కో-ఆపరేటివ్ పాపాల పుట్టపై నిఘా... రంగంలోకి దిగిన నిఘా వర్గాలు, సొసైటీలలో అంతర్గత విచారణ... జంకుతున్న అక్రమార్కులు... మరో శాఖకు మారేందుకు అధికారి ప్రయత్నాలు...

Submitted by SANJEEVAIAH on Wed, 11/01/2023 - 22:35
లోగో

కో-ఆపరేటివ్ పాపాల పుట్టపై నిఘా

రంగంలోకి దిగిన నిఘావర్గాలు... 

సొసైటీలపై అంతర్గత విచారణ

రైతుల సొమ్ములు కాజేస్తున్న నేతలు

 ఈ పాపాలన్నిటికీ కారులు ఎవరు.?

 మాధవ నగర్ సొసైటీ కేసు ఏమైంది.?

డిసిసిబికి చుట్టుకున్న బ్రాహ్మణపల్లి పిఎసిఎస్ వివాదం

మరో శాఖ పై కన్నేసిన అధికారి

ప్రభుత్వాన్ని అభాసిపాలు చేస్తున్న అధికారులు నాయకులు

(నిజామాబాద్ ప్రతినిధి - ప్రజాజ్యోతి - ఎడ్ల సంజీవ్)

నిజామాబాద్ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై నిఘా కొనసాగుతుంది. విజిలెన్స్ నిఘా వర్గాలు సొసైటీలలో వచ్చిన అవినీతి అక్రమాలపై విచారణ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఇటీవల జక్రాన్ పల్లి మండలం బ్రాహ్మణపల్లి సొసైటీ మాజీ చైర్మన్ మాజీ సీఈఓ లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సొసైటీ పరిధిలో రూ.88 లక్షలకు పైగా అవినీతి అక్రమాలు జరిగినట్లు తెలిసిందే. దీనిపై రెండేళ్లుగా విచారణ పేరుతో కాలయాపన చేసినప్పటికీ విచారణ చేసి చర్యలు తీసుకోవలసిన అధికారులు చేతులు ఎత్తివేసారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. అయితే డిచ్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ ఆధ్వర్యంలో బ్రాహ్మణపల్లి సొసైటీపై  విచారణ మరోసారి సాగింది. సొసైటీ లో జరిగిన అవినీతి అక్రమాల తీరును చూసి పోలీసులే నివ్వెర పోయారు. ఇదేమిటి రైతుల సొమ్ముని ఇంత సులువుగా మెక్కేస్తారా.? జరిగిన తంతు ఏదో జరిగిపోయింది కానీ రైతులకు మేలు జరిగేది ఎలా అనే దానిపై ఇప్పుడు అంతర్గత చర్చ మొదలైంది. దీంతో ఈ వ్యవహారం మెల్లిగా ఇంటలిజెన్స్, విజిలెన్స్ వర్గాలకు వెళ్ళింది. అయితే బ్రాహ్మణపల్లి సొసైటీ వ్యవహారంలో రాజకీయ తంతు కొనసాగడంతో చిలికి చిలికి గాలివానగా మారింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ వ్యవహారంతో మిగిలిన సొసైటీలపై పడింది. ఇప్పటికే 12 సొసైటీలపై ఆరోపణలు ఉండడంతో ఇంటలిజెన్సీ విజిలెన్స్ నిఘా వర్గాలు వీటిపై విచారణ కొనసాగిస్తున్నాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేక పథకాలు తీసుకొస్తుంటే అధికార పార్టీలోనే ఉంటూ అవినీతి అక్రమాలకు పాల్పడడంపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించినట్లు తెలుస్తుంది.  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అధికారుల ద్వారా ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం.

సూత్రధారులు ఎవరు.?

 నిజామాబాద్ జిల్లా కో-ఆపరేటివ్ శాఖ పరిధిలో కొనసాగుతున్న పిఎసిఎస్ లలో అవినీతి అక్రమాలకు అంతులేకుండా పోతుంది. రెండేళ్ల కాలంలో సుమారు 14 సొసైటీలపై అవినీతి ఆరోపణలు రావడం విశేషం. ప్రస్తుతం జిల్లాలో ఉన్నవి 85 మాత్రమే కాక వాటిలో 14 సొసైటీలలో లక్షల నుంచి మొదలుకొని కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు బహిరంగంగానే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా భవన నిర్మాణాలలో  రెండు రకాలుగా ఒకే భవనానికి రెండు ఎంబిలు రికార్డ్ చేయడం ఆయా శాఖల నుంచి రికార్డుల ప్రకారం నగదు నొక్కి వేయడం పరిపాటిగా మారింది. మరోవైపు మార్క్ సైడ్ ఇతర సంస్థల నుంచి అప్పుగా తీసుకువచ్చిన ఫర్టిలైజర్ను రైతులకు అమ్మి ఆ డబ్బును సొంత ఖర్చులకు వాడుకోవడం విశేషం. ఇందులో చైర్మన్ తో పాటు పాలకవర్గంలో కీలకమైన కొంతమంది సీఈవోల పాత్ర ఉండటం గమనార్హం. ఇక పిఎసిఎస్ లకు వచ్చిన డిపాజిట్  సొమ్ములను సైతం బినామీ పేర్లతో లేపేసి సొంత ఖర్చులకు వాడుకున్నారు. డిపాజిట్లు లేకపోయినా సరే చేసినట్లుగా పత్రాలను సృష్టించి మరికొన్నిచోట్ల నగదు లేపేసారు. ఇంకా మరికొన్ని చోట్ల రెండు అడుగులు ముందుకు వేసి రైతులు చెల్లించిన పంట బీమా సొమ్మును సంస్థకు చెల్లించకుండానే తమ సొంత ఖాతాలో జమ చేసుకొని రైతుల నెత్తికి శఠగోపం పెట్టారు.

వెనక్కి తగ్గుతున్న అక్రమార్కులు

గత మూడున్నర కాలంలోనే కోట్లాది రూపాయల అవినీతి అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు బయటపడుతున్నాయి. అయితే వీటికి ప్రధాన కేంద్ర బిందువు పిఎసిఎస్ సొసైటీ చైర్మన్ కీలకంగా వ్యవహరించినట్లు బయటపడుతుంది. అందుకు అక్కడ పని చేసే సీఈవోలు సైతం చేతులు కడప్పడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కోపరేటివ్ శాఖలో కీలకంగా పని చేస్తున్న అధికారి పావులు కదిలినట్లు తెలుస్తుంది. ఎక్కడ తనకి మట్టి అంటకుండా వ్యవహారమంతా నడపడంతో చైర్మన్లు, సీఈఓలు ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఇరుక్కుపోయారు.  అయితే సొసైటీ ఉద్యోగుల సంఘం నాయకుడు ఒకరు ఏకంగా మూడు సొసైటీలలోని లక్షలాది రూపాయలు నొక్కేసినప్పటికీ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నట్లు బయటపడింది. వీటిపై నివేదికలు సిద్ధమైనప్పటికీ వాటిని బహిర్గతం చేసేందుకు కోపరేటివ్ శాఖ అధికారులు జంకుతున్నారు.  అయితే ఇప్పటికే కోపరేటివ్ శాఖలో పనిచేస్తున్న రిజిస్టార్లు సదరు సొసైటీలపై విచారణ చేసినప్పటికీ ఆ నివేదికలను తొక్కిపెట్టినట్లు తెలుస్తుంది. అయితే తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు సొసైటీ ఆడిట్ లలో చిన్న చిన్న పొరపాట్లను అడ్డంపెట్టి సదరు సబ్ రిజిస్టార్లను భయపెట్టినట్లు తెలుస్తుంది. సదరు సబ్ రిజిస్టర్లు సైతం ఆ వ్యక్తికి అనుకూలంగానే నివేదికలు ఇస్తున్నట్లు బహిరంగంగానే చర్చిస్తున్నారు. బ్రాహ్మణపల్లి సొసైటీలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ పేరుతో జాప్యం జరగడం వల్ల నిందితులుగా గుర్తించబడిన వారు రికవరీ డబ్బులు చెల్లించేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఓ ఉద్యోగ సంఘం నాయకుడిని మధ్యవర్తిగా పెట్టి రాజీకుదుర్చే ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమయ్యాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో డిసిఓ సైతం చేతులెత్తేసి సొసైటీకి లేఖ రాసి పోలీస్ కేసు నమోదు చేసుకోవాలని సూచించడం కోపరేటివ్ శాఖలో సంచలనంగా మారింది. మిగతా సొసైటీలకు భిన్నంగా బ్రాహ్మణపల్లి సొసైటీలో కేసు నమోదు చేయించడం వెనక ఆంతర్యమేమిటి అని ఎవరికి అంతుచికడం లేదు.

