బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో... బంగారు గౌరమ్మ ఉయ్యాలో

Submitted by bosusambashivaraju on Tue, 27/09/2022 - 11:56
Bathukamma.. Bathukamma uiyalo... golden In Gauramma Uyya

శోభాయమానం బతుకమ్మ సంబురం

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 26 ( ప్రజాజ్యోతి) :- బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలోబంగారుగౌరమ్మ ఉయ్యాలోఅంటూ తెలంగాణ మహిళలు అత్యంత ఉత్సాహంగా భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజుల పాటు తెలంగాణ ప్రాంత మహిళలంతా బతుకమ్మ వేడుకలు నిర్వహించుకుంటారు. తెలంగాణ ప్రాంతానికే పరిమితమైన పండుగ బతుకమ్మ పండుగ. తెలంగాణ వ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు బతుకమ్మ సంబురాలకు సిద్దమవుతున్నాయి. పూలు కొనుగోలు చేయడానికి మహిళలంతా సిద్ధమయ్యారు. కొత్త బట్టలు, బంగారు నగలు ధరించి మహిళల సంస్కృతి, సాంప్రదాయాలతో ఆడి, పాడి వేడుకలను ఘనంగానిర్వహించుకుంటారు. ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేది బతుకమ్మ పండుగ. ఇది ఒక పూల పండుగ. ప్రకృతిని పూజించే పండుగ.  తొమ్మిది రోజుల పాటు ఆడి, పాడి గౌరీదేవిని అత్యంత భక్తితో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబురం ఈ బతుకమ్మ పండుగ.ఎంగిలిపూల బతుకమ్మఆశయుజ అమావాస్యనాడు ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమై తొమ్మిదిరోజుల పాటుసాగే సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపడంతో ముగిస్తాయి. మహిళలు చేసే హడావుడిఅంతా ఇంతా కాదు. ప్రకృతిలో లభించే తంగేడు పువ్వులు, ఆకులు, తీరొక్క రంగు తెచ్చి రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి, నిత్యం గౌరీదేవిని తమ ఆటాపాటలతో పూజిస్తారు. అందరు కలిసి సంతోషంగా పాటలు పాడుతూ బతుకమ్మను పూజిస్తారు. ఒకరు పాడుతుండగా మిగతవారంతా పాడుతారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమయ్యే వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగిస్తాయి. అమావాస్య రోజు పూజించుకుంటూ అదే సమయంలో బతుకమ్మను. పేర్చి మహిళా సంబురాలు జరుపుకుంటారు.

బతుకమ్మ పూల ప్రత్యేకత..
బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి పూజించేపూలకు ఒక విశేషం ఉంది. ఔషధ గుణాలున్న పువ్వులను బతుకమ్మగా పేర్చడం కోసం తంగేడు,గునుగు, బంతి, చామంతి, కట్ల, సంపెంగ, మొట్ల, సీత జడలు, రుద్రాక్ష బంతి, మల్లె, మందార మరువం పారిజాతం, కమలం, గన్నేరు, గుమ్మడి, గులాబీ, పట్టుకుచ్చులు తదితర పూలతో చక్కగా వాటిని ఒక దానిపై ఒకటి పేర్చి బతుకమ్మ అని పిలిచే బతుకమ్మ సంబురాలు జరుపుకుంటారు. మహిళలు చక్కగా ముస్తాబై అత్యంత భక్తి శ్రద్ధలతో తయారు చేసిన బతుకమ్మలను తీసుకొని ఆలయంలో గుంపులుగా ఉండి బతుకమ్మ సంబురాలు జరుపుకుంటారు. చిన్న, పెద్ద, ముసలి, ముతక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సంబరాల్లో మునిగితేలుతారు. తెలంగాణ సంస్కృతిని,తెలంగాణ గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబించే జానపదాలు పాడుతూ ఉత్సాహంగాజరుపుకుంటారు.బతుకమ్మ నైవేద్యాలు..ఎంగిలిపూల బతుకమ్మగా మొదటిరోజు ఉదయం అత్యంత భక్తి శ్రద్దలతో బతుకమ్మలను పేర్చిపూజిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా నువ్వులు,బియ్యం పిండి, నూకలు కలిపి ప్రసాదంగా తయారుచేస్తారు. రెండవ రోజు ఆశీర్వనాడు అటుకుల బతుకమ్మను జరుపుకుంటారు. అటుకులు, పప్పు, బెల్లంతో నైవేద్యం తయారుచేసి అమ్మవారికినివేదిస్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మతో మహిళలు సంబరాలు చేసుకుంటారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారుచేసి గౌరీ దేవికి సమర్పిస్తారు. నాల్గవ రోజు నానబియ్యం బతుకమ్మను జరుపుకుంటారు. నానబెట్టినబియ్యం, బెల్లం, పాలు కలిపి నైవేద్యంగా తయారు చేసి అమ్మవారికి నివేదించి వేడుక జరుపుకుంటారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరోజు అమ్మవారికి నైవేద్యంగా అట్లను, దోసెలను పెట్టి పూజిస్తారు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ పేరుతో సంబరాలకు దూరంగా ఉంటారు. మళ్లీ ఏడవ రోజు.వేపకాయల బతుకమ్మతో వాటి చుట్టూ బాగా వేయించి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదవరోజు వెన్నముద్దల బతుకమ్మతో సంబురాలు జరుపుకుంటారు. ఆరవ రోజు వెన్న, నువ్వులు, బెల్లంతో తయారుచేసి అమ్మ వారికి సమర్పిస్తారు. తొమ్మిదవ రోజు చివరి అత్యంత ముఖ్యమైనసద్దుల బతుకమ్మ అంటే దుర్గాసినాడు ఐదు రకాలనైవేద్యాలతో సద్దుల బతుకమ్మను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అమ్మ వారికి నైవేద్యంగాపెరుగన్నం, చింతముడు, పులిహోర, నిమ్మకాయ,అన్నం కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు. ఈ తొమ్మిదిరోజుల పాటు అమ్మవారికి నైవేద్యం పెట్టి వాటిలో రకరకాల ధాన్యాలను వినియోగిస్తారు.
బతుకమ్మ నిమజ్జనం..
తొమ్మదిరోజుల పాటు బతుకమ్మ పూజించిన మహిళలు చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు చెరువులో నిమజ్జనం చేస్తారు. మేళ తాళాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని గంగమ్మ ఒడికి చేరుస్తారు. పూలతో తయారు చేసిన బతుకమ్మపై ఉంచే పసుపుతో తయారుచేసిన గౌరమ్మను వేళ్ళతో పుస్తెలకు పూసుకుంటారు. దీనివల్ల తమ మాంగళ్యం అంటే భర్తను ఆపదల నుంచి కాపాడి చల్లగా చూస్తారని ప్రజల, ఆడపడుచుల అపార నమ్మకం.