పిల్లలను కాటేస్తున్న పర్సనల్ కంటెంట్..!!

Submitted by Praneeth Kumar on Wed, 06/03/2024 - 09:37
Personal Content Harming Children..!!

పిల్లలను కాటేస్తున్న పర్సనల్ కంటెంట్..!!

ఖమ్మం, మార్చి 06, ప్రజాజ్యోతి.

చదువుల మీద కోవిడ్-19 ప్రభావం నేటికి బలంగా కొనసాగుతుండటం గమనార్హం. ఆన్‌లైన్ తరగతుల మూలంగా వర్చువల్ అభ్యాస నైపుణ్యాలతో పాటు, పలు రకాల సామాజిక భావోద్వేగాలతో విద్యార్థులు పాఠశాలల్లోకి పునఃప్రవేశించారు. దీర్ఘకాలం సోషల్ డిస్టెన్స్ పాటించడం వల్ల పిల్లలకు ఒంటరితనం అలవాటైంది. దీంతో సహ విద్యార్థులతో కలిసిమెలిసి ఉండటం, ఉపాధ్యాయుల సూచనలను అనుసరించడం వంటి సాఫ్ట్ స్కిల్స్‌లో పిల్లలు దారుణంగా వెనుకబడిపోయారు. ఇంకో మాటలో చెప్పాలంటే, చాలా మంది ఉపాధ్యాయులు తమ పాఠశాలలో తమకు పరిచయం ఉన్న తరగతిగదిలోనే పని చేయడానికి అనుభవం లేని కొత్త టీచర్ల వలే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మునపటిలా బోధించడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. రెండేండ్ల తరువాత తరగతి గదికి తిరిగి వచ్చిన విద్యార్థులను అభ్యాసాలకు సిద్ధం చేయడానికి చేస్తున్న ప్రతి ప్రయత్నంలోనూ పిల్లల నుంచి చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారు. ఇక పిల్లల విషయానికొస్తే వయో వర్గాలవారీగా వైయక్తిక భావోద్వేగాలను ప్రదర్శిస్తున్నారు. పాఠాల కంటే తమ భావోద్వేగాలకు మద్దతు పలకడాన్నే ఉపాధ్యాయుల నుండి కోరుకుంటున్నారు. కోవిడ్ అనంతరం విద్యార్థుల అవసరాలు పాఠ్యేతరమైపోయినాయనడం ఎంత మాత్రం అతిశయోక్తికాదు. కోవిడ్ కాలపు అలవాట్లను మాన్పించడం, పరిష్కరించడం కరికులంలో భాగమైపోయింది. ఇందుకు తగ్గట్టుగా చాలా పాఠశాలల్లో సిబ్బంది లేరు. ఉన్నచోట ఆ టీచర్లకు కోవిడ్ అనంతర బోధనా సమస్యల పై అవగాహన బోధనాపటిమ లేశమనే చెప్పాలి. భావోద్వేగాల శిక్షణలో పెరిగిన డిమాండుకు అనుగుణంగా పాఠశాల్లో టీచర్ల నిష్పత్తి లేదు. పైపెచ్చు పిల్లల అసాధారణ మనస్తత్వం వాళ్ల స్వీయ శ్రేయస్సు పై తీవ్ర ప్రభావాన్ని చూపడంతోపాటు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయుల పని తీరు, సర్వీసు కొనసాగింపు మీద ప్రతికూలతను కనబరుస్తున్నది. వాస్తవం చెప్పాలంటే టీచింగ్ ఎప్పుడూ అంత సులభమైన వృత్తి కాదు. అవకాశం కొద్దీ టీచర్లైన వాళ్లు ప్రతి ఐదేండ్లకు 44% మంది ఉపాధ్యాయులు బోధనా వృత్తి నుండి విరమించుకుంటున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఐచ్ఛికంగా బోధనా వృత్తిని ఎంచుకున్న ఆశయబద్ధులైన అధ్యాపకులే కరోనా వైరస్ సృష్టించిన అభ్యాస అంతరాలను పరిష్కరించడానికి తలమునకలైనారు. పిల్లల్లోని లెర్నింగ్ గ్యాప్ వల్ల ఉపాధ్యాయుల పై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. ఉపాధ్యాయ వృత్తిని మానేసినవాళ్లు మానేయగా అంకితభావం కలిగి పిల్లల కోసం పని చేయదలచుకున్న దృఢచిత్తులు మాత్రమే వృత్తిలో కొనసాగుతుంటారు, ఇప్పుడూ అంతే. విద్యార్థులు ఏ విషయంలోనూ నష్టపోకుండా అభ్యసనంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజయాలను అందించడంలో ఏ సహాయానికైనా సిద్ధంగా ఉన్నారు. పాఠ్యప్రణాళికలను మెరుగుపరచడం, వారాంతాల్లో తల్లిదండ్రులను నేరుగా కలవడం, లేదంటే ఫోన్ సంభాషణ ద్వారానో, ఇ మెయిల్స్ ద్వారానో పిల్లల శ్రద్ధాసక్తుల గురించి చర్చించడం వంటి కార్యక్రమాలతో విద్యార్థుల అభ్యసనానికి సంపూర్ణ మద్దతునిస్తున్నారు. పండుగ సెలవుల్లో, వేసవి