దేశానికే దిక్సూచిగా తెలంగాణ

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 14:22
Telangana is a compass for the country
  • భూపాలపల్లి   అంబేడ్కర్ చౌరస్తా నుంచి  అంబేడ్కర్ స్టేడియం వరకు సమైక్యతా ర్యాలీ
  • 300మీటర్ల జాతీయ జెండా తో సాగిన ఊరేగింపు
  • తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు 3 రోజుల నిర్వహణ
  • వైభవోపేతంగా సమైక్యతా ర్యాలీ
  • దేశాన్ని సాకుతున్న రాష్ట్రాలలో  తెలంగాణ ఒకటి
  • భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ర్యాలీని  వరంగల్ ఎంపీ,  జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించిన భూపాలపల్లి ఎమ్మెల్యే

  భూపాలపల్లి ప్రతినిధి, సెప్టెంబర్ 16ప్రజాజ్యోతి. దేశానికి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దిక్సూచిగా నిలుస్తున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.శుక్రవారం భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో  అంబేడ్కర్ చౌరస్తా నుంచి అంబేడ్కర్ స్టేడియం  వరకు నిర్వహించిన జాతీయ సమైక్యతా ర్యాలీని  వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్,     కలెక్టర్ భవేశ్ మిశ్రా ,పార్టీ అధ్యక్షులు గండ్ర జ్యోతి,మున్సిపల్ చైర్ పర్సన్  లతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అంబేడ్కర్ చౌరస్తా నుంచి అంబేడ్కర్ స్టేడియం వరకు ఆసాంతం  ర్యాలీ దేశభక్తి నినాదాలతో వైభవోపేతుగా జరిగింది. ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్న వేలాది మంది ప్రజలు మువన్నెల జెండాలను రెపరెపలాడిస్తూ ఉత్సాహవంతంగా ముందుకు సాగారు.అంబేద్కర్ స్టేడియం లో నిర్వహించినసమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి  మాట్లాడుతూ  చారిత్రాత్మకంగా అత్యంత ప్రాధాన్యం కల్గిన రోజు సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు.భారత దేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత హైదరాబాద్, జోద్ పూర్, మైసూర్,   జమ్మూ కాశ్మీర్ మొదలైన 565  ప్రాంతాలను  దేశంలో విలీనం చేస్తారని పేర్కొన్నారు.  అత్యధికంగా హిందువులు నివసిస్తు ముస్లిం రాజుగా ఉండే హైదరాబాద్ రాష్ట్రం పోలిస్ యాక్షన్ అనంతరం 17 సెప్టెంబర్ 1948న ప్రజాస్వామ్య బద్ధ భారతదేశంలో విలీనమైందని తెలిపారు.  ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు పూర్వ కాలం నుంచి చైతన్యంతో  ప్రజా వ్యతిరేక  ప్రభుత్వాలు పై వీరోచిత పోరాటం చేశారని, 2వ జలియాన్ వాలా బాగ్ గా పరకా ప్రాంతానికి పేరు వచ్చిందని, పోరాటంలో 22 మంది తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని ఎమ్మెల్యే గుర్తు చేశారు.హైదరాబాద్ రాష్ట్రం ప్రజాస్వామ్య బద్ద భారతదేశంలో విలీనమై 75 సంవత్సరాలవుతున్న దృష్ట్యా సీఎం కేసీఆర్ ఆదేశాలతో 3 రోజులపాటు ఘనంగా సంబరాలు జరుపుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. 

