ఈ ఎన్నికల్లో గెలుపు ఓటర్లదేనా..!!

Submitted by Praneeth Kumar on Sat, 04/05/2024 - 10:19
The victory of this election belongs to the voters..!!

ఈ సారి గెలుపు ఓటర్లదేనా..!!

ఖమ్మం, మే 4, ప్రజాజ్యోతి.

పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికల మొదటి రెండు విడతల పోలింగ్ ముగిసింది. ఇంకా ఐదు విడతల పోలింగ్ జరగాల్సివుంది. ఇంతలో, ప్రచండ వేసవి గాడ్పులు, ఎన్నికల ప్రచార వేడి మిళితమై ఒక తీవ్ర ఉక్కపోతతో సతమతమవుతున్న దేశ ప్రజల ముందుకు అనుకోకుండా ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. టీవీ స్టూడియోలలోను, విశాల సమాజంలోను రాజకీయ పార్టీల నాయకుల వాద ప్రతివాదాల హోరు ఎడతెగకుండా మిన్నంటుతున్నా కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ ప్రజాస్వామిక ‘పండుగ’లో పాల్గొంటున్న వారి సంఖ్య అంచనాల కంటే ఎందుకు తక్కువగా ఉంది..??
మండుతున్న ఎండా కాలం, పంట కోతల సమయం, సుదీర్ఘ వారాంతపు సెలవులు అనేవి పోలింగ్ శాతం తక్కువగా ఉండడాన్ని పాక్షికంగా మాత్రమే వివరిస్తాయి. నిజమేమిటంటే దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రజాస్వామిక లోటు (ప్రజాస్వామిక సంస్థలు, వ్యవస్థలు తమ కార్యాచరణల్లో ప్రజాస్వామ్య సూత్రాలకు చిత్తశుద్ధితో కట్టుబడి ఉండకపోవడం, పర్యవసానంగా ప్రజాస్వామ్య ప్రక్రియల పట్ల ప్రజల్లో అనాసక్తి, నిర్లిప్తత పెరిగిపోవడం వల్ల నెలకొనే పరిస్థితి) గణనీయంగా ఉంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే మన ప్రజాస్వామ్యం అసమగ్రంగా ఉంది. సామాన్యుల ఆరాటాలను పార్టీలు, నేతలు పట్టించుకోవడం లేదు. కనుకనే సగటు ఓటరు తన ప్రతినిధిగా ఏ పార్టీ అభ్యర్థిని ఎన్నుకోవాలనే విషయమై అంతకంతకూ ఉత్సుకతను కోల్పోతున్నాడు. పార్లమెంటు సభ్యుడుగా తన విధ్యుక్త ధర్మాలను చిత్తశుద్ధితో నిర్వర్తించగలడనే భరోసాను వివిధ పార్టీల అభ్యర్థులలో ఏ ఒక్కరూ ఇవ్వలేకపోవడమే అందుకు కారణంగా చెప్పవలసి ఉంది.
ఎన్నికల ముందు రోజుల్లో విజయోత్సాహంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ‘అబ్కీ బార్ చార్ సౌ పార్’ అనే నినాదాన్ని ఇచ్చింది, 400 సీట్లతో తమ పార్టీ విజయం సాధించగలదని ఆ పార్టీ శ్రేణులు ఆత్మవిశ్వాసంతో చెప్పాయి. లోక్‌సభ ఎన్నికలలో బిజేపి విజయం ఇప్పటికే ఖాయమైపోయిందని, అయితే 1984 సార్వత్రక ఎన్నికలలో 414 నియోజకవర్గాలను గెలుచుకున్న రాజీవ్ గాంధీ రికార్డును ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధిగమించగలరా అన్న విషయం మాత్రమే మిగిలివుందని బిజేపి వర్గాలు అంటున్నాయి.
