చూపు మారితేనే మహిళా వికాసం..!!

Submitted by Praneeth Kumar on Fri, 08/03/2024 - 09:31
Women's development possible only if the perspective changes..!!

చూపు మారితేనే మహిళా వికాసం..!!

ఖమ్మం, మార్చి 08, ప్రజాజ్యోతి.

విజ్ఞులైన పాఠక మహాశయులందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఏటా మార్చి 8వ తేదీని ప్రపంచ మహిళా దినోత్సవంగా వేడుక చేసుకుంటున్నాం. ఇది మహిళా దినోత్సవమే అయినా మహిళలకు మాత్రమే సంబంధించిన విషయం కాదు, సమాజం మొత్తానికి సంబంధించిన విషయం. మహిళ అంటే గౌరవం, అభిమానం ఉన్నవారందరూ జరుపుకొనే పండుగ. అంటే ఉపన్యాసాలు చెప్పి ముగించటం కాదు, మహిళలు సాధించిన విజయాలను సగర్వంగా చాటిచెప్తూ, వారి అవసరాలను అర్థం చేసుకోవటానికి, వారికి ఉన్న సమస్యలను తీర్చటానికి, వారి అభ్యున్నతికి పాటుపడటానికి సభ్య సమాజం, ప్రభుత్వాలు తీసుకోవలసిన చర్యల పట్ల అందరిలో అవగాహన కల్పించటం ఈ ఉత్సవ ముఖ్య ఉద్దేశం. ఇది ఒక రిచ్యువల్‌గా జరుపుకొనే వేడుక కాదు. మహిళల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు అవసరాల పట్ల సహృదయమైన అవగాహనను సమాజంలో పెంపొందించేందుకు ఈ వేడుక ఒక వేదిక కావాలి. మహిళల సమస్యలు మగవారికి అంత సులభంగా అర్థం కావు. వారి సమస్యలను సానుకూలంగా అర్థం చేసుకోవటానికి ఒక మంచి వాతావరణం ఏర్పడాలి. ఏ సమాజం, ఏ సంస్కృతి ఏ జాతి స్త్రీకి సమున్నత స్థానం కల్పిస్తుందో ఆ సమాజం, ఆ సంస్కృతి ఆ జాతి అభివృద్ధి పథంలో ముందుంటుంది. ఏ సమాజం, ఏ సంస్కృతి ఏ జాతి అయితే ఈ విషయంలో వెనుకడుగు వేస్తుందో ఆ జాతి అభివృద్ధిని సాధించలేక ప్రగతిపథంలో వెనుకబడే ఉంటుంది. పాశ్చాత్య దేశాలు నేడు ఒళ్లు గగుర్పొడిచే ప్రగతిని సాధించాయంటే దానికి కారణం వారు జీవన స్రవంతిలో అన్నిరంగాల్లో స్త్రీకి ఇచ్చిన సమున్నత స్థానమే అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఏ దేశంలోనైనా జనాభాలో సగభాగమైన స్త్రీలు వారిలోని ఉత్పాదక శక్తిని వినియోగించే అవకాశం ఉంటేనే కదా సమాజం అన్నిరంగాల్లో సర్వతోముఖాభివృద్ధిని సాధించి ముందుకువెళ్తుంది. అలాంటి వాతావరణం కలగచేయవలసిన బాధ్యత సమాజం మీద ప్రభుత్వాల మీద ఉంటుంది. ఆ బాధ్యతను ఏడాదికి ఒకసారైనా గుర్తుచేసుకోవటం సముచితం. ఈ విషయంలో మనం ఆలస్యంగా మేలుకున్నాం. సమాజంలో స్త్రీ వివక్షకు గురైందన్న విషయంలో ఎవరికీ సందేహం ఉండనవసరం లేదు. నేడు స్త్రీ అన్నిరంగాల్లో పురుషులకన్నా మిన్నగా రాణిస్తున్నప్పటికీ స్త్రీ పట్ల చులకనభావం నుంచి సమాజం బయటపడలేదని చెప్పాలి. మార్పు రావాలంటే వాస్తవాన్ని ఒప్పుకోవాలి. స్త్రీని జెండర్‌ కోణంలో కాకుండా ఒక మనిషిగా చూడటం సమాజం నేర్చుకోవాలి. స్త్రీ రూపాన్ని కాకుండా స్వరూపాన్ని చూసే దిశగా సమాజం పయనించాలి. అందంగా ఉంటే అదే పనిగా చూడాలా..?? అందంగా లేకపోతే పెదవి విరవాలా..?? పిల్లలకు పాఠశాల దశ నుంచే స్త్రీ పట్ల చైతన్యవంతమైన దృక్పథం అలవడేలా అడుగులు వేయాలి. పాఠ్య పుస్తకాల్లో కూడా స్త్రీ సంబంధిత అంశాలను చేర్చాలి. చిన్నారుల మనసులను పసితనం నుంచే స్ఫూర్తిదాయకంగా మార్చాలి. అప్పుడే లైంగిక వేధింపులకు అడ్డుకట్ట పడుతుంది. కానీ, ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు. దృక్పథంలో మార్పు అనేది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. స్త్రీల మీద జరిగే దాడుల విషయంలో సత్వర న్యాయం జరగాలి. ఆధునిక స్త్రీ అన్నిరంగాల్లో పురుషుల కన్నా మించి రాణిస్తుందనటంలో సందేహం లేదు. ఉదాహరణకు ఒకే సంస్థలో ఉద్యోగం చేసే ఒక మగవాడు, ఒక మహిళను తీసుకుందాం. మగవాడు ఇంటి దగ్గరి నుంచి వచ్చింది మొదలు ఇంటికి వెళ్లేవరకూ తన పని తాను చేసుకుంటూ వెళ్తాడనుకుందాం. అది నిజమే కదా. అయితే స్త్రీ తన విధులు పురుషులతో సమానంగా నిర్వర్తించటంతోపాటుగా, ఇంటిని గురించి ఆలోచిస్తుంటుందన్న విషయాన్ని కాదనగలమా..?? పసి పిల్లలుంటే, వాళ్లు ఎలా ఉన్నారోనని, బడికిపోయే పిల్లలుంటే వాళ్లు బడి నుంచి వచ్చాక తిన్నారో లేదోనని ఆలోచిస్తుంది స్త్రీ. పిల్లలున్న పురుషుడికి ఈ ఆలోచనలు ఉండవు. ఎందుకని..?? పురుషుడికి బాధ్యత లేదు అని కాదు ఇక్కడ వాదన. ఇంటి వ్యవహారం అంతా స్త్రీ చూసుకుంటుందని భరోసా. ఈ పరిస్థితిలో ఎవరు ఎక్కువ పని చేస్తున్నట్టు..?? స్త్రీ ప్రకృతిపరంగా తనకుండే ఇబ్బందులను అధిగమించి పనిచేయాలి. పురుషులకు ప్రకృతిపరమైన ఇబ్బందులేమీ లేవు. స్త్రీలు పని ప్రదేశంలో ఇంటిని గురించి ఆలోచించేది పనికిందికి రాదనే వితండవాదులూ ఉన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే కదా అంటారు. మరి పని ప్రదేశంలో ఉండి అక్కడ బాధ్యతలను పురుషులతో సమానంగా నిర్వర్తిస్తూ కూడా రేపటి పౌరులను, అంటే తన పిల్లలను, గురించి ఆలోచించటమంటే అది సమాజ సేవ కాదా..?? అది దేశ సేవ కిందికి రాదా..?? ఆ పిల్లలే కదా రేపు డాక్టర్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలయ్యేది..?? చంద్రయాన్‌ విజయవంతమైనప్పుడు మన ప్రధాని శ్రీహరికోట వెళ్లి అక్కడి శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించినప్పుడు ఆ బృందంలో ఎంతోమంది మహిళా శాస్త్రవేత్తలను మనమందరం చూశాం. వాళ్లు కూడా వారి విధులను సక్రమంగా నిర్వర్తిస్తూనే ఇంట్లో పసి పిల్లలు ఎట్లా ఉన్నారోనని ఆందోళన చెందిన సందర్భాలు సమాజానికి కనిపించవా..?? ఇంటిని చూసుకుంటూనే శాస్త్రవేత్తలుగా వారి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించటం గొప్ప విషయం కాదా..?? ఒక్క ఇస్రోలోనే కాదు, ఏ పని ప్రదేశంలోనైనా ఇదే జరుగుతుంది. దీనికి వెల కట్టగలమా..?? మహిళల సమస్యలను పురుషులు కొంతవరకే అర్థం చేసుకోగలరు. ప్రకృతిపరంగా స్త్రీకి ఉన్న సమస్యలు స్త్రీలకు మాత్రమే అర్థమవుతాయి. మరి ఆ సమస్యల పరిష్కారానికి చేసే విధాన రూపకల్పన ప్రక్రియలో స్త్రీలకు స్థానం ఉండాలా లేదా..?? దీన్నే ప్రజా జీవితంలో స్త్రీకి సమున్నత ప్రాతినిధ్యం ఇవ్వటం అంటారు రాజకీయ భాషలో. అంటే పరిపాలనకు రూపకల్పన చేసే చట్టసభల్లో స్త్రీలకు జనాభాలో వారి నిష్పత్తికి తగిన ప్రాతినిధ్యం లేదు. చట్టసభల్లో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కావాలని ఎన్నో ఏండ్ల నుంచి గొంతెత్తి ఘోషిస్తుంది మహిళా లోకం. నేటికి పాలకులు కరుణించి ఐదేండ్ల తర్వాత మూడోవంతు ప్రాతినిధ్యం కల్పిస్తాం అని సెలవిచ్చారు. కానీ ఐదేండ్లు ఎందుకు ఆగాలనే దానికి ఎవరివద్దా సమాధానం లేదు. ఈ మధ్యకాలంలో పరిపాలనా వ్యవస్థలో ఒక హర్షించదగిన మార్పు చూస్తున్నాం. అదేమంటే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఎక్కువగా స్త్రీల పేరు మీద ఇస్తున్నారు. ఇదొక శుభ పరిణామంగానే చూడాలి. డ్వాక్రా ఉద్యమం కారణంగా బ్యాంకులు మహిళా స్వయం సహాయక సంఘాలకు పూచీకత్తులేని రుణాలను విరివిగా ఇస్తున్నాయి. నేడు స్త్రీలు ఆత్మ విశ్వాసంతో బ్యాంకు మెట్లు ఎక్కుతున్నారు. బ్యాంకు అధికారులతో ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారం గణనీయంగా తగ్గిపోయింది. స్త్రీ మొహంలో చిరునవ్వు ఉంటే తన ఇంట్లో సంతోషం ఉన్నట్టు. స్త్రీ ఆరోగ్యంగా ఉంటే తన ఇల్లు ఆరోగ్యంగా ఉన్నట్టు. స్త్రీ చేతిలో ధనం ఉంటే ఆ ఇంట్లో ధనం ఉన్నట్టు. స్త్రీ చేతిలో ఉండేది ఏదైనా కుటుంబంలోని ప్రతి మనిషికీ అందుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. మధ్య తరగతి ఇండ్లలో చాకిరిచేసే స్త్రీకి ఆ ఇళ్లవారు తినమని ఏమైనా ఇస్తే ముందు పిల్లలకు, ఆ తర్వాత పెనిమిటికి పెట్టగా మిగిలితేనే తాను నోట్లో వేసుకుంటుంది గాని, తానే ముందు తినదు, ఆమె ఎంత ఆకలి మీద ఉన్నప్పటికీ..!! అది స్త్రీకి సహజంగా అబ్బే త్యాగనిరతి. అంతటి బాధ్యతాస్ఫూర్తి, త్యాగనిరతి ఉన్న వ్యక్తి విధానరూపకల్పన ప్రక్రియలో తప్పనిసరిగా భాగస్వామి అయి ఉండాలి. ఇది సమాజానికి శ్రేయస్కరం. ఆ దిశగా స్త్రీలు పయనించటానికి విధానరూపకల్పనలో భాగస్వామ్యం పొందటానికి కుటుంబపరంగా, సమాజపరంగా అనువైన వాతావరణం కల్పించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నదన్న విషయాన్ని ఈ రోజు మనం అర్థం చేసుకుంటే మహిళా దినోత్సవ వేడుక పరిపూర్ణమైనట్టే అన్నది మా అభిప్రాయం.