ప్రజా సమస్యలకు తక్షణమే పరిష్కారం

Submitted by sridhar on Mon, 12/09/2022 - 16:02
Immediate solution to public problems
  • జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య

జనగామ , సెప్టెంబర్ 12, ప్రజాజ్యోతి :- ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు.సోమవారం ఐ డి ఓ సి సమావేశ మందిరంలో గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి పలు విజ్ఞప్తులు స్వీకరించారు.స్టేషన్గన్పూర్ మండలం రాఘవాపూర్ కు చెందిన గౌడ కులస్తులకు కోటి వరాల పథకం కింద 15 మందికి నాలుగు ఎకరాల భూమి కొనుగోలు చేసి ఇవ్వడం జరిగిందని, కబ్జాదారులు ఆక్రమించి విక్రయిస్తున్నందున అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎల్ల స్వామి, మల్లేష్, వెంకటస్వామి తదితరులు విజ్ఞప్తి చేశారు.

పాలకుర్తి మండలం చెన్నూరు కు చెందిన  రైతు బన్నేపాక అంజయ్య తన దరఖాస్తు అందిస్తూ ప్రభుత్వం ఎస్సారెస్పీ కాలువ క్రింద 1.7 ఎకరాల భూమికి 7 లక్షల 5 వేలు జమ చేశారని తన తమ్ముడు సోమ నరసయ్య ఫిర్యాదుతో హోల్డ్ లో పెట్టారని ఎంక్వయిరీ జరిగి తనదే అని అధికారులు నిర్ధారించిన బ్యాంక్ అధికారులు హోల్డ్ లో పెట్టడం వలన నేటికీ నగదు తీసుకోలేకపోతున్నానని అధికారులకు వివరించారు.గోపరాజు పల్లి కి చెందిన నర్సింహులు తన కూతురు రెడ్డబోయిన హస్మిత వివాహం 2017లో జరిపించడం జరిగిందని కళ్యాణ లక్ష్మికి దరఖాస్తు చేసుకోగా నేటికీ మంజూరు కాలేదన్నారు.

బచ్చన్నపేట మండలం లింగంపల్లి కి చెందిన కె రామ్ రెడ్డి తాను లారీ ప్రమాదంలో దివ్యాంగుడిగా మారానని వికలాంగుల పింఛన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జనగాం మండలం వావిలాలకు చెందిన వనపర్తి కృష్ణయ్య 2019లో కార్ యాక్సిడెంట్ అవడం వలన మతిస్థిమితం కోల్పోయి ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందినట్టు తెలుపుతూ సదరం ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని కోరారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ గ్రీవెన్స్ డే లో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ , జడ్పీ సీఈవో విజయలక్ష్మి , డి ఆర్ డి ఏ పి డి రాంరెడ్డి , జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.