ఐలమ్మ స్ఫూర్తి భూ పోరాటాలకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొమ్ము భరత్

Submitted by sridhar on Sat, 10/09/2022 - 15:16
Ailamma's inspiration is a testament to land struggles CPI district secretary group members Kommu Bharat

నాగర్ కర్నూల్ (ప్రజా జ్యోతి న్యూస్ )తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు భూమికోసం భుక్తి కోసం వ్యక్తి చాకిరి విముక్తి కోసం తెగించి పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో భూ పోరాటాలు నిర్వహించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్ పిలుపునిచ్చారు.

శనివారం నాడు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సిపిఐ కార్యాలయంలో చాకలి ఐలమ్మ 37వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి కొమ్ము భరత్ పూలమాలలు వేయగా అందరూ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొమ్ము భరత్ మాట్లాడుతూ 1986లొ వరంగల్ జిల్లా కిష్టాపురం గ్రామంలో జన్మించిన ఐలమ్మ 14వ ఏటనే జనగామ జిల్లా చిట్యాలకు చెందిన నరసయ్యతో వివాహం జరిగింది. ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఆర్థికంగా బాగా వెనుకబడిన కుటుంబం కులవృత్తి చేసుకుంటూ వ్యవసాయ కూలీ నాలి పనులు చేస్తూ కుటుంబం గడిచేది. ఎలాంటి భూమి ఇతర ఆదాయ వనరులు లేవన్నారు. విసునూరు రామచంద్రారెడ్డి దొర భూమి నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని సేద్యం చేసుకున్నది. అప్పటికే ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీ నాయకుల తో పరిచయాలు సంబంధాలు ఏర్పరచుకున్నది.

దీన్ని జీర్ణించుకోలేని పట్వారి శేషగిరిరావు అక్రమంగా ఆమె కౌలుకు చేస్తున్న భూమిని పట్టా చేసుకొని మానసికంగా వేధించసాగాడు. తన పొలంలో కుటుంబ సభ్యులంతా వచ్చి పని చేయాలని వెట్టి చేయాలని ఒత్తిడి చేశాడు. దొరలనే గడగల్లాడించిన దీరవనిత చాకలి ఐలమ్మ దానికి ఒప్పుకోలేదు దీంతో చాకలి ఐలమ్మ పండించిన ధాన్యాన్ని కోత కోసి నూర్పిడి చేసి బస్తాలు నింపి భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్ర రెడ్డి లాంటి కమ్యూనిస్టు యోధులు భుజాలపై  బస్తాలు మోసి ఆమె ఇంటికి ధాన్యాన్ని చేర్చారు అన్నారు. పట్వారి దీనిపై విసునూరు రామచంద్ర రెడ్డి దొరకు ఫిర్యాదు చేసి ఆమె ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించి, ఇంటిని తగలబెట్టి, ఐలమ్మ కూతురు సోమనరసమ్మ పై అత్యాచారం చేశారు. దీంతో ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు బందగి అడుగుజాడల్లో నడుస్తూ నడిడులోనే దొరల గడీలను గడగడలాడించింది. రోకలి బండ చేతుల బట్టి దొరల గుండాలను తరిమి కొట్టిన దీరవనిత అన్నారు.

ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీ నాయకుల  సహకారంతో దొర గడీల పై దాడి చేసి దానిని బస్తాలను ప్రజలకు పంచిన చరిత్ర ఆమెది. అలాగే 90 ఎకరాల దొర భూమిని పేద ప్రజలకు పంచిన వీరవనిత అన్నారు. చివరిదాకా సాయుధ పోరాటంలో కొనసాగి 4వేల మంది అమరులను ప్రాణ త్యాగం చేసి పది లక్షల ఎకరాల భూమి పంచిన పోరాట చరిత్ర సువర్ణ అక్షరాలతో లిఖించదగిందన్నారు. ఐలమ్మ తెగింపు సాయుధ పోరుకు బలం తెచ్చింది. ఐలమ్మ కొంగు నడుముకు చుడితే దొరలు తోకముడిచారు. అక్షరం ముక్క రాకపోయినా దొరతనానికి వ్యతిరేకంగా దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన తీరు అందరికీ ఆదర్శప్రాయం అన్నారు.

19 85లో సెప్టెంబర్ 10న చనిపోయే నాటికి కూడా ఆమెకు స్వతంత్ర సమరయోధుల పింఛన్ లేదు, కవులు చేసిన నాలుగు ఎకరాల భూమి లేదు, ఆర్థికంగా ప్రభుత్వం ఎలాంటి చేయూతనివ్వలేదు కానీ ఆమె వర్ధంతి జయంతిలో నాడు తెలంగాణ ప్రభుత్వం దండలేసి దండం పెట్టి చేతులు దులుపుకుంటున్నది అని విమర్శించారు. ఇప్పటికైనా ఆమె చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మర్యాద వెంకటయ్య, పట్టణ సహాయ కార్యదర్శి కొట్రశేఖర్, సిపిఐ నాయకులు పూసలి సుధాకర్, పెద్దయ్య, బాలస్వామి, మునీర్, జహీర్, భాస్కర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.