01 నవంబర్ 1956 లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు దృష్ట్యా ఆంధ్రాలో తెలంగాణ విలీనమైందని, అనంతరం సీఎం కేసీఆర్ నాయకత్వంలో 14 సంవత్సరాల మలిదశ ఉద్యమం తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశానికి తెలంగాణ రాష్ట్రంలో అందుతున్న పాలన ఆదర్శంగా నిలిచిందని, మిషన్ భగీరథ, రైతుబంధు , మిషన్ కాకతీయ వంటి పథకాలను ఇతర రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుందని పేర్కొన్నారు. తెలంగాణ జనాభా దేశంలో 2.5% ఉన్నప్పటికీ దేశ జీడీపీ లో 5%  మన రాష్ట్రం ద్వారా వస్తుందని , దేశాన్ని సాకుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ముందువరుసలో ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీరు, విద్యుత్, సంక్షేమ రంగాలలో అగ్రగామిగా నిలిచామని కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేశామని తెలిపారు.వ్యవసాయం దండుగ అన్న ప్రాంతంలో వ్యవసాయాన్ని పండుగ చేసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని, రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, ఎకరానికి రూ 10వేల రైతు బంధు సాయం, రైతు భీమా, మద్దతు ధర పై ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనని ఎమ్మెల్యే అన్నారు.   గతంలో ఉన్న భూమి పన్ను, నీటి తీరువాలను పూర్తి స్థాయిలో రద్దు చేసామని, ప్రధాన మంత్రి గుజరాత్ రాష్ట్రంలో సైతం  కేవలం 600 అందిస్తున్నారని మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దివ్యాంగులకు రూ.3016/- , మిగిలిన వర్గాలకు రూ.2016/- పెన్షన్ అందిస్తుందని అన్నారు.

గ్రామ పంచాయతీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రతి గ్రామ పంచాయతీలో  వైకుంఠ దామం, సెగ్రిగేషన్ షెడ్డు , ట్రాక్టర్  వంటి అనేక సదుపాయాలు కల్పించామని, భూపాలపల్లి పట్టణంలో   డీగ్రీ కాలేజీ, జూనియర్ కళాశాల ఏర్పాటు, సింగరేణి కార్మికులకు అదనంగా 1000 క్వార్టర్ నిర్మాణం చేపట్టామని అన్నారు.  జిల్లాలో ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళే అవసరం లేకుండా  జిల్లా ఆసుపత్రిలో 25 స్పెషలిస్ట్ లను నియమించామని తెలిపారు.భవిష్యత్తులో జిల్లాకు మెడికల్ కాలేజీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. అంగన్ వాడి కేంద్రాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని, గిరిజన పోడు భూముల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని అన్నారు.ప్రజలందరూ కుల మతాలకతీతంగా ఐక్యంగా ఉంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నందున అద్భుత ప్రగతి సాధ్యమైందని, సమాజంలో ఉన్న కొన్ని దుష్టశక్తులు ప్రజలలో ఉన్న సమైక్యతను దూరం చేసేందుకు మథ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని , వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ హైదరాబాద్ రాష్ట్రం ప్రజాస్వామ్యం భారత దేశంలో విలీనం అయి 75 సంవత్సరాలవుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ 3 రోజులపాటు వేడుకలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అనేక నష్టాలు విద్యుత్ లేక , పంటకు గిట్టుబాటు ధర లేక బాధపడ్డామని, నూతన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక సంస్కరణలు చేసి ఇంటింటికి త్రాగునీరు, 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్  భవేశ్ మిశ్రా మాట్లాడుతూ ఆగస్టు 8 నుంచి ఆగస్టు 22 వరకు స్వాతంత్ర్య వజ్రోత్సవాలు నిర్వహించామని,    దేశానికి స్వాతంత్రం లభించిన తరువాత  రాజుల పాలనలో ఉన్న   హైదరాబాద్ ,  మైసూర్ , జోద్పూర్  మొదలైన  ప్రాంతాలు తరువాత సమయంలో  దేశంలో విలీనమయ్యాయని కలెక్టర్ తెలిపారు.17 సెప్టెంబర్ 1948న హైదరాబాద్ రాష్ట్రం ప్రజాస్వామ్యం వద్ద భారతదేశంలో విలీనమై 75 సంవత్సరాలవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా 3 రోజులపాటు వేడుకలు నిర్వహిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.  15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించామని, 10 వేల జాతీయ జెండాలను అందించామని తెలిపారు స్వతంత్ర భారతదేశంలో మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు, సౌకర్యాలు అనేకమంది మహనీయులు చేసిన కృషి ద్వారా వచ్చిందని మనం గుర్తుంచుకోవాలని కలెక్టర్ తెలిపారు. మహనీయుల ఆశయాల సాధనకు మనమంతా సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సమైక్యత ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు, యువకులు, మహిళలకు ధన్యవాదాలు తెలుపుతూ ర్యాలీ నిర్వహణ సమర్థవంతంగా జరగడంలో కీలక పాత్ర పోషించిన అధికార సిబ్బందిని, పాత్రికేయులను కలెక్టర్ అభినందించారు.