ఎన్నికల ప్రచారం ఊపందుకుని, రెండ విడతల పోలింగ్ సైతం ముగిసిన ప్రస్తుత తరుణంలో అధికార, ప్రతిపక్షాలు రెండింటికి ఓటర్ల విషయమై ప్రాథమిక వాస్తవాలు తెలిసివచ్చాయి. ఏ రాష్ట్రంలోనూ అటు అధికార పక్షం/ కూటమికి గానీ, ఇటు ప్రతిపక్షం / కూటమికి గానీ అనుకూల పవనాలు వీయడం లేదన్నది స్పష్టంగా కన్పిస్తున్నది. ఓటర్లు ఏ పక్షం వైపు మొగ్గు చూపడం లేదనేది విశదమైంది. (మొదటి విడతలో పోలింగ్ శాతం అంచనాల కంటే 3 శాతం తక్కువగా నమోదయింది). వెన్వెంటనే ప్రధాని మోదీ, ఓటర్లలో మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం ప్రారంభించారు. 2047 సంవత్సరం నాటికి ‘వికసిత్ భారత్’ను నిర్మిస్తామన్న హామీతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బిజేపి మొదటి దశ ఎన్నికలు ముగియగానే మాట మార్చింది. ఆశాభావ రాజకీయాల నుంచి భయాన్ని సృష్టించే రాజకీయాలకు మారింది. ఆశాభావం, భయం అసాధారణమైన సహచరులు. భయపూరిత రాజకీయాలు హానికరమైనవి, విధ్వంసకరమైనవి కాగా ఆశాభావ రాజకీయాలు సానుకూలమైనవి, నిర్మాణాత్మకమైనవి, సృజనాత్మకమైనవి. 2024 సార్వత్రక ఎన్నికలు ఒక ఆశాభావంతో ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఆశాభావం శీఘ్రగతిన అర్ధ సత్యాలు, అబద్ధాలను నిర్భయంగా వ్యాపింపజేసే ఒక భయపూరిత వాతావరణంలోకి జారిపోయింది.
రాజస్థాన్‌లో ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ తన శ్రోతల్లో తీవ్ర సంకుచితత్వ భావాలను రెచ్చ గొట్టేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ మానిఫెస్టో ముస్లింలీగ్ మానిఫెస్టోలా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ వారు అధికారంలోకి వస్తే మీ ఆస్తులను స్వాధీనం చేసుకుని చొరబాటుదారులకు పునః పంపిణీ చేస్తారని మోదీ హెచ్చరించారు. అంతే కాకుండా స్త్రీల మెడల్లో ఉన్న మంగళసూత్రాలను సైతం తెంచుకు పోతారని కూడా ఆయన ఆరోపించారు. ఏ రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి ప్రధానమంత్రి ఇటువంటి ఆరోపణలు చేశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పార్టీకి ప్రధాన మద్దతుదారులుగా ఉన్న హిందూత్వవాదులను రెచ్చగొట్టి, సుపరిచిత ‘శత్రువు’కు వ్యతిరేక పోరాటంలో వారు పాల్గొనేలా చేయడమే ఆయన లక్ష్యం. ఎన్నికలలో బిజేపి ఒక విజేతగా నిలవటంలో భారతీయ ముస్లింలు కీలక పాత్ర వహిస్తున్నారు. 1990ల్లో వారిని ‘బాబర్‌కి ఔలద్’ అని పరిహసించారు. ఇప్పుడు వారిని ‘ఘస్పేటియాస్’ (చొరబాటుదారులు) అని నిందిస్తున్నారు.
బిజేపి మళ్లీ మతతత్వ వక్రీకరణలకు పాల్పడుతుంది.
