీరుపై సభలో సమీక్షించారు. సమావేశంలో ఎంపీడీవో యాదగిరి, తహసిల్దార్ శ్రీనివాసరాజు, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు ,ఎంపీటీసీలు పాల్గొన్నారు.