దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేల ప్రమేయాన్ని తొలగించాలి .హనుమకొండలో రాష్ట్రస్థాయి సమావేశవంగపల్లి, మేడి పాపన్న

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 14:48
Involvement of MLAs in Dalit Bandhu scheme should be removed. State level meeting in Hanumakonda Vangapalli, Medi Papanna

కాజీపేట, సెప్టెంబర్23 (ప్రజాజ్యోతి)..///..దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేల ప్రమేయాన్ని తొలగించాలని, నిరుపేదలైన దళితులను ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో ఎంపిక చేసి అసలైన లబ్ధిదారులకు పథకం వర్తింపజేయాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కేంద్రంలో హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఇల్లందుల రాజేష్ కన్నా ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర స్థాయి సమావేశం  ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వంగపల్లి, మేడి పాపన్న మాట్లాడుతూ సామాజిక సంపదకు దూరమైన దళితులు ఆర్థిక రాజకీయ వివక్షలను ఎదుర్కొంటున్నారని, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు నిండిన,బిజెపి పార్టీఅమృత్సవాలు జరిపిన దళితుల జీవితాల్లో చీకటి అలానే ఉందన్నారు. ఒకేసారి ఒక దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశారు. కనుక ఎమ్మార్పీఎస్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడే సమర్ధించి, ఆహ్వానించింది. ఈ పథకం ప్రవేశపెట్టి సంవత్సరం కావస్తున్న కాని దీని అమలు విషయంలో చాలా చీకటి కోణాలు కనిపిస్తున్నాయన్నారు. మొదటి నియోజకవర్గానికి 100 మంది అర్హులను ఎంపిక చేసి రాజకీయ పంపిణీ చేశారు. తర్వాత నియోజకవర్గానికి 500 మందికి ఇస్తామని అంటున్నారు ఇది కూడా ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తుందో వేచి చూడాల్సిందే అన్నారు.

దళితులు ఆత్మగౌరవంతో జీవించడానికి దళిత బంధు పథకాన్ని తీసుకొస్తున్నామని కేసీఆర్ చెప్తున్నారు కానీ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న దళితుల ఆత్మగౌరవం ఎమ్మెల్యేల ముందు తాకట్టు పెట్టబడుతుందన్నారు. ఎమ్మెల్యేల చుట్టూ తిరిగిన వారికి తమకు నచ్చిన వారికి తమ పార్టీ వారికి ఇస్తున్నారని, తప్ప నిజంగా అర్హులైన వారికి మాత్రం దళిత బంధు అందడం లేదన్నారు. ఏ ప్రభుత్వ పథకమైన భూమి ఇల్లు ఆస్తులు లేని వారికి చేరినప్పుడే ఆ పథకం ప్రయోజనం నెరవేరుతుందని, కానీ దళిత బంధు  ఎమ్మెల్యేల ఇంటి పథకంగా మారిందన్నారు. పథకంలో కొంతమంది ఫైర్వకారులు చొరబడి ఎమ్మెల్యేలకు లబ్ధిదారులకు మధ్యవర్తులుగా ఉంటూ దాదాపు రెండు లక్షల దాకా వసూలు చేస్తున్నారన్నారు. ఈ డబ్బు నేరుగా ఎమ్మెల్యేల జేబులోకి పోతుందని, ఈ విధంగా దళితులు ఆత్మ గౌరవం దెబ్బతిస్తున్న ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ పథకం సరిగ్గా అమలు కావాలంటే మంచి ఫలితాలు ఇవ్వాలంటే ఒక ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామని, రాష్ట్రస్థాయిలో నిజాయితీ కలిగిన ఐఏఎస్ ఆఫీసర్లు చైర్మన్గా పెట్టి లబ్ధిదారుల ఎంపిక శాస్త్రీయ పద్ధతిని పాటించాలని సూచించారు.

గ్రామస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలంటే రాజకీయ జోక్యం ఉండకూడదని, క్షేత్రస్థాయిలో అధికారుల చేత జాబితాను తెప్పించుకొని ఎంపీడీవో కలెక్టర్ సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలనీ కోరారు. అప్పుడే కేసీఆర్  ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందని, ఇప్పటివరకు దళిత బంధు పథకం లో జరిగిన అక్రమాలను వెలికి తీస్తే ప్రభుత్వాన్నికి స్పష్టత వస్తుందన్నారు. దీనికై సెప్టెంబర్ 25 నుండి 30 వరకు రాష్ట్ర మంత్రులకు వినతి పత్రాలు అందజేయడం, అక్టోబర్ 11, 12 తేదీలలో ఎమ్మార్వో ఎంపీడీవో ఆఫీస్ ల ఎదుట ధర్నాలు, అక్టోబర్ 17 18 తేదీలలో కలెక్టరేట్ల ముందు ధర్నాలు, అక్టోబర్ 28న ఇందిరాపార్క్ వద్ద దండోరా మహాధర్నాలు గా ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. దళిత ముందు పథకంలో ఎమ్మెల్యేల ప్రమేయాన్ని తొలగించాలని, ప్రభుత్వ అధికారులచేత లబ్ధిదారులను ఎంపిక చేసేలా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వాలని, దళిత బంధు లబ్ధిదారులు ఎంపిక కలెక్టర్ ద్వారా జరపాలని, దళిత బంధు పథకంలో జరిగిన అక్రమాలకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్, కోండ్ర శంకర్, పేర్ల మధు పందుల సంజీవ్, గుండ్ల నాంపల్లి, శైలేంద్ర, బాబురావు, మరి గణేష్, చింత బాబు, డప్పు శివరాజు, పుట్ట పెంజర రమేష్, కొల్లూరు వెంకట్ , సాతుర్ వెంకన్న, మేడ స్వామి, వేలమకండి దయాకర్, రుక్కమ్మ, లక్ష్మి,  బంగారు శీను, కోటగిరి ఉషారాణి, చీనగల యాదయ్య, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.