సెలవుల్లో సైతం కార్యశాలలకు, వృత్త్యంతర శిక్షణా కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఉత్తేజకరమైన బోధన కోసం, ఆహ్లాదపరిచే అందమైన తరగతి గదిని రూపొందించేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అయితే, నిబద్ధత గల ఉపాధ్యాయుల పై అంతులేని డిమాండ్లు పెరుగుతున్న దరిమిలా వీళ్లూ ఒత్తిడిలో అలసిపోతున్న పరిస్థితి. ఈ అలసటే ఉపాధ్యాయుల సానుకూల మానసిక స్థితిని దెబ్బ తీస్తుంది. ఒత్తిడికి లోనైన ఉపాధ్యాయుల దాపున పిల్లల అభ్యాసకృత్యాల్లో చురకుదనం తగ్గిపోతుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఒత్తిడి కూడా అంటువ్యాధిగా మారుతుంది. పెను ఒత్తిడిలో ఉన్న ఉపాధ్యాయులు వారి ఒత్తిడిని చుట్టుపక్కల వారికి వ్యాప్తి చేస్తున్నారు. భావోద్వేగాలు కూడా అంటువ్యాధిలా ప్రబలడం సమాజానికి ఒకింత ప్రమాదమే. అంటే ఉద్విగ్నత కలిగిన ఉపాధ్యాయులు తమ సహోద్యోగుల పై, విద్యార్థులపైనే కాకండా పరిసరాల మీదకూడా ప్రతికూల ప్రభావాన్ని చూపగలరు. ఇక్కడే పిల్లలతో పాటు మిగతా ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులను కూడా మానసిక శారీరక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టగలవు. ఒత్తిడి మూలంగా ఉపాధ్యాయుల బోధనా నాణ్యత, తరగతి గది నిర్వహణా సామర్థ్యం, ఉపాధ్యాయలు విద్యార్థుల సంబంధ బాంధవ్యాలు పూర్తిగా దెబ్బతింటాయి. బర్న్‌అవుట్ సంభవిస్తుంది. ఉపాధ్యాయుల బర్న్‌అవుట్ మితిమీరిపోయిన చోట్ల విద్యార్థుల్లో స్ట్రెస్ హార్మోన్, కార్టిసాల్ అధికంగా నమోదవుతుంది. దీనికంతటికి కారణం విద్యార్థులు పాఠాల్ని విస్మరించి పర్సనల్ కంటెంట్ మాయలోపడిపోవడమే. తమకుతామే ఓ ప్రత్యేక శాల్తీలుగా భావిస్తూ గురువులనూ, పాఠాలనూ పెడచెవినపెట్టడమే. ఇది సోషల్ పోస్టుల యుగం. పెద్దలపైన్నే కాకుండా విద్యార్థుల మీద కూడా సోషల్ మీడియా సానుకూల, ప్రతికూల ప్రభావాలను కనబరుస్తుంది. కమ్యూనికేషన్‌ను మెరుగుపడటం, సమాచార భాగస్వామ్యం, విద్యాఅవకాశాలు, నెట్‌వర్కింగ్ అవకాశాలు ఉన్నప్పటికిని, అపరిపక్వత, యుక్త వయస్సు, అనుభవ రాహిత్యంచేత విద్యార్థులు వ్యసనాలకు, సైబర్ బెదిరింపులకు, పరధ్యానంలోకి, తప్పుడు సమాచారం సృష్టించే కెరీర్ అగాథాల్లో కొట్టుమిట్టాడటం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు చెందిన ఇరవై ఒక్క ఏండ్ల యువ విద్యాంశ రచయిత, ప్రముఖ పర్యావరణ కార్యకర్త వివేక్ భర్వాణీ ‘ప్రతికూల ప్రభావాలను నివారించడానికి, సానుకూలతను సద్వినియోగం చేసుకోవడానికి విద్యార్థులు సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా, సమతుల్య పద్ధతిలో ఉపయోగించడం చాలా ముఖ్యం. సోషల్ మీడియా సక్రమంగా వినియోగించడం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడంలో తల్లిదండ్రులు, అధ్యాపకులు, యాజమాన్యాలు క్రియాశీలక పాత్ర పోషించాలని, ప్రధానంగా తల్లిదండ్రులు తమ పిల్లలు సోషల్ మీడియాలో లైక్‌లు, షేర్‌లతో సమయాన్ని వృథా చేయకుండా ఇ లెర్నింగ్, అధునాతన టెక్నాలజీ స్కిల్స్‌ పై సమయాన్ని వెచ్చించేట్టుగా సలహాలు, కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఇప్పించాలి’ అంటూ పర్సనల్ కంటెంట్ మోజుకు విరుగుడు సూచిస్తున్నాడు. సరే, ఎవరెన్ని చెప్పినా సెల్ఫ్ కేర్ ఆక్టివిటీస్ ను నిర్ధారించుకొని ఒక్కటొక్కటిగా క్రమం తప్పక ఆచరిస్తేనే విద్యార్థులు యువత సోషల్ మీడియాకు బానిసలు కాకుండా ఉండగలరు అన్నది మా అభుప్రాయం.