భక్తిశ్రద్ధలతో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

Submitted by bheemaraidu on Mon, 03/10/2022 - 13:20
Devi Sharannavaratri celebrations with devotion

గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) అక్టోబర్ 02 :  శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజు ఆశ్వీజ శుద్ధ సప్తమి ఆదివారం (ములానక్షత్రం) జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో వెలసిన శ్రీరాజరాజేశ్వరి దేవి, చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవిగా దర్శనమిచ్చారు. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది. మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా, సరస్వతీ దేవిని పురాణాలు వర్ణించాయి. ఆమె సంగీత, సాహిత్యాలకు అధిష్టాన దేవత. మానవులందరికీ సకల విద్యలను ప్రసాదించి వారిలో జ్ఞాన దీపాన్ని వెలిగించే విద్యాశక్తి. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యా లాభం కలుగుతాయి. మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతిగా త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తన అంశంలోని నిజస్వరూపాన్ని సాక్షాత్కరింప చేయడమే మూలా నక్షత్రం రోజున చేసే అలంకార ప్రత్యేకత. శ్వేత పద్మాన్ని అధిష్టించి, వీణ, దండ, కమండలాలు, అక్షమాల ధరించి, అభయ ముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను ఆమె దూరం చేస్తారని విశ్వాసం.

చింతామణి సరస్వతి, జ్ఞాన సరస్వతి, నీల సరస్వతి, ఘటసరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మహా సరస్వతి అనేవి సరస్వతీదేవి ఏడు రూపాలు. ఆమెను కొలిస్తే విద్యార్థులకు మంచి చదువును ప్రసాదిస్తుందని, వాక్సుద్ధి, మంచి బుద్ధి ఇస్తుందని నమ్మిక. నవరాత్రుల్లో మూలా నక్షత్రం నుండి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా అమ్మవారిని భక్తులు ఆరాధించాలని ఆలయ పూజారి రామాచారి జోషి తెలిపారు. ఉదయం అమ్మవారికి అభిషేకం, అలంకరణ మంగళహారతి, తీర్థప్రసాదముల వితరణ, సాయంత్రం కుంకుమార్చనలు, సాంస్కృతి కార్యక్రమాలు జరిగాయని ఆయన తెలిపారు.శరన్నవరాత్రి ఉత్సవాలలో ప్రతి రోజు అలంకరించే అలంకరణ  అక్కల రవి అనే భవాని మాలాధారణ భక్తుడు అలంకరణ చేస్తున్నాడు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పద్మశాలి కుల బాంధవులు, మహిళలు, పిల్లలు దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించారు.