కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం భవిష్యత్ తరాలకు నిదర్శనం :: కలెక్టర్ క్రిష్ణ అదిత్య

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 12:23
Konda Laxman Bapuji's life is a testament to future generations :: Collector Krishna Aditya

ములుగు జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి): స్వాతంత్ర్య సమర యోధుడు,తెలంగాణ పోరాటయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం భవిష్యత్ తరాలకు నిదర్శనమని ములుగు జిల్లా కలెక్టర్ క్రిష్ణ అదిత్య పేర్కొన్నారు.‌మంగళవారం ములుగు కలెక్టరేట్ లో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా అయన చిత్రపటానికి  పూల మాలలు వేసి కలెక్టర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరంకుశ,నిజాం వ్యతిరేక,తెలంగాణ ఉద్యమనాయకులలో ప్రముఖుడైన కొండ లక్ష్మణ్ బాపూజీ కొమరం భీం జిల్లా,వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్  27న జన్మించారని తెలిపారు.కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ గర్వించదగిన గొప్ప వ్యక్తి అని,తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిదని అన్నారు.‌ 

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడిగా, నిబద్దతతోకూడిన రాజకీయనాయకుడిగా కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం భవిష్యత్ తరాలకు నిదర్శనమని అన్నారు.సమాజం లోని అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకు రావడమే కాకుండా తెలంగాణ కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన బాపూజీ గత తెలంగాణ ఉద్యమంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు.కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి,వర్ధంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆయన గౌరవార్థం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో అదనపుకలెక్టర్ వైవి గణేష్, సిపిఓ ప్రకాష్,కలెక్టరేట్ ఏఓ విజయ భాస్కర్,కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.