వీఆర్ఏ వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

Submitted by Sathish Kammampati on Sat, 10/09/2022 - 16:39
Government should be responsible for VRA Venkateswarlu's suicide
  •  సమ్మెను వెంటనే పరిష్కరించాలి

 నల్లగొండ సెప్టెంబర్ 10, (ప్రజాజ్యోతి) గత 48 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న వీఆర్ఏల పట్ల రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరికి మనోవేదన గురై ఆత్మహత్య చేసుకున్న మిర్యాలగూడ మండలం  ఉట్లపల్లి గ్రామ వీఆర్ఏ కంచర్ల వెంకటేశ్వర్లు మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ఒక  ప్రకటన లో  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వీఆర్ఏలు గత 48 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది వీఆర్ఏలు ప్రాణాలు కోల్పోయారని ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగా భావించాల్సి వస్తుందని అన్నారు.

సమ్మెలో వివిధ కారణాల చేత మరణించిన వీఆర్ఏ కుటుంబాలను ఆదుకోవడానికి మరణించిన ప్రతి వీఆర్ఏకు 20 లక్షల ఎక్స్గ్రేషియా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం, డబల్ బెడ్ రూమ్ ఇల్లు మూడు ఎకరాల భూమి, వారి పిల్లలకు రెసిడెన్షియల్ విద్యా అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.వీఆర్ఏ లు కెసిఆర్ ఇచ్చిన పే స్కేల్ వారసులకు ఉద్యోగాలు ప్రమోషన్ల హామీలు అమలు చేయాలని ఇన్ని రోజులుగా సమ్మె చేయడం చూస్తుంటే ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు.

ఇంకా ఎంతమంది వీఆర్ఏలు ప్రాణాలు తీసుకుంటే సమస్యలు పరిష్కరిస్తారో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీఆర్ఏ జేఏసీ తో చర్చలు జరిపి సమ్మెను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా సిఐటియు అనుబంధ రంగాలన్నీ ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.