పార్కింగ్ పైసలు గోల్ మాల్

Submitted by veerareddy on Tue, 27/09/2022 - 11:54
 Parking fee is Gol Mall

- లక్నవరం పర్యాటకుల నుంచి వాహన చార్జీల వసూలు
- అధికారులకు నెలనెలా మామూళ్లు

ములుగు జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 25(ప్రజా జ్యోతి): ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం పర్యాటకుల నుండి ముక్కుపిండి వసూలు చేస్తున్న టోల్ టాక్స్ పైసలు దారిమళ్లుతున్నాయి. ఊరి అభివృద్ధికి ఉపయోగించాల్సిన ఈ నిధుల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.ప్రకృతి రమణీయతతో పర్యాటకుల మనస్సును దోచుకుంటున్న లక్నవరం సరస్సును తిలకించేందుకు నిత్యం వందల మంది వచ్చిపోతుంటారు.సెలవు రోజుల్లో సందర్శకుల సంఖ్య వేలల్లో ఉంటుంది. గోవిందరావుపేట మండలం బుస్సాపురం గ్రామ పంచాయతీ శివారులో ఉన్న సరస్సు వద్దకు పర్యాటకులతో వచ్చి పోయే వాహనాలకు టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.గతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వసూలు చేసేవారు.జింకల పార్కు వద్ద యూనిఫారంలో ఉండే సిబ్బంది ద్విచక్ర వాహనానికి రూ.20, కారుకు రూ.50,బస్సుకు రూ.100 చొప్పున చార్జీ విధిస్తున్నారు.గడిచిన కొన్నేళ్లలో రూ.15 కోట్ల వరకు సమకూరినట్లు సమాచారం.అదేవిదంగా ప్రఖ్యాత రామప్ప దేవాలయం ఉన్న పాలంపేట, సమ్మక్క-సారలమ్మలు కొలువైన మేడారంలో గ్రామపంచాయతీల ద్వారా వాహనాలకు టోల్ టాక్స్ విధిస్తున్నారుఅటవీశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న టోల్ ట్యాక్స్ పార్కింగ్ ను జిల్లా కలెక్టర్ చొరవతో గ్రామపంచాయతీకి అప్పగించారు.సరస్సు వద్ద పారిశుధ్యం, ఇతర పనులు చేస్తున్న బుస్సాపురం పంచాయతీకే ట్యాక్స్ వసూలు చేసే హక్కులు కల్పించారు.సులభ ఆదాయ మార్గాన్ని కోల్పోయేందుకు ఫారెస్టు డిపార్ట్మెంట్ అంత ఈజీగా ఒప్పుకోలేదు. కరోనా తర్వాత లక్నవరానికి నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుండటంతో నెలనెలా రూ.3 లక్షలకుపైనే సమకూరుతోంది. 

మామూళ్లు ఇలా..

నెలనెలా వసూలయ్యే డబ్బులను గ్రామ పంచాయతీ పాలకవర్గ తీర్మానంతో గ్రామ అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ,ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.వసూళ్లు.. ఖర్చులపై ఇటీవల గ్రామస్థులు నిలదీయడంతో ఖర్చుల వివరాలను ఇటీవల జిపి అధికారులు అధికారికంగా విడుదల చేశారు.రూ.241,860 ఖర్చులలో డిపిఓకు రూ.25 వేలు,డిపిఓస్నేహితులకు రూ.2,000,ఎంపిడిఓ,తహసీల్దార్లకు రూ.3 వేలు,కానిస్టేబుల్ కు రూ.1,700, డిఎల్పీఓ డ్రైవర్ కు రూ.500,ఏఎస్సై వచ్చినప్పుడు రూ.1500 లతోపాటు జర్నలిస్టుల పేరిట రూ.6,500ల వరకు ఖర్చయినట్లు అందులో పేర్కొన్నారు. వారం గ్రీవెన్స్ చేశారు. గ్రామపంచాయితీ ఇచ్చిన ఖర్చుల వివరాలు కూడా అంద జేశారు.ఈ ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే విచారణ జరిపించాల్సిందిగా డిపిఓ వెంకయ్యను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ ఆదేశంతో లక్నవరం టోల్ ట్యాక్స్ వసూళ్లు ఖర్చులపై విచారణ ప్రారంభించాం. ఎంపీఓ స్థాయి అధికారి నియామకమయ్యారు.త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తాం.నాకు డబ్బులు ఇచ్చినట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు.పారదర్శకంగా జరుగుతున్న విచార ణలో నిజానిజాలు వెల్లడవుతాయని ములుగు జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య వెల్లడించారు.