సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య

Submitted by shankar on Tue, 13/09/2022 - 12:07
Death toll rises to eight in Secunderabad fire incident

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇప్పటికే ఏడుగురు చనిపోగా తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతిచెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి అపోలో,యశోద ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

మృతుల వివరాలు

అల్లాడి హరీశ్‌ (33), విజయవాడ (రామవరప్పాడు)
వీరేంద్రకుమార్‌ (50), దిల్లీ సీతారామన్‌  (48),చెన్నై బాలాజీ (58),చెన్నై రాజీవ్‌ మైక్‌ (26),దిల్లీ
సందీప్‌ మాలిక్‌,దిల్లీ
ఓ మహిళ సహా మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది.

గాయపడినవారు

సంతోష్‌ (26), పెందుర్తి
జయంత్‌ (39) బెంగళూరు
దేబాశిష్‌ గుప్తా (36) కోల్‌కతా
యోగిత (26) పెందుర్తి (సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, మాదాపూర్‌)
కేశవన్‌ (27) చెన్నై
దీపక్‌ యాదవ్‌ (38) క్వాలిటీ ఆఫీసర్‌, హరియాణా
ఉమేశ్‌ కుమార్‌ (35), మార్కెటింగ్‌ మేనేజర్‌, కోల్‌కతా
మన్మోహన్‌ ఖన్నా (48),రాంనగర్‌
రాజేశ్‌ జగదీశ్‌ (49), గుజరాత్‌

ఎలా జరిగింది?

సోమవారం రాత్రి సికింద్రాబాద్‌ పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలో రూబీ లగ్జరీ ప్రైడ్‌ పేరిట ఉన్న అయిదంతస్తుల భవనంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. భవనంలోని సెల్లార్‌, గ్రౌండ్‌ ఫ్లోర్లలో రూబీ ఎలక్ట్రిక్‌ వాహనాల షోరూం నడుస్తోంది. మిగిలిన నాలుగు అంతస్తుల్లో హోటల్‌ నిర్వహిస్తున్నారు. రాత్రి 9.40 గంటల ప్రాంతంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఇవి వచ్చినట్లు సిబ్బంది చెబుతున్నారు.వేడికి షోరూంలోని ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీలు పేలాయి. దీనివల్ల మంటల ఉద్ధృతి మరింత పెరిగింది. వాహనాలకు వ్యాపించడంతో పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. మెట్లమార్గం ద్వారా పై అంతస్తులకు వ్యాపించాయి. దీనికితోడు వాహనాలు, బ్యాటరీల కారణంగా దట్టమైన పొగ అలుముకుంది. ఊపిరి ఆడక లాడ్జిలో వసతి పొందుతున్న ఏడుగురు పర్యాటకులు మృతి చెందారు.తాజాగా మరొకరు చనిపోయారు.

ప్రధాని దిగ్భ్రాంతి

 అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.