ఏజెన్సీ చట్టాల పైన రాజకీయ పార్టీల వైఖరి ఏంటి..?

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 14:31
 What is the attitude of political parties on agency laws?


 చట్టాన్ని అమ్ముకుంటున్న అధికారులు-- కురసం విజయ్

వెంకటాపురం (నూగూరు)సెప్టెంబర్ 16( ప్రజా జ్యోతి)//  చట్టాలు అమలు చేయాలని దీక్షలు చేస్తూ ఉంటే ఏ ఒక్క రాజకీయ పార్టీ ఎందుకు మాట్లాడటం లేదని ఆదివాసీ నవనిర్మాణ సేన విద్యార్థి విభాగ మండల అధ్యక్షులు కురసం విజయ్ నిలదీశారు.చట్టాలు అమలు చేయాలని బర్లగూడెం సర్పంచి నర్సింహమూర్తి చేస్తున్న దీక్షలు శుక్రవారం  25 వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలను అదునుగా చేసుకున్న రెవెన్యూ, పంచాయతి అధికారులు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్టు ప్రజలు ఆరోపిస్తున్నారని అన్నారు. ఆదివాసీ చట్టాలను అమ్ముకోవడం అధికారుల ప్రథమ కర్తవ్యం అన్నారు. ఆదివాసీ చట్టాల అమలు విషయంలో ఈ ప్రాంత రాజకీయ పార్టీల వైఖరి ఏంటని విజయ్  ప్రశ్నించారు. రాజ్యాంగ బద్దంగా  ఏర్పాటు అయిన ఏజెన్సీ చట్టాలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. వీటి పైన కాంగ్రెస్, బిజెపి పార్టీలు అధికార పార్టీని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఆదివాసీ చట్టాల అమలు విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకే దారిలో ప్రయాణిస్తున్నాయని ఆరోపించారు. ఈ దేశ రాజ్యాంగం పైన ,పార్లమెంట్ ల పైన ఈ రాజకీయ పార్టీలకు ఎటువంటి గౌరవం ,మర్యాదలు లేవన్నారు. ఒకవేళ ఉంటే చట్టాలను అమలు చేయాలని అధికార పార్టీని నిలదీసేవని అన్నారు. వలస గిరిజనేతరులు కొన్ని రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకొని ఆదివాసీ చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.

ఆదివాసీ చట్టాలను అమలు చేయకపోతే అధికార, ప్రతిపక్ష పార్టీలను ఆదివాసీ గూడేళ్లల్లో తిరుగబోనివ్వమని ఆయన పేర్కొన్నారు. ఆదివాసీ ప్రజలు పార్టీలను ప్రశ్నించే సమయం ఎంతో దూరం లేదన్నారు. మాటలు చెప్పి ఓట్లు దండుకునే రోజులు పోతున్నాయని అన్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క రాజకీయ పార్టీ ఆదివాసీల విద్య ,వైద్యం, ఉపాధి, 1/70 ,పెసా వంటి చట్టాల అమలు కోసం చేసింది శూన్యం అని అన్నారు. ఆదివాసీ చట్టాలను అమలు చేస్తామని చెప్పని ఏ ఒక్క రాజకీయ పార్టీని గూడేళ్ళో తిరుగబోనివ్వమని హెచ్చరించారు.  వలస గిరిజనేతరులు అంత రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకొని 1/70, పెసా చట్టాలను ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. నాయకులు భార్గవ్, భవాని,సుభద్ర, కారం రాధ, ఇర్ప బాబు, చిరుతపల్లి, ఒంటిమామిడి ప్రజలు పాల్గొన్నారు.