అబద్ధాలు మాట్లాడడంలో రేవంత్ రెడ్డి దిట్ట

Submitted by p naresh on Mon, 03/10/2022 - 14:21
Revanth Reddy is notorious for telling lies
  • మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్
  • కల్వకుర్తికి ప్రాంతానికి జైపాల్ రెడ్డి చేసింది ఏమీ లేదు 
  •  తెలంగాణ ఉద్యమంలో మామ అల్లుళ్ళ పాత్ర లేదు

కల్వకుర్తి, అక్టోబర్ 2 (ప్రజా జ్యోతి): అబద్ధాలు మాట్లాడడంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిట్ట అనిమాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ అన్నారు చరిత్రను వక్రీకరించేలా అబద్ధాలు సృష్టిస్తూ పదే పదే అబద్ధాలు చెబుతూ అబద్ధాలే నిజమయ్యేలా గట్టిగా మాట్లాడడం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని, కల్వకుర్తి ప్రాంత చరిత్రను వక్రీకరించే కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ విమర్శించారు. కల్వకుర్తిలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్వకుర్తి చరిత్రలో కల్వకుర్తి ప్రాంత ప్రజలు జైపాల్ రెడ్డిని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే, ఈ ప్రాంత ప్రజలకు చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం రెండు రోజుల క్రితం మాడుగులలో జైపాల్ రెడ్డి విగ్రహ ఏర్పాటులో భాగంగా మాట్లాడుతూ కల్వకుర్తిని ఉద్ధరించింది జైపాల్ రెడ్డి మాత్రమేనని పేర్కొనడం విడ్డూరంగా ఉందని తెలిపారు. కల్వకుర్తి ప్రాంత ప్రజలకు జైపాల్ రెడ్డి చేసింది ఏమీ లేదని, ఈ ప్రాంతం నుంచి రాజకీయ జీవితం ప్రారంభించి కేంద్ర మంత్రిగా జాతీయస్థాయి రాజకీయాల్లో రాణించినప్పటికీ, కల్వకుర్తి ప్రాంత అభివృద్ధిపై ఇసుమంతైన దృష్టి సారించలేదని విమర్శించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం జైపాల్ రెడ్డి తోనే సాధ్యమైందని, రేవంత్ రెడ్డి పేర్కొనడం పిల్ల చేష్టగా ఉందని చిత్తరంజన్ దాస్ విమర్శించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రారంభమైనప్పుడు రేవంత్ రెడ్డి రాజకీయ జీవితమే ప్రారంభించలేదని, నిజా నిజాలు తెలుసుకోకుండా సొంత మామను ఆకాశానికి ఎత్తేలా మాట్లాడడం సరికాదని తెలిపారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అంశం గవర్నర్ ప్రసంగంలో ప్రవేశ పెట్టేందుకు తాను శక్తివంచన లేకుండా కృషి చేశానని, ఈ పథకం సాధనలో మాజీ మంత్రి సమరసింహారెడ్డి, జలసాధన సమితి ఆధ్వర్యంలో వంగూరు మండల జడ్పిటిసి కెవిన్ రెడ్డి కృషి ప్రశంసనీయమని తెలిపారు. అయితే జైపాల్ రెడ్డికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను మంత్రిగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా కల్వకుర్తి ప్రాంత సమస్యలను కృతనిచ్చేయంతో, మనసా వాచా పరిష్కరించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని తెలుగుజాతి ఆత్మగౌరవం నందమూరి తారక రామారావు ప్రారంభిస్తే, అనంతరం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి, వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జలయజ్ఞం పేరుతో కల్వకుర్తి పథకానికి అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తూ, భారీగా నిధులు మంజూరు చేసి మేజర్ పనులన్నీ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ ప్రయత్నంలో జైపాల్ రెడ్డికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి అసలు సంబంధమే లేదని చిత్తరంజన్ దాస్ పేర్కొన్నారు. కల్వకుర్తికి కరెంటు తీసుకువచ్చిన ఘనత జైపాల్ రెడ్డి దేనని మరో తప్పుడు ప్రచారం రేవంత్ రెడ్డి చేస్తున్నారని, కల్వకుర్తికి కరెంటు తన హయాంలో శాంతాబాయి కృషితో రావడం జరిగిందని చిత్తరంజన్ దాస్ తెలిపారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి జైపాల్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, తెలంగాణ ఉద్యమంలో మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సంబంధం లేదని తెలిపారు. సీమాంధ్ర పార్టీ అధినేత చంద్రబాబుకు తొత్తుగా ఉంటూ, తెలంగాణ ఉద్యమాన్ని, అమరవీరుల త్యాగాలను అవహేళన చేసేలా వ్యవహరించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం, సత్య వాక్యాలు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజు సమయం కేటాయించని జైపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి లు తెలంగాణ ఉద్యమంలో మామ అల్లుళ్ళ పాత్ర ఉందని చరిత్రను వక్రీకరించే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నారని చిత్తరంజన్ విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉండి 1400 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకుంటే, నాటి అధికార పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో ఏనాడైనా తెలంగాణ గురించి జైపాల్ రెడ్డి మాట్లాడారా అని చిత్తరంజన్ దాస్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి టిడిపిలో ఉండి నాడు సీమాంధ్రకు తొత్తుగా వ్యవహరించి తెలంగాణ ఉద్యమంలో కలిసి రాకుండా ఈ ప్రాంత ప్రజలను మోసం చేయడం జరిగిందని తెలిపారు. నాడు సోనియాగాంధీని దయ్యం అని విమర్శించి, కాంగ్రెస్ లో చేరిన వెంటనే సోనియా గాంధీని దేవతగా కీర్తించే ప్రయత్నం చేయడం జరుగుతుందని, రోజుకో మాట పూటకో తీరు అన్న చందంగా రేవంత్ వ్యవహారం ఉందని పేర్కొన్నారు. టిడిపిని తెలంగాణలో లేకుండా చేయడంలో క్రియాశీలక భూమిక పోషించిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ను ఖతం చేయడం ఖాయమని పేర్కొన్నారు. ఫ్యూడల్ వ్యవస్థను పెంచి పోషించి జీవితాంతం ఫ్యూడల్ గా జీవించిన జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కమ్యూనిస్టు నేతలు రావడం సిగ్గుచేటని విమర్శించారు. కల్వకుర్తి ప్రాంతం తన హయంలోనే అద్వితీయంగా అభివృద్ధి చెందిందని కల్వకుర్తిలో ఆర్టీసీ డిపో, బస్టాండ్ ఏర్పాటు చేయడం సుద్ధకల్ బ్రిడ్జి నిర్మించి, జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న జైపాల్ రెడ్డి అనుచరుడు అబ్దుల్ ఖాదర్ సర్వీసులన్నింటినీ మూసేసి ఆర్టీసీ బస్సులను జిల్లాకు పరిచయం చేసిన ఘనత తనదేనని తెలిపారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్, కోదండరాం, కెసిఆర్, విజయశాంతి, కేకే, పొన్నం ప్రభాకర్, మంద జగన్నాథం, రాజయ్య, మరి ఎంతోమంది తెలంగాణ నేతలు అద్వితీయ కృషి చేశారని, మరి జైపాల్ రెడ్డి ఎక్కడ ఉద్యమం ప్రయత్నం చేశారో రేవంత్ రెడ్డి బహిర్గతం చేయాలని సవాలు విసిరారు. చరిత్రను వక్రీకరిస్తే భవిష్యత్తు క్షమించదని, కష్టపడకుండానే మాయమాటలతో కీర్తి కిరీటాలు దక్కించుకోవడం సరికాదని హితవు పలికారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మాయ మాటలు ప్రజలను, మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని, అబద్ధపు ప్రచారాలు ఎంతో కాలం నిలువని, నిజాలు నిగ్గు తేలినప్పుడు ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందని చిత్తరంజన్ దాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ సర్పంచ్ పసుల ప్రభాకర్ . కుర్మిద్ద మాజీ సర్పంచ్ పుట్ట శేకర్ .బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దయ్య యాదవ్ . తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు సొంతం శేశి కుమార్ గౌడ్ . లక్ష్మయ్య .అంజయ్య గౌడ్. సలీం.మధు .శేకర్. శివ కుమార్ గౌడ్ . ఆంజనేయులు . బాలకృష్ణ. ఆంజనేయులు. తదితురులు పాల్గొన్నారు