చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్.... 310 గ్రాముల బంగారం,70 గ్రాముల వెండి,పంచలోహ విగ్రహం,రూ 95 వేల నగదు స్వాధీనం..

Submitted by bathula radhakrishna on Mon, 21/11/2022 - 17:00
Yellandu

ఇల్లందులో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగ గుగులోత్ రంజిత్ ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 310 గ్రాముల బంగారం,70 గ్రాముల వెండి,పంచలోహ విగ్రహం,రూ 95 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ  డా.వినిత్ తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు.  ఇల్లందు పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు చేస్తున్న గుగులోత్ రంజిత్ ను ఈనెల 20న ఇల్లందు సిఐ బాణోత్ రాజు, సిబ్బంది నిఘా పెట్టి పట్టుకున్నారన్నారు. గుగులోత్ రంజిత్ 2015లో ఇల్లందు పట్టణంలో మూడు దొంగతనాలు, 2017లో ఒక దొంగతనం, 2020లో మూడు దొంగతనాలు,2021లో మూడు దొంగతనాలు, 2022లో ఒక హత్య, నాలుగు దొంగతనాలు చేసినట్టు పేర్కొన్నారు.మొత్తం 15 నేరాలలో 6 గ్రేవ్,9 నాన్ గ్రేవ్ నేరలున్నాయని పేర్కొన్నారు. వరుసగా దొంగతనాలు చేస్తూ రాత్రులు ఇళ్ల తలుపులకు డ్రిల్లింగ్ చేసి తలుపులు తీసి లోనికి ప్రవేశించి కొట్టి చంపుతానని రోకలి బండతో బెదిరిస్తూ, మహిళల మెడ,వారి వద్ద ఉన్న బంగారం, వెండి,డబ్బులను దోచుకునేవాడన్నారు. అదేవిధంగా దేవాలయాలలోనూ తాళాలు పగులగొట్టి దేవత విగ్రహాలు,హుండీ డబ్బులు చోరీ చేయడం జరిగిందని తెలిపారు.గత సంవత్సరం నవంబరు నెలలో సత్యనారాయణపురం కోడిపందేల వద్ద గుగులోతు రంజిత్,మరీదు సోమయ్యలకు కోడిపందెం విషయంలో గొడవ జరిగిందని తెలిపారు.ఈనేపథ్యంలో కోపంతో 2022 ఫిబ్రవరి నెలలో సోమయ్య ఇంటి వెనుక తలుపులకు డ్రిల్లింగ్ ద్వారా రంధ్రం చేసి లోనికి ప్రవేశించి తన వెంట తెచ్చుకున్న రోకలి బండతో మరీదు సోమయ్య తలపై,అడ్డువచ్చిన అతని భార్యను సైతం కొట్టి గాయపర్చడంతో సోమయ్య చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగిందని తెలిపారు.అదేవిధంగా కాకతీయ నగర్ లోని ఒక ఇంటికి దొంగతనానికి వెళ్లి భార్యాభర్తలను రోకలిబండతో కొట్టి గాయపర్చడం జరిగిందని పేర్కొన్నారు.కూరగాయల మార్కెట్ వద్ద గల శివాలయంలోని వాచ్ మెన్ ను రోకలిబండతో తలపై కొట్టడం జరిగిందని వివరించారు. నిందితుని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం,వెండి,పంచలోహ విగ్రహాల విలువ సుమారుగా రూ. 20 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.గుగులోత్ రంజిత్ ను రిమాండ్ నిమిత్తం ఇల్లందు కోర్టుకు తరలించనున్నట్లు తెలిపారు.ఇల్లందు సీఐ బాణోత్ రాజు,సిబ్బందిని ఎస్పీ,డిఎస్పీ అభినందించారు.ఈసమావేశంలో ఇల్లందు డిఎస్పీ రమణా మూర్తి,ఇల్లందు సిఐ బాణోత్ రాజు,సిబ్బంది కృష్ణయ్య,బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags