నూతన విద్యా విప్లవం వర్ధిల్లాలంటే..??

Submitted by Praneeth Kumar on Wed, 03/04/2024 - 08:46
If the new education revolution is to flourish..??

నూతన విద్యా విప్లవం వర్ధిల్లాలంటే..??
◆ ప్రజా మేధావులకు తెలివి కన్నా, బీద ప్రజల పక్షాన నిలబడే హృదయం ఉండాలి.

ఖమ్మం, ఏప్రిల్ 03, ప్రజాజ్యోతి.
     
గత ఐదేండ్లలో దేశంలో ఎక్కడా లేని విద్యా విధానం ఆంధ్రప్రదేశ్‌లో అమలైంది. కానీ తమ పిల్లల్ని ఖరీదైన ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లలో చదివించిన వారు, పేదలు తమ పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం ప్రభుత్వ స్కూళ్లలో కావాలని కోరుకుంటే వ్యతిరేకించారు. ఇది విచిత్ర చారిత్రక సన్నివేశం. దేశంలో ప్రయివేట్‌ విద్య ఎంత ఖర్చుతో కూడుకున్నదో, ఏ భాషలో సాగుతున్నదో తెలియదా..?? ప్రజా మేధావులకు తెలివి కన్నా, బీద ప్రజల పక్షాన నిలబడే హృదయం ఉండాలి కదా..!! దేశ చరిత్రలో మొదటిసారి విద్యా సమానత్వ ప్రయోగాన్ని జగన్‌ ప్రభుత్వం చేస్తోంది. ఆ ప్రక్రియను వ్యతిరేకించే మూడు పార్టీల కూటమిని సమర్థించే మేధావులను ప్రజలు వ్యతిరేకించాల్సింది, తమ పిల్లల భవిష్యత్తు కోసం.
2024 ఆంధ్ర ఎన్నికలు గత రెండు ఎన్నికల కంటే పూర్తిగా భిన్నమైనవి. 2014లో ఒకవైపు మూడు పార్టీల కూటమికి, వైసిపికి రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగాయి. అప్పుడు కేంద్రంలో రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. ఆనాడు కొత్త రాష్ట్ర రాజధాని, ప్రత్యేక ప్యాకేజీ ప్రధాన అంశాలు. 2019 ఎన్నికల్లో అన్ని పార్టీలు విడివిడిగా కొట్లాడాయి. వైసిపి తన కొత్త విద్యా విధానం, గ్రామాల అభివృద్ధి అంశాలతో 151 సీట్లు గెలిచింది. విడిగా పోరాడిన మూడు పార్టీలు మట్టికరిచాయి. చంద్రబాబుకు 23 సీట్లు, పవన్‌ కల్యాణ్‌కి 1 సీటు వచ్చాయి.
గత ఐదేండ్లలో ఆ పార్టీలు ఊహించని విధంగా దేశంలో ఎక్కడా లేని విద్యా విధానం ఆంధ్రప్రదేశ్‌లో అమలైంది. దీన్ని ఏపీ నాయకులు చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, జయప్రకాశ్‌ నారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. వీరేకాక దేశ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన ఎం.వి.రమణ కూడా వ్యతిరేకించారు. సమస్య కోర్టుకు పోయింది. అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకించింది.
సుప్రీంకోర్టు జడ్జిగా రమణకు ఇంగ్లిష్‌ భాష పాత్ర ఎంతో తెలుసు, అయినా వ్యతిరేకించారు. వీరుకాక మీడియా రంగంలో ఈనాడు గ్రూపు, ఆంధ్రజ్యోతి గ్రూపు, టీవీ 5 నెట్‌వర్క్‌ అధిపతులు తమ పిల్లల్ని మంచి, మంచి ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లలో చదివించి. రైతులు, కూలీలు, దళితులు, బీసీలు, ఆదివాసులు తమ పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం ప్రభుత్వ స్కూళ్లలో కావాలని కోరుకుంటే వ్యతిరేకించారు. ఇది విచిత్ర చారిత్రక సన్నివేశం.
ఈ ఎన్నికల్లో మళ్ళీ 2014 నాటి ప్రతిపక్ష గుంపు జత కట్టింది. జగన్‌ను ఓడించాలని వీళ్ళు రాత్రింబవళ్లు పనిచేసేది ఎందుకోసం..?? ముఖ్యంగా గ్రామీణ పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం చదువు ఆపెయ్యడం కోసం. ఈ క్రమంలో జయప్రకాశ్‌ నారాయణ గురించి కొంత చర్చించాలి. ఈయన మాజీ ఐఏఎస్‌ అధికారి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కొంతకాలం ఆయన పర్సనల్‌ సెక్రటరీగా పని చేశారు. ఆ దశలో తెలంగాణలో నక్సలైట్లకూ, తెలుగుదేశం పార్టీకీ తీవ్ర సంఘర్షణ జరుగుతున్నది.
ఎన్టీఆర్‌ సన్నిహిత సోషలిస్టు నాయకుడొకరు కేజీ కన్నాభిరన్‌ (అప్పటి పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు)కు కబురుపెట్టి, ముఖ్యమంత్రితో హక్కుల నాయకులతో మీటింగ్‌ ఏర్పాటు చేశారు. ఆ మీటింగుకు కన్నాభిరన్, బాలగోపాల్, ఎం.టి.ఖాన్‌ వచ్చారు. వారు వెయిటింగ్‌ రూంలో ఉండగా జయప్రకాశ్‌ నారాయణ ఆ మీటింగ్‌ను జరగకుండా చూడాలని చాలా ప్రయత్నం చేశాడు, కానీ ఎన్టీఆర్‌ వినలేదు. మీటింగ్‌ జరిగింది.
నక్సలైట్లను అణచివెయ్యాలి గానీ వారితో చర్చలేమిటని జేపీ ఆలోచన. ఆ విభాగాన్ని చూసే పోలీస్‌ ఆఫీసర్‌ అరవిందరావుది కూడా అదే ఆలోచన. పౌరహక్కుల టీమ్‌ ఇరుపక్షాల హత్యలు, కిడ్నాప్‌లు, ఎన్‌కౌంటర్లు ఆపించాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న రోజులవి. అప్పుడు ఎన్‌కౌంటర్లు, టీడీపీ కార్యకర్తల కిడ్నాపులు చాలా జరిగాయి. ఆ తరువాత జయప్రకాశ్‌ నారాయణ ఈనాడు పేపర్, ఈటీవీ ద్వారా మేధావి అవతారమెత్తాడు.
అక్కడి నుండి ఒక ఎన్జీవో పెట్టి, ‘లోక్‌సత్తా’ (అంటే ఇంగ్లిష్‌లో గ్లోబల్‌ పవర్‌) అనే రాజకీయ పార్టీ రూపందాల్చి, దానికి అలుపెరుగని, ఎన్నడూ దిగిపోని ఏకో ముఖ (అంటే ఆ పార్టీలో మరో ముఖమే కనపడదు) అధ్యక్షుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ గ్లోబల్‌ పవర్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డిని ఓడించాలని ఉన్న మూడు పార్టీల కూటమి చాలనట్లు నాలుగో పార్టీగా అందులో చేరాడు.  ఇప్పుడు జేపీ లక్ష్యమంతా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం చదువు ఆపి, మళ్లీ తెలుగు మీడియం పెట్టేంత వరకూ పోరాటం చెయ్యడం.
ఆయన మరో లక్ష్యం గ్రామాలలో స్కూళ్ల నిర్మాణం, సెక్రటే రియట్‌ నిర్మాణాలను ఆపి అభివృద్ధికి మార్గంగా అమరావతిని సింగపూర్‌లా చూపడం. అభివృద్ధి పై ప్రపంచ యూనివర్సిటీలు చదివే గొప్ప పుస్తకం ఆయన రాసినట్లు, డెవలప్‌మెంటల్‌ ఎకనామిక్స్‌లో తాను అథారిటీ అయినట్లు నిరంతర యూట్యూబ్‌ ఉపన్యాసాలు ఇస్తున్నారు. గ్లోబల్‌ పవర్‌ ఈనాడు నుండి ఇప్పుడు యూట్యూబ్‌కు మారింది.
విద్యా వ్యవస్థ మీద కూడా జాన్‌డ్యూయి (కొలంబియా యూనివర్సిటీలో అంబేడ్కర్‌ గురువు) కంటే తానే మంచి ఎక్స్‌ఫర్ట్‌ అన్న రీతిలో ఉపన్యాసాలు ఇస్తారు. జేపీ ప్రపంచ మార్పు మీద ఇంగ్లిష్‌లోనో, తెలుగులోనో రాసిన మంచి పుస్తకం మార్కెట్‌లో ఇంత వరకు ఒక్కటి కనిపించలేదు.