కాంగ్రెస్ సైతం ఊహాత్మక భయాల ఆధారంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభలలో భారత రాజ్యాంగం ప్రతిని ఎత్తిచూపుతూ, బిజేపి అధికారంలోకి వస్తే దళితులు, ఆదివాసీలు, ఓబీసీలకు రిజర్వేషన్లను శాశ్వతంగా రద్దు చేసేందుకు రాజ్యాంగానికి సవరణలు చేస్తుందని హెచ్చరిస్తున్నారు. విద్వేషపూరిత ప్రసంగాలతో మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు బిజేపి ప్రయత్నిస్తుండగా మండల్ ‘సామాజిక న్యాయ’వాదుల మద్దతును కూడగట్టుకునేందుకు కాంగ్రెస్ ఆరాటపడుతోంది.
అయితే సగటు ఓటర్లకు బిజేపి, కాంగ్రెస్ ధోరణులు ఏవీ పట్టడం లేదు. ఆ పార్టీల ప్రచారాలకు వారు స్పందించడంలేదు. జీవనోపాధి సమస్యలతో సతమతమవుతున్న సగటు ఓటర్లు వాటి నుంచి బయటపడేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. ఆసేతు హిమాచలం పర్యటించండి నాయకులు, సామాన్య పౌరుల మధ్య సంబంధరాహిత్యం ఎంతగా ఉన్నదో స్పష్టమవుతుంది. గత ఐదేళ్లుగా అసంఖ్యాక భారతీయులు, కోవిడ్ మహమ్మారి, సుదీర్ఘ లాక్‌డౌన్‌లు, ధరల పెరుగుదల, ఉద్యోగాలు కోల్పోవడం, ఆదాయాలు పడిపోవడం మొదలైన సమస్యలతో సతమత మవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వారిలో సుభిక్ష భావన (ఫీల్‌గుడ్) సృష్టించడం ఎలా సాధ్యమవుతుంది..?? ఈ కారణంగానే రాజకీయ నాయకుల ప్రసంగాలు, హామీలు వారి నేమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాయి. నగరాలలో సాయం సంధ్యల్లో వివిధ సభలు, సమావేశాలలో పాల్గొనే వారికి ‘ప్రభవిస్తున్న నవభారతం’ అనేది ఒక ఉత్తేజకర చర్చనీయాంశం కావచ్చు గానీ దుర్భర పరిస్థితులు ఉన్న గ్రామీణ భారతంలో వాటర్ ట్యాంకర్ ఎనిమిది రోజులకు ఒకసారి మాత్రమే రావడం అనేది ఒక కఠోర వాస్తవం. మరి ‘నవభారత్’ గురించిన ఉద్ఘాటనలు సగటు పౌరులను ఎలా ఉత్తేజపరుస్తాయి..?? రాజకీయ నాయకుల ప్రసంగాలకు, సంఖ్యానేక ప్రజల వాస్తవ జీవన పరిస్థితులకు మధ్య తీవ్ర అంతరం ఉంటోంది. నేతల ఈ నిర్లక్ష్య వైఖరులే అత్యధిక ఓటర్లలో ఎన్నికల ప్రకియ పట్ల ఉదాసీనతను కాకపోయిప్పటికీ ఏ పార్టీ అభ్యర్థికి ఓటువేయాలనే విషయమై ఒక నిశ్చయానికి రాలేని మందకొడితనాన్ని కలిగిస్తున్నాయి.
మహారాష్ట్రనే చూడండి పశ్చిమ భారతంలోని ఈ ప్రధాన రాష్ట్రంలో గత మూడేళ్లలో అనేక రాజకీయ ఉపద్రవాలు సంభవించాయి. ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. విధేయతలు మార్చుకోవడం, రహస్య పొత్తులు పెట్టుకోవడం మొదలైన పరిణామాలు రాష్ట్ర పాలన పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ప్రధాన రాజకీయ పార్టీల కార్యకర్తల సైతం ఎన్నికల సంబంధిత వ్యవహారాలలో పాల్గొనేందుకు ఎంత మాత్రం ఆసక్తి చూపడం లేదు.
రాజకీయవేత్తలు తమ ఆస్తి పాస్తులను పెంచుకుంటూ పదవులను అధిష్ఠిస్తుండగా సగటు కంటే తక్కువ వర్షపాతంతో వ్యవసాయరంగంలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ముంబై సంపన్నులు విలాస జీవితాలు గడుపుతుండగా ట్యాంకర్ మాఫియా గ్రామీణ మహారాష్ట్రలో ఒక పెద్ద బకెట్ నీటిని రూ. 200 కి విక్రయిస్తోంది. రాజకీయ నాయకులు పెద్ద పెద్ద హామీలు ఇచ్చి వాటిని ఏ మాత్రం నెరవేర్చకపోతుండడంతో వారి పట్ల గ్రామీణ ప్రాంతాల ఓటర్లలో భ్రమలు తొలగిపోయాయి. ఇప్పుడు ఎన్నికల విషయంలో గ్రామీణ ఓటర్ల ఆలోచనలకు ఈ వాస్తవాలే ఆధారంగా ఉంటున్నాయి అంటే ఎన్నికల పట్ల వారి మనోవైఖరులు ఎలా ఉన్నాయనేది ఎవరికి వారే అర్థం చేసుకోవచ్చు. రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికారంలో ఉన్న వారి పట్ల వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ‘మోదీ గ్యారంటీ’లకు సంబంధించిన పోస్టర్లు పల్లె పల్లెన ప్రతి వీథిలోనూ వెలసినా పాలకుల పట్ల వారి వ్యతిరేకతను తగ్గించలేకపోతున్నాయి. అవును, ప్రజల్లో ప్రబలిన ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే బిజేపి వంద మందికి పైగా సిట్టింగ్ ఎంపీలను మార్చివేయడం జరిగింది.
ఈ వాస్తవాలు మరొక పెద్ద ప్రశ్నను మన ముందుంచుతున్నాయి. జీవన పోరాటంలో అలసిపోయిన ఓటర్ అసంతృప్త మనోవైఖరి నుంచి ఎన్నికలలో లబ్ధిపొందేదెవరు..?? నష్టపోయేదెవరు..?? బిజేపి సహేతుకంగానే తన విజయం పై ఆత్మవిశ్వాసంతో ఉన్నది. పటిష్ఠ ఎన్నికల యంత్రాంగం, అందునా ప్రజల విశ్వాసాన్ని మరెవరికంటే ఎక్కువగా పొందుతున్న ఒక శక్తిమంతమైన నాయకుడి నిర్ణయాలు, నిర్దేశాలకు పని చేస్తుండడంతో తాము వరుసగా మూడోసారి కూడా విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు పూర్తి నమ్మకంతో ఉన్నాయి. కాంగ్రెస్ కూడా ఒక ఆశాభావంతోనే పోరాడుతున్నది. ఓటర్ల ఉదాసీనత, సరిసమాన స్థాయిలో పోటీ పడుతున్న నియోజకవర్గాలలో ప్రత్యర్థితో గట్టిగా పోరాడే అవకాశాన్ని కల్పిస్తుందనే ఆశ కాంగ్రెస్‌కు నిండుగా ఉంది. అయితే భారత ప్రజాస్వామ్య సంక్షోభం బిజేపి వర్సెస్ ప్రతిపక్షం అనే ద్వంద్వత్వానికి మాత్రమే పరిమితమైనది కాదు. అది చాలా విస్తృతమైనదీ, తీవ్రమైనదని చెప్పి తీరాలి. ఏమైనా ఎన్నికలలో ఏ పార్టీ గెలిచినా ఓటర్లే ఎక్కువగా నష్టపోతున్నారనే భావన ప్రజల్లో బాగా పెరిగిపోతోంది. పార్టీలు, నాయకుల పట్ల ప్రజల ఈ విశ్వాస రాహిత్యమే భారత ప్రజాస్వామ్య సంక్షోభానికి ఒక తిరుగులేని తార్కాణం.