పోడు భూముల పై సర్వే పారదర్శకంగా నిర్వహించాలి కలెక్టర్ భవేశ్ మిశ్రా

Submitted by srinivas on Fri, 30/09/2022 - 14:45
Collector Bhavesh Mishra said the survey on waste lands should be conducted transparently

వివాదాలకు తావివ్వకుండా భూ సర్వే నిర్వహణ
172 ఆవాసాల నుండి వచ్చిన 25వేల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
పోడు భూముల సర్వే పై  కలెక్టర్ సమీక్ష

భూపాలపల్లి ప్రతినిధి సెప్టెంబర్ 29(ప్రజాజ్యోతి) .//...జిల్లాలో పోడు  భూముల సర్వే పారదర్శకంగా, వివాదాలకు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సంబంధించిన అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రగతి భవనం సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్  టి.ఎస్.దివాకర్, జిల్లా అటవీ శాఖ అధికారిణి బి.లావణ్య ల తో కలిసి పోడు భూములