ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలి

Submitted by sridhar on Sat, 10/09/2022 - 17:43
The idol of Ailamma should be installed on the tank bund
  • సీపీఐ (యంయల్ ) రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా

పాలకుర్తి: సెప్టెంబరు 10, ప్రజాజ్యోతి :తెలంగాణ వీరనారి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని సీపీఐ (యంయల్ ) రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఆదివారం  మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో ఐలమ్మ కుటుంబ సభ్యులతో కలిసి 37 వ వర్ధంతిని నిర్వహించారు. ఐలమ్మ స్మారక స్థూపం వద్ద ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఐలమ్మ జయంతి, వర్ధంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని అన్నారు.

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రజాకార్ల ఆగడాలను ఎదిరించిన వీరనారి ఐలమ్మ అన్నారు. 60 గ్రామాలకు అధిపతి అయిన విస్నూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి అరాచకాలపై తిరుగుబాటు చేసి, తన ఇంటిని ఉద్యమ కార్యకలాపాలకు కేంద్రంగా  చేసి తెలంగాణ రైతాంగ పోరాటానికి నాంది పలికిందని కొనియాడారు. ఐలమ్మ తెలంగాణకు ఐకాన్గా నిలిచిందని, ఆమె నిత్యం ప్రజా పోరాటాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పారు. ఆమె అందించిన విప్లవ స్ఫూర్తితో ముందుకెళ్లాలని, వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.

 ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ అనంతోజు రజిత, సీపీఐ(యంయల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మాన్యపు భుజందర్, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ఏదునూరి మదార్, ఐలమ్మ మనుమరాలు రాపర్తి మంజుల  మాట్లాడుతూ..  ఐలమ్మ తెలంగాణకు గర్వకారణమని ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా ఐలమ్మ కుటుంబ సభ్యులు చిట్యాల ఇంజనీర్ యాకయ్య, చిట్యాల సంధ్యారాణి, చిట్యాల యాకయ్య, చిట్యాల లింగమ్మ,  సీపీఐ(యంయల్) లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యులు జీడి సోమయ్య, రజక సంఘం నాయకులు జ్యోతి యాదగిరి, గ్రామస్తులు పాల్గొన్నారు.