మిగతా సొసైటీలలో...

ఇది ఇలా ఉంటే నిజామాబాద్ రూరల్ మండలం మాధవ్ నగర్ సొసైటీలో మాజీ సీఈఓపై కేసు నమోదు అయింది. అయినప్పటికీ చర్యలు తీసుకోవడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వ్యవహారం వెనుక మాజీ చైర్మన్ తో పాటు మరో  నాయకుడు కోపరేటివ్ శాఖలోని మరో అధికారి పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది.  ఇప్పటికే సదరు మాజీ సీఈవో నొక్కేసిన సొమ్ములు తిరిగి చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. ఇది ఇలా ఉంటే హొన్నాజీపేట సొసైటీలో హడావిడిగా రూ. 2.80 లక్షలు సొసైటీ ఖాతాలో జమ చేశారు. మరోవైపు కొత్తపల్లి,  ఎతొండ, బాల్కొండ సొసైటీలలో జరిగిన అవినీతి అక్రమాలపై సంబంధిత వ్యక్తులు తిరిగి చెల్లించే పనిలో పడ్డారు. ఒకవేళ ఎలాంటి నిర్లక్ష్యం చేసిన బ్రాహ్మణపల్లి సొసైటీ మాజీ చైర్మన్, మాజీ సీఈవో కు పట్టినగతే పడుతుందని, ఎవరికి వారే పావులు కదుపుతూ డబ్బులు చెల్లించేందుకు సిద్ధం అవడం విశేషం. అయితే ఈ తతంగం నడుపుతూ చక్రం తిప్పిన "హస్తం" ఇప్పుడు ఆ శాఖను వదిలేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. సంబంధిత శాఖలో ఎక్కువ కాలం పనిచేయడం వల్ల తిరిగి మరో శాఖకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కోఆపరేటివ్ శాఖలతో పాటు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని అధికారుల మధ్య గుసగుసలు కొనసాగుతున్నాయి.

పిఎసిఎస్ టు డిసిసిబి...

అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అంటే ఇదేనేమో మరి. డిసిసిబిలోను అవినీతి సూత్రధారులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బ్రాహ్మణపల్లి సొసైటీ లో జరిగిన అవినీతి అక్రమాలలో రూ.2.50 లక్షల వివాదం డిసిసిబి చుట్టూ తిరుగుతుంది. అయితే ఈ రెండున్నర లక్షలు సొసైటీ ఎకౌంట్కి చేరకుండానే మద్యంతరంగానే చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి దీనిపై విచారణ అధికారి వివరాలను ఆరాతీసి డిసిసిబి బ్యాంక్ అధికారికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం ఎక్కడ బయటకు పోక్కలేదు. కానీ సొసైటీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి అలియాస్ తెల్లన్నా మాజీ సీఈవో సురేందర్ రెడ్డిల మేడకు చుట్టుకుంది. అకౌంటు రాకుండా డబ్బులు ఎలా చేతులు మారాయి అనే అనుమానాలపై విచారణ అధికారులే తలలు పట్టుకున్నట్టు తెలిసింది. ఈ అంతుచిక్కని వాస్తవానికి ఓ భవన నిర్మాణం సాక్షిగా నిలిచింది. డిసిసిబి రూ.10 లక్షలు మంజూరు చేస్తే దానికి 25% సొసైటీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్క ప్రకారం బ్యాంకు ఎకౌంటు నుంచి సొసైటీ అకౌంట్లో  ఉండాల్సిన భవన నిర్మాణ నిధులు గోల్మాల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం అటు ఇటు తిరుగుతూ ఎటువైపు దారితీస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. డిసిసిబి, కో-ఆపరేటివ్ అధికారులు సైతం ముక్కున వేలు వేసుకుంటున్నారు. అయితే ఈ విషయమై నిజామాబాద్ డిసిసిబి బ్యాంక్ సీఈఓ గజనంద్ ను "ప్రజాజ్యోతి" వివరణ కోరగా మాకు అలాంటి వాటితో ఎలాంటి సంబంధం లేదని, మాకు ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు. సొసైటీలపై అవినీతి అక్రమాలు రావడం అది మాకు సంబంధం లేని విషయం అని తెలిపారు. బ్యాంకు నిబంధనలు మెరకై వ్యవహరిస్తామని ఇదంతా తప్పుడు ప్రచారం అని అన్నారు.