నియంతలను ఓడిద్దాం..!!

Submitted by Praneeth Kumar on Wed, 29/11/2023 - 21:59
Defeat the dictators..!!

నియంతలను ఓడిద్దాం..!!

◆ దుర్మార్గులను, అహంకారమును, నాయకులను ఓడిద్దాం కానీ నోటాను కాదు..!!

◆ ఐతే గెలిపించడానికి లేదా ఓడించడానికి..!!

ఖమ్మం, నవంబర్ 30, ప్రజాజ్యోతి.

థింక్ వన్స్, ఒకసారి భిన్నంగా ఆలోచించి చూద్దాం. ఎన్నికలు రాగానే నోటాకు వేద్దాం, చైతన్యం చూపిద్దాం అనే నీతిబోధలు మీడియాలో స్టార్ట్ అవుతాయి. అక్కడికే ఓటరు ఎందుకు ఆగిపోవాలి..?? బట్ బియాండ్ దట్, అంతకు మించి ఎందుకు ఆలోచించొద్దు..?? నోటా దగ్గరే మనం ఆగిపోతే అది ఓ తప్పుడు అవగాహన కాదా..?? ఈ కోణంలో ఎందుకు ఆలోచించకూడదు..?? నిజంగా నోటాకు ఓటు వేయడం అనేది ఓ చైతన్య సూచికా..?? ఎవరో ఏదో దేశంలో ప్రవేశపెట్టిన ఈ 'నోటాకు ఓటు' అనేది ఓటరు చైతన్యానికి ప్రతీకేనా..??

◆ ఇది నోటా వ్యతిరేక కథనమేమీ కాదు. దానికే ఓటు వేయాలని అనుకుంటే వేద్దాం. అందులో మీ తప్పేమీ లేదు. కానీ ఓటు వేయడం అంటేనే ఎవరినైనా గెలిపించాలి లేదా ఎవరినైనా ఓడించాలి. మన ఓటు వీటిలో దేనికీ పనికి రానప్పుడు, పనికిరాని ఓటు వేయడానికి అంటే 'నోటా' అనే ఓ నిష్ఫల ఓటింగు కోసం, రిస్కు తీసుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లడం దేనికి..?? ఆవేశంగా చెప్పటం లేదు. ఓ పాత్రికేయుడిగా తీవ్రంగా ఆలోచించి చెపుతున్నా ఒకసారి వినండి.

◆ ఓసారి విశ్లేషించుకుందాం. ఓటు వేయడం మన కర్తవ్యమే, కానీ ఎందుకు వేయాలి. ఇప్పుడు పాలించేవాడు సరిగ్గా లేడు అనుకున్నప్పుడు, ప్రత్యామ్నాయం కోసం ఓటు వేయాలి. లేదూ, బాగా పనిచేస్తున్నాడు అనుకుంటే తనను మళ్లీ ఎన్నుకుని, భుజం తట్టడానికి వోటు వేయాలి. ఎహె, అభ్యర్థుల్లో ఎవరూ సరిగ్గా లేరు అనుకుంటే, అందరూ అలాంటోళ్లే అనుకుంటే వాళ్లలో బెటర్ పర్సన్‌ను ఎంచుకుని ఓటు వేయాలి. నోటాకు వేస్తే ఏమొస్తుంది.

◆ చెల్లని ఓట్లు వేయడం ఎలాగో నోటాకు ఓటు వేయడం కూడా అలాగే. చెల్లని ఓటు వేయడానికి ఓటరు ఎందుకు ప్రయాసపడాలి. పోలింగ్ శాతం పెరిగినట్టు చూపడానికా, అంత అవసరం ఏమీ లేదుగ. మన వ్యవస్థలో పోలింగ్ శాతం ఎంతయినా పర్లేదు.(అడీగెటోడు ఎవడు) ఇద్దరు అభ్యర్థులుండి, పది ఓట్లు పడితే ఆరు వచ్చినోడిదే గెలుపు. అంతే పైగా సగం వోట్లు రావాలని కూడా ఏమీలేదు. ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా సరే, గెలుపు గెలుపే. ఆ వెధవ గెలుపు ఐదేళ్లు భరించాల్సిందే.

◆ మరి ఏ ఎమ్మెల్యే ఉంటే ఏమిటి అంటారా కాదు, పూర్తిగా ఈ ఆలోచన సరికాదు. ఒక శాసనసభ ఎన్నికలో అధికార పార్టీకి తక్కువ సీట్లు వస్తే అది ప్రజల్లో వ్యక్తమయ్యే వ్యతిరేకతకు సూచిక అవుతుంది. అధికార పార్టీని నేలమీదకు తీసుకురాగలదు మీ ఓటు. కాదు, కాదు, ప్రభుత్వం బాగా పనిచేస్తుందీ అనుకుంటే, అనుకున్న సీట్లు గనుక గెలిస్తే, అది ప్రజల్లో సంతృప్తికి సూచిక అవుతుంది. మంచి పనితీరుకు గుర్తింపు అవుతుంది. అందుకని ఓటు అవసరమైతే భుజం తట్టేలా ఉండాలి లేదా భుజం మెలితిప్పి, వీపు మీద ఒక్కటి బలంగా చరిచేలా ఉండాలి. పోనీ, ధైర్యంగా ఈ వ్యయప్రయాసల ఎన్నికల్లో నిలబడిన ఓ స్వతంత్రుడికి ఓటేసి వెన్ను తట్టండి. రాజకీయాల్లో కొనసాగేందుకు ఉత్సాహం ఇస్తుంది. ఓ చిన్న పార్టీకి వేయండి, ఇంకా బలపడే ప్రయత్నం చేస్తుంది. నోటా వీటిలో ఏదీ చేయలేదు కదా. ఇప్పుడు చెప్పండి నోటాకు ఓటేద్దామా..?? ఉన్నవారిలోనే ఒకరిని ఎంచుకుందామా..?? వాట్ డు యు సే..?? 'గద్దె ఎక్కగానే నియంతల్లా వ్యవహరించే నీచులను ఓడించండి. ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం, మన తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఘనంగా గెలిపించుకుందాం.