రిజర్వేషన్లు రాజ్యంగం కల్పించిన హక్కు:రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్

Submitted by Sathish Kammampati on Thu, 08/09/2022 - 15:39
Reservation is a constitutional right: Retired IAS Cholleti Prabhakar
  • ఎస్ఐ,కానిస్టేబుల్ పరీక్ష నోటిఫికేషన్లలో ప్రభుత్వం రిజర్వేషన్ అమలు చేయకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన
  • కటాఫ్ మార్కుల  విషయంలో ఒకే విధానం సరికాదు
  • ఎస్సీ,ఎస్టీ,బీసీలకు తీవ్రమైన అన్యాయం
  • పారదర్శకత లేని ప్రశ్నాపత్రం వెంటనే సవరించాలి
  • కెవిపిఎస్,టివివి, ఎం.ఆర్.పి.ఎస్. మరియు ప్రజాసంఘాల డిమాండ్

నల్లగొండ సెప్టెంబర్ 08,(ప్రజాజ్యోతి) ప్రతినిధి:రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కు అని,2022 ఏప్రిల్ 25 న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష నోటిఫికేషన్ విధానం భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ ప్రభుత్వంపై మండిపడ్డారు.ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్థుల కనీస అర్హత మార్కుల విషయంలో ప్రభుత్వం అనుసరించిన విధానం తీవ్రమైన అన్యాయం చేసే విధంగా ఉందన్నారు.

ఎస్సై,కానిస్టేబుల్ పరీక్షల నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం "రిజర్వేషన్లను ఉల్లంఘించిన తీరుకు" నిరసనగా గురువారం నల్లగొండ పట్టణంలోని పెద్ద గడియారం చౌరస్తాలో కెవిపిఎస్,తెలంగాణ విద్యావంతుల వేదిక, ఎం.ఆర్.పి.ఎస్., ఎం.ఎస్.పి,బీసీ సంక్షేమ సంఘం మరియు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూపరీక్షల నోటిఫికేషన్ విడుదల చేసే విధానంలో తెలంగాణ ప్రభుత్వానికి గానీ,తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కు గానీ,కనీస స్పష్టత లేదని, తక్షణమే దానిని సవరించాలని డిమాండ్ చేశారు.

అనంతరం కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడగు నాగార్జునమాట్లాడుతూప్రభుత్వం ప్రకటించిన విధానం వలన ఎస్సీ, ఎస్టీ,బీసీ అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయంజరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లోను, 2018 లోను పోలీస్ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేసి,ఓసి అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు 40 శాతం, బీసీ అభ్యర్థులకు 35%,ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించిందని గుర్తు చేశారు.ఇదే విధమైన విధానాన్ని 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించిందన్నారు.

కానీ,ఇటీవల కాలంలో ఏప్రిల్ 25, 2022 న ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఐ,కానిస్టేబుల్ పరీక్షల నోటిఫికేషన్ లో ఓసీ,బీసీ,ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కనీస మార్కులు 30% అనగా అందరికీ సమానంగా నిర్ణయించడం అంటే దళిత బహుజనులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ఉల్లంఘించడమేనని అన్నారు.తక్షణమే 2015, 2018 నోటిఫికేషన్ కు అనుగుణంగా 2022 నోటిఫికేషన్ ను సవరించాలని డిమాండ్ చేశారు. లేదా ఓసి అభ్యర్థులకు 40 శాతం నుండి 30% కు తగ్గించినట్లుగా, బీసీలకు 35 శాతం నుండి 25% కు,ఎస్సీ ఎస్టీలకు 30% నుండి 20 శాతానికి తగ్గించి కనీస అర్హత మార్కులు నిర్ణయించాలని సూచించారు.కనీస అర్హత మార్కుల విధానం యు.పి.ఎస్.సి (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) లాంటి జాతీయ స్థాయి రిక్రూట్మెంట్ పరీక్షల్లో కూడా అమలు చేస్తున్నారని తెలిపారు.రాష్ట్ర స్థాయిలో టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ లాంటి, టెట్ లాంటి పరీక్షల్లో కూడా ఎస్సీ,ఎస్టీ, బీసీలకు కట్ ఆఫ్ మార్కుల విధానంలో రిజర్వేషన్ విధానం వర్తింపజేస్తున్నారని, ఇట్టి విషయాన్ని ప్రభుత్వం గుర్తురెగాలని సూచించారు.

టివివి జిల్లా అధ్యక్షులు పందుల సైదులు మాట్లాడుతూ
2022 ఏప్రిల్ లో నిర్వహించిన పోలీస్, ఎస్సై పరీక్షల్లో 8 ప్రశ్నలు డీలీట్ చేసి,6 ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఇచ్చి,8 ప్రశ్నలు తప్పుగా ఇచ్చి మొత్తంగా 22 ప్రశ్నలలో తప్పులు దొర్లినవంటే ప్రశ్నాపత్రంలో పరీక్షల విధానంలో ఏ మాత్రం విశ్వసనీయత లేదని, పారదర్శకత లేదని స్పష్టమైనదన్నారు. ఇందులో నెగిటివ్ మార్కుల విధానం తీసుకరావడంతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.ప్రశ్నాపత్రంలో తప్పులకు ప్రభుత్వం బాధ్యత వహించకుండా అభ్యర్థులను బలి చేయడం సరికాదన్నారు. తప్పుగా ఇచ్చిన ప్రశ్నలన్నింటికీ మార్కులను కలపాలని డిమాండ్ చేశారు.లేనట్లయితే సీరియస్ గా కష్టపడి చదివినటువంటి అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో  ఎంఎస్పి నల్లగొండ నియోజకవర్గ ఇంచార్జ్ బకరం శ్రీనివాస్ మాదిగ, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి భిక్షం, పి.వై.ఎల్ రాష్ట్ర కార్యదర్శి ఇందూరి సాగర్,బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, బహుజన సమాజ్ పార్టీ జిల్లా నాయకులు ఒంటేపాక యాదగిరి, జాతీయ మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు అద్దంకి రవీందర్,సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు బొల్గూరి కిరణ్,గంజి మురళీధర్,తల్లమల్ల యాదగిరి,గాదె నరసింహ్మ,బొల్లు రవీందర్,కత్తుల సన్నీ,కురుపాటి కమలమ్మ,కొండా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.