
నైపుణ్య విద్య అరుదైన సరుకైంది..!!
ఖమ్మం, ఆగస్ట్ 30, ప్రజాజ్యోతి.
జనాభా విస్ఫోటన భారతంలో ఉన్నత విద్య అందని ద్రాక్ష అవుతున్నది. నాణ్యమైన విద్య అది తక్కువ విద్యా సంస్థలకే పరిమితమైంది. ఉద్యోగ సాధన గగనమైపోయింది. విశ్వవిద్యాలయ సర్టిఫికేట్లకు గౌరవం అడుగంటుతుంది. నైపుణ్య విద్య అరుదైన సరుకైంది. ఏ దిక్కులేక డిగ్రీలు చదివిన భారతీయ యువత ఆకర్షణీయ వేతనాలు, ఆధునిక జీవనశైలి, జీవన, ఆరోగ్య భద్రత, అనుకూల వాతావరణం, పాలసీలు, సులభ ఉద్యోగసాధన, పార్ట్‌టైమ్ ఉద్యోగాల సౌకర్యం లాంటి అనుకూల అంశాలతో విదేశాలకు ఎగిరి పోవాలని ప్రయాస పడుతున్నారు. ఏటేటా విదేశీ విద్య పేరున విమానాలు ఎక్కే యువత సంఖ్య పెరిగి పోతుంది. విదేశీవిద్య కోసం లక్షల్లో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి యువత బ్యాంకు అప్పుల భారాన్ని మోస్తూ విమానయానం చేస్తున్నారు. మన యువతకు ఆదర్శంగా భారత సంతతికి చెందిన గూగుల్ సిఈఓ సుందర్ పిచ్ఛయ్, మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్యనాదెళ్ళ, ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్ రఘురామ్ రాజన్ లాంటి మరెందరో నిలుస్తూ నిత్య ప్రేరణను ఇస్తున్నారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, లక్షల ఖర్చుచేసి, తాము ఆశించిన యూనివర్సిటీలో కోరుకున్న కోర్సులో ప్రవేశాలుపొంది, వీసాలు పొంది విమానయానం చేసి అమెరికా ఎయిర్‌పోర్టులో కాలుమోపిన పిదప మన యువతీ యువకులను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అనేక అనుమానాలతో దాదాపు ఐదు వందల మందిని వెనక్కి పంపించిన తాజాఘటనలు మనల్ని కలిచివేస్తున్నాయి. ఈ సంఘటనలతో మన యువతీయువకులు, వారి తల్లితండ్రులు తీవ్ర ఆందోళనలు చెందడం సహజం. వీసా అనేది ఏక్షణంలోనైనా రద్దు చేయవచ్చని, విద్యార్థులు సమర్పించే ధ్రువపత్రాలు సరైనవి కావని తేలినా, కొద్ది అనుమానాలకు తావిచ్చినా ఎప్పుడైనా చర్య తీసుకోవచ్చని అమెరికన్ కన్సులేట్ అధికారులు తెలపడం విచిత్రంగా, ఇబ్బందికరంగా ఉంది.
◆ ఆధునిక కోర్సుల కోసం విదేశీ వలసలు.
2017 నుంచి గత ఏడాది వరకు 30.13 లక్షల భారత యువత విదేశాల్లో ఉన్నత విద్య కోసం వలసలు వెళ్లారని, 2020లో కరోనా విపత్తు కారణంగా 2.6 లక్షల యువత, 2021లో 4.45 లక్షలు, 2022లో 68 శాతం అధికంగా 7.5 లక్షల యువతీ యువకులు విదేశీ చదువులకు పయనమయ్యారని తెలుస్తున్నది. విదేశీ విద్య నిమిత్తం మన యువత అమెరికా, యూకె, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల వైపు ఎక్కువగా చూస్తున్నారు. విదేశీ విద్య కోసం వెళ్లిన మన యువత 2024 నాటికి ట్యూషన్, ప్రవేశ రుసుం, నెలసరి వ్యయం రూపంలో 75 బిలియన్ డాలర్లు (ఆరు లక్షల కోట్ల రూపాయలు) వెచ్చించనున్నారని అంచనావేశారు. ఆర్‌బిఐ వివరాల ప్రకారం ప్రతి ఏట అమెరికాలో చదువుతున్న మన యువతకు ఒక్కొక్కరికి సగటున అన్ని ఖర్చులు కలుపుకొని ముప్పై వేల డాలర్ల ఖర్చు అవుతున్నట్లు తేలింది. మన యువతకు విదేశీ చదువుల నిమిత్తం మన జాతీయ బ్యాంకులు కూడా సులభంగా అధిక మొత్తం రుణాలు మంజూరు చేయడంతో సామాన్య కుటుంబాల యువత కూడా సరిహద్దులు దాటడానికి ధైర్యంగా ప్రయత్నిస్తున్నారు. గత దశాబ్దంలో 4.61 లక్షల యువత జాతీయ బ్యాంకుల్లో రుణాలు తీసుకొని విదేశాలకు ఎగిరి పోయారు. మన దేశీయ ఉన్నత విద్యా సంస్థలు ఎస్‌టిఈఎం (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) సబ్జెక్టుల్లో నాణ్యమైన విద్య అందించని కారణంగా ఐఐటి, ఎన్‌ఐటి, ఐఐఐటి లాంటి అత్యున్నత సంస్థల్లో కూడా కొన్ని కోర్సుల్లో సీట్లు (7,000 పిజీ సీట్లు, 3,000 పిహెచ్‌డి సీట్లు) ఖాళీగా ఉంటున్నాయి. ఇండియాలో పిహెచ్‌డి పూర్తి చేయడానికి సగటున కనీసం ఐదు ఏండ్లు పడుతుండగా కెనడా, యూరోప్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో మూడు నుండి నాలుగు ఏండ్లు మాత్రమే తీసుకొంటున్నారు.
◆ యూకెలో భారత యువతకు చేదు అనుభవాలు.
విదేశీ విద్య వేటలో యుకె కు వెళ్లిన యువతకు విద్య అనంతరం ఉద్యోగాలు దొరకడం కష్టంగా ఉంది. 2022లో ఉన్నత విద్య నిమిత్తం 22 శాతం యువత యుకె బాటపట్టారని, యుకె లో స్థానిక యువత కన్న భారతీయ యువత వద్ద ఫీజులు అధికంగా వసూలుచేస్తూ, అక్కడి యూనివర్సిటీలు ఆర్థికంగా బలపడుతున్నాయని తెలుస్తున్నది. యుకెలో చదివిన యువతలో 17 శాతం వర్క్ వీసాలు, 5 శాతం ఉన్నత చదువుల నిమిత్తం యుకెలో కొనసాగగా, 76 శాతం భారత యువతకు వీసాల గడువు తీరిపోతూ దిక్కులేని దుస్థితుల్లో వెనుదిరగ వలసి వస్తున్నది. యుకెలో నాణ్యత కొరవడిన, డిమాండ్‌లేని కోర్సుల్లో చేరిన మన యువతకు భవిష్యత్తు నిరాశాజనకంగా ఉంది. యుకె లోని అత్యున్నత 24 యూనివర్సిటీల్లో మాత్రమే 13 శాతం ప్రవాస భారత యువత ప్రవేశాలుపొంది మంచి భవితకు అర్హులు అవుతున్నారు. 2022 వివరాల ప్రకారం 2019-22 మధ్య కాలంలో విదేశీ విద్యవేటలో భారతీయ యువత 228 దేశాలు, స్వతంత్ర ద్వీపాల(డిపెండెంట్ ఐలాండ్స్)కు వలసలు వెళుతున్నారు. పేద దేశాలైన అఫ్ఘానిస్థాన్, మొజాంబిక్, సోమాలియా, ఆఫ్రికాలాంటి దేశాల్లో ఉన్నత విద్య నిమిత్తం కూడా యువత వెళుతున్నారు. ఇలాంటి దేశాల్లో ఉన్నత విద్యకు పోటీతక్కువగా ఉండడం, విద్య అనంతరం వ్యాపారాల్లో డబ్బు సంపాదించడం సులభంగా ఉన్నట్లు తెలుస్తున్నది. విదేశీ యూనివర్సిటీ ర్యాకింగ్, గుర్తింపు(ఎక్రెడిటేషన్), బోధనల పద్దతులు, జీవనవ్యయం, ఉద్యోగసాధన లాంటి అంశాలను విశ్లేషించి విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకుంటున్నారు. అంటే విలాసవంతమైన జీవితమని కలలుకనడం మానేసి, విదేశీ యూనివర్సిటీల ర్యాంకులను, నాణ్యతలను నిశితంగా పరిశీలించాల్సి ఉంది.
- 6 views