దారితప్పిన టి మార్ట్ కేసు... తంత్రం చేసిన పోలీసు అధికారి... ఒప్పందం పేరుతో రాజీయత్నం... టాస్క్ ఫోర్స్ తో కేసు కొలిక్కి వచ్చేనా.?

Submitted by SANJEEVAIAH on Fri, 23/06/2023 - 16:12
ఫోటో

దారితప్పిన టి మార్ట్ కేసు

తంత్రం చేసిన పోలీసు అధికారి

ఒప్పందం పేరుతో రాజీయత్నం

టాస్క్ ఫోర్స్ తో కేసు కొలిక్కి వచ్చేనా.?

నిజామాబాద్ క్రైమ్, ప్రజాజ్యోతి :

నిజామాబాద్ నడి బొడ్డున టి మార్ట్ (సూపర్ మార్కెట్) ను తగల బెడితే ఏడాది కాలం దగ్గర పడుతున్న నిందితులను మాత్రం పోలీసులు పట్టుకోలేక పోతున్నారు. ఎక్కడ చైన్ స్నాచింగ్ జరిగిన ఏ సంఘటన జరిగిన 24 గంటల లోపు చేదించడం సాధారణంగా మారిపోయింది. అలాంటిది కొందరు వ్యక్తులు కలిసి ఏకంగా టి మార్ట్ ను తగల పెట్టిన సంఘటన జరిగి ఏడాది కాలం దగ్గర పడుతున్న ఉలుకు పలుకు లేదు. అసలు ఈ ఆంతర్యం ఏమిటి అనేది అంతు చిక్కడం లేదు. ఫైర్ యాక్సిడెంట్ కాదని విద్యుత్ శాఖ చెపుతుంది. నిప్పు పెట్టారని, దానివల్లే టి మార్ట్ తగలబడినట్లు ఫైర్ అధికారులు వెల్లడించారు. అంటే పక్క ప్రణాళికతో రెక్కీ నిర్వహించి మరి నిప్పు పెట్టారని తెలుస్తుంది. ఎందుకు ఇంత టార్గెట్ చేసి ఎవరు తగల పెట్టారనేది తేలాల్సి ఉంది. కానీ పాపం మన పోలీసులు బిజీ బిజీ ఉండి కేసును చేదించ లేకపోయారా.? లేక ఏదైనా హస్తం చక్రం తిప్పితే అమ్యామ్యాలకి పోలీసులు తలోగ్గారా అనేది ఓ రహస్యంగా మారింది. ఇదిలా ఉంటే ఎస్బి, ఐడి పార్టీలలో పని చేసిన ఓ పోలీసు అధికారి చక్రం తిప్పడంతో కేసు మొత్తం తప్పుతోవ పట్టినట్లు సమాచారం. సదరు అధికారి ఈ కేసు ఆధారాలు దొరికిన వాటిని మాయం చేసి నామ మాత్రంగా కొన్ని ఆధారాలు చూపి చేతులు ఎత్తేశారు. 

దారి తప్పింది ఎలా.?

టి మార్ట్ కేసులో మొదటి నాలుగు రోజులు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు జరిగాయి. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆధారాలు సేకరించారు. ఎక్కడికక్కడే ఆధారాలు సేకరించిన స్పెషల్, ఐడి పార్టీ పోలీసులు ఓ కొలిక్కి తెచ్చారు. కానీ ఈ తతంగం నడిచే లోపు అసలు తంతు మొదలు అయింది. రాజకీయ అండ దండలతో రంగంలోకి దిగిన వ్యక్తి చక్రం తిప్పారు. జరిగింది ఎలాగూ జరిగిపోయింది, ఇప్పుడు చేసేది ఏమి లేదు. కాబట్టి మీరు ఫిర్యాదు చేయండి అని చెప్పారు. అనుమానితులు, శత్రువులు ఇలా ఇద్దరు ముగ్గురుపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ మొదలు పెట్టిన పోలీసులు కేసులో సూత్రధారులను, పాత్రధారులు తీరుపై విచారణ చేపట్టారు. అప్పటికే సిపి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించే దిశలో పోలీసులు పావులు కదిపారు. కానీ అనూహ్యంగా కేసు పక్కదారి  పట్టింది. ఓ పోలీసు అధికారి రంగంలోకి దిగి ఆధారాలను తారుమారు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీని కోసం సుమారు రూ.18 లక్షలు చేతులు మారినట్లు బహిరంగ ప్రచారం జరుగుతుంది. ఇంకేం ఉంది అప్పడు మూలన పడ్డ కేసు ఇప్పటికీ దుమ్ము దులిపిన పరిస్థితులు లేవు. బాధితులు ఎన్నిసార్లు పోలీసు స్టేషన్, జిల్లా పోలీసు అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయింది. ఇంత భారీ సంఘటన జరిగిన పోలీసులు కేసును చేదించడంలో విఫలం కావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఇప్పటికైనా కొలిక్కి వచ్చేనా.?

పెండింగ్ లో ఉన్న టి మార్ట్ కేసు ఈసారైనా కేసు కొలిక్కి వస్తుందా.? లేదా.? అనేది అనేది అంతు చిక్కడం లేదు. బాధితులు మరోసారి ఇంచార్జీ సిపి ప్రవీణ్ కుమార్ కు, మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు మరోసారి తెరపైకి వచ్చింది. కేసు విచారణను టాస్క్ ఫోర్స్ పోలీసులకు అప్పగించారు.  ఇప్పటికైనా కేసును కొలిక్కి తీసుకు వచ్చి నిందితులను అరెస్టు చేస్తారా లేదా వేచి చూడాలి.