గురువులు కరువయ్యారు..!!

Submitted by Praneeth Kumar on Thu, 22/02/2024 - 09:37
Shortage of teachers..!!

గురువులు కరువయ్యారు..!!
          
ఖమ్మం, ఫిబ్రవరి 22, ప్రజాజ్యోతి.

నేటి యువత అధిక సంఖ్యలో ఇంజనీరింగ్, ఇతర టెక్నికల్ డిగ్రీలు చదువుతూ సాఫ్ట్‌వేర్‌ రంగంలోనే అధిక మొత్తంలో వేతనాలు వస్తున్నాయన్న ఆశతో ఆ రంగం వైపే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. బిఏ, బిఎస్సీ, బికాం లాంటి డిగ్రీలు; బిఈడి, ఎంఈది, ఎంఎస్సీ లాంటి ఉన్నత కోర్సులు చదివేవారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. ప్రైవేట్ విద్యా సంస్థలు, ముఖ్యంగా బడ్జెట్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత మరింత అధికంగా ఉంది. ఏడాది పొడవునా ఉపాధ్యాయులు కావాలని దినపత్రికల్లో నిత్యం వస్తున్న ప్రకటనలే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ ఉపాధ్యాయులకు లక్షల్లో వేతనాలు వస్తున్నాయి. అదే విధంగా సాఫ్ట్‌వేర్‌ రంగంలో కూడా లక్షల్లో వేతనాలు వస్తున్నాయి. ఈ పరిస్థితి ప్రయివేటు విద్యారంగం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. రాష్ట్రంలో పడివేలకు పైగా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. రెండు లక్షలకు పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మరో 20వేల నిష్ణాతులైన ఉపాధ్యాయుల అవసరం ఉందని అంచనా. పరిస్థితి ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో విద్యా ప్రమాణాలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి నెలకొంటుంది.
ఇంటర్నేషనల్ స్కూల్స్, సిబిఎస్సీ స్కూల్స్‌లో సైతం గత్యంతరం లేని పరిస్థితుల్లో పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ నామమాత్రంగా పాసైన వాళ్లను  టీచర్లు గా నియమించుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. ఏడు నుంచి పది తరగతుల విద్యార్థులకు ఒక నిర్దిష్ట సబ్జెక్టులో నైపుణ్యం కలిగిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు దొరకడం లేదు. విచిత్ర పరిణామం ఏమిటంటే గత నాలుగేళ్ళుగా బడ్జెట్ స్కూళ్లలో ఉన్న మాములు టీచర్లను కూడా ఇంటర్నేషనల్, సిబిఎస్సీ స్కూల్ యాజమాన్యాలు ఎక్కువ మొత్తంలో వేతనాలు ఇచ్చి తీసుకోవడం. సిటెట్, నెట్, టెట్ వంటి పరీక్షలు రాసి ప్రభుత్వ టీచర్లుగా ఉద్యోగాలు రాని వారు సహితం ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు లేదా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల కోసమే పరిగెడుతున్నారు తప్ప తాము నేర్చుకున్న విద్యను ఇతరులకు నేర్పించే గురువులుగా మారడం లేదు.
తరగతి నిర్వహణ, నిర్దిష్ట విషయాలలో నైపుణ్యం, మౌఖిక కమ్యూనికేషన్, విభిన్న పరిస్థితులకు అనుగుణంగా విద్యను బోధించే సామర్థ్యం, టెక్నాలజికి అనుగుణంగా బోధనా సామర్థ్యం, వినూత్న శిక్షణ వ్యూహాలు, వ్యక్తిత్వ లక్షణాలు, సమర్థవంతమైన సంభాషణ, సహనం సానుకూలత, సృజనాత్మకత బహుళ సబ్జెక్టులను బోధించే నైపుణ్యం, ఇవేవి నేటి టీచర్లలో కనిపించడం లేదు. అడిగినంత ఫీజులు కట్టినప్పటికి విద్యార్థులకు సరైన బోధన లభించడం లేదని తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. చాలా పాఠశాలల్లో టీచర్లు లేక కొన్ని పిరియడ్స్ ఖాళీగా కూర్చోవలసి వస్తున్నదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
హిందీ పండిత్ టీచర్లకు మరింత కొరత ఏర్పడింది. హిందీ భాషలో డిప్లొమా చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ తగ్గుతూ ఉంది. ఒకప్పుడు పదవ తరగతి తర్వాత భూషణ్, విద్వాన్ పరీక్షలు రాసి హిందీ టీచర్లుగా నియామకాలు చేపట్టేవారు. ప్రస్తుతం ఇంటర్ తర్వాత హిందీ భాషలో డిప్లొమా చేయాల్సి ఉంది. కాని నేటి తరం ఎవరూ హిందీ డిప్లొమా కోర్సులు చదివేందుకు ముందుకు రాకపోవడం వల్ల హిందీ పండితుల కొరత తీవ్రంగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి హిందీ పండితులను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
గత నాలుగైదేళ్ళుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండటం వల్ల ఉపాధ్యాయుల కోసం పాఠశాలల మధ్య తీవ్ర పోటీ నెలకొంటున్నది. కావాల్సిన ఉపాధ్యాయులను సరఫరా చేస్తామంటూ బోగస్ సంస్థలు వెలిశాయి. ప్రైవేట్ యాజమాన్యాలు వాటికి డబ్బులు చెల్లించి మోసపోయిన సంఘటనలు కూడా జరిగాయి. ప్రైవేటు విద్యాసంస్థల మధ్య టీచర్ల కోసం పోటీ పెరిగిన నేపథ్యంలో కొందరు ఉపాధ్యాయులు ఏ సంస్థ ఎక్కువ వేతనం ఇస్తే ఆ సంస్థలో చేరిపోవడం పరిపాటిగా మారింది. ఒక సంస్థలో చేరిన టీచర్ ఆ విద్యా సంవత్సరమంతా పనిచేయాలని నిబంధన ఉన్నప్పటికి నైతిక విలువలను మరిచి కొద్దిపాటి వేతనం కోసం మూడు నెలలకోమారు ఆరు నెలలకోమారు టీచర్లు స్కూల్స్ మారిపోతూ విద్యార్థులకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తున్నారు.
పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరికొన్నాళ్ళకు గురువులు కరువయ్యే ప్రమాదం ఉంది. విద్య నేర్చుకున్న వారే మరొకరికి విద్య నేర్పడానికి ముందుకు రాకపోవడం వ్యవస్థ పతనానికి దారితీస్తుంది. ప్రభుత్వం జరుగుతున్న పరిణామాలను పూర్తిగా విశ్లేషించి యువతరాన్ని ఉపాధ్యాయ ఉద్యోగాల వైపు ప్రోత్సహించి రాబోయే తరానికి మంచి గురువులను అందించేలా చర్యలు చేపట్టాలి అన్నది మా వాదన.