30,000 ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడు తీసు కున్నప్పుడు వెంకయ్య నాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి. ఆయన సలహా, సహకారం లేకుండా చంద్రబాబు ఆ పని చెయ్యడు. ఇప్పుడు గ్రామీణ బడుల నిర్మాణం, ఇంగ్లిష్‌ మీడియం చదువు, అమ్మ ఒడి పథకం ఆపి, అమరావతి పట్టణం వచ్చే ఐదేండ్లలో కడితే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధితో పాటు దేశానికే ఒక మోడల్‌ సిటీ వస్తుందని బహుశా జేపీ గారి నమ్మకం.
కానీ ఒక ఎనిమిదో తరగతి విద్యార్థి మా తల్లిదండ్రులు జగన్‌కు ఓటేసి గెలిపించక పోతే, ఇంగ్లిష్‌ మీడియం ఆగి పోతే, నాకొచ్చే బట్టలు, బూట్లు ఆగిపోతే నేను ఉన్న బట్టలు సర్దుకుని ఇంట్లో నుండి పారిపోతాను అన్నాడు. ఆ పిల్లోడి ఆశను ఏం చెయ్యాలని ఈ నాయకులు అనుకుంటున్నారు..??
ప్రజా మేధావికి తెలివి కన్నా, వాగ్దాటి కన్నా బీద ప్రజల పక్షాన నిలబడే హృదయం ఉండాలి కదా. దేశంలో ప్రయివేట్‌ విద్య ఎంత ఖర్చుతో కూడుకున్నదో, ఏ భాషలో సాగుతుందో వీరందరికి తెలువదా..??
2024–25 ఎకనమిక్‌ సంవత్సరానికి ధీరూబాయి అంబానీ కొడుకు, కోడలు నడిపే స్కూలు ఫీజు చూడండి. సంవత్సరానికి ఎల్‌కేజీ విద్యార్థి ఫీజు 1,70,000.
8–10వ తరగతి పిల్లల ఫీజు 5,90,000.
11–12వ తరగతి పిల్లల పీజు 9,65,000.
ఇటువంటి స్కూళ్లు దేశంలో చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏ మాతృభాషలో నడుస్తున్నాయి..?? ఇంతింత ఫీజులలో ఇంగ్లిష్‌ మీడియంలో, విదేశీ సిలబస్‌తో చదివే పిల్లల్ని జగన్‌ మోడల్‌ విద్యా విధానం ద్వారా కాక ఎలా ఎదుర్కొంటారు..??
ఏపీలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అన్నది కాదు సమస్య. ఈ ఎన్నికల పోరాటంలో అక్కడ ప్రభుత్వ రంగంలో ప్రారంభమైన ఇంగ్లిష్‌ క్వాలిటీ విద్యా ఎక్స్‌పెరిమెంట్‌ ఏమైతది అనేది కీలకమైన సమస్య. ఈ దేశ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తు మీద భయంతో ఇది రాస్తున్నాము. ఒక పబ్లిక్‌ ఇంట లెక్చువల్‌కు దోపిడీకి, అణచివేతకు గురౌతున్న ప్రజల జీవనం మారడం ముఖ్యం.
రాజకీయ నాయకులకు రాజకీయాలలో తమ ఉనికి ముఖ్యం. తమ ఉనికి కోసమైనా రాజకీయ నాయకులు ప్రజల మార్పు కోసం, సమానత్వం సాధించడం కోసం చర్యలు చేపట్టినప్పుడు వాటిని సమర్థించడం ప్రజా మేధావి ప్రధాన కర్తవ్యం. ఈ క్రమంలోని దేశ చరిత్రలో మొదటిసారి విద్యా సమానత్వ ఎక్స్‌పెరిమెంట్‌ జగన్‌ ప్రభుత్వం చేస్తున్నందున మేము ఈ విద్యా విధానాన్ని సమర్థిస్తున్నాను. ఆ ప్రక్రియను వ్యతిరేకించే మూడు పార్టీల కూటమిని సమర్థించే మేధావులను ప్రజలు వ్యతిరేకించాల్సింది. తమ పిల్లల భవిష్యత్తు కోసం, అన్నది మా అభిప్రాయం. దీనికి మీరేమంటారు..!!