ప్రతి ఒక్కరికి నులిపురుగుల నిర్మూలన మాత్రలు అందాలి కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య

Submitted by veerareddy on Fri, 16/09/2022 - 13:07
Everyone should get deworming tablets  Collector CH Shivalingaiah


 జనగామ, సెప్టెంబర్ 15, ప్రజాజ్యోతి:-  జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి నులిపురుగుల నిర్మూలన మాత్రలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య వైద్యాధికారులను ఆదేశించారుగురువారం సెప్టెంబర్ 15వ తేదీన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జనగామ మున్సిపల్ పరిధిలోని హనుమకొండ రోడ్డులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ లో జిల్లా కలెక్టర్ సి హెచ్ శివలింగయ్య   విద్యార్థులకు నులిపురుగుల నిర్మూలన మాత్ర ఆల్బెండజోల్ ను స్వయంగా వేసి  ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ భోజనానికి ముందు, తర్వాత సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, పాఠశాల చుట్టూ పరిసరాలతో పాటు ఇండ్ల చుట్టూ పరిసరాలు పరిశుభ్రత పాటించాలని అందరూ విధిగా మరుగుదొడ్డిని ఉపయోగించాలన్నారు. తద్వారా పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండి చురుకుగా విద్యలో రాణిస్తారన్నారు.
 పిల్లలలో నులిపురుగులు ఉంటే పోషక లోపంతో బాధపడుతూ రక్తహీనతకు గురై సరిగా ఎదుగుదల ఉండక గ్రాహ్యశక్తి తగ్గుతుందని,తరచుగా కడుపునొప్పి, విరోచనాలు వచ్చే అవకాశం ఉంటుందని పిల్లలందరూ నులిపురుగుల నివారణ మాత్రలు ఆరు నెలలకు ఒకసారి తప్పకుండా తీసుకుంటూ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఇచ్చే గుడ్డుతో పాటు ఇండ్లలో కూడా ఆకుకూరలు, గుడ్లు,పాలు ఎక్కువగా తీసుకుంటూ చేతుల పరిశుభ్రత  పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. 

జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి మహేందర్ మాట్లాడుతూ జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరంలోపు పిల్లలు 1,21,023 మంది ఉన్నారని ఇందులో 1-2 సంవత్సరాల పిల్లలకు సగం మాత్ర పొడిచేసి త్రాగునీటితో కలిపి ఇస్తారని, 2 -3 సంవత్సరాలు పిల్లలకి పూర్తి మాత్ర పొడిచేసి త్రాగు నీటితో కలిపిస్తారని , 3- 19 సంవత్సరంల వరకు ఉన్న పిల్లలందరికీ ఒక్క మాత్ర పూర్తిగా నమిలి మింగిస్తారని వివరించారు. ఈ నులిపురుగుల నివారణ మాత్ర ఆల్బెండజోల్ వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్, ఆశా కార్యకర్త, స్కూల్ టీచర్, ప్రత్యక్ష పర్యవేక్షణలో మధ్యాహ్న భోజనం తర్వాత జరుగుతుందని ఈ మాత్ర ఎట్టి పరిస్థితిలో ఇంటికి తీసుకెళ్లరాదని  ఈరోజు ఏదైనా కారణంతో తీసుకోబడని పిల్లలను గుర్తించి తిరిగి మాప్ అప్ లో భాగంగా 22వ తేదీన ఇవ్వడం జరుగుతుందని  తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారి మహేందర్, జిల్లా ఉప వైద్య శాఖ అధికారి కరుణశ్రీ  విద్యార్థులు, టీచర్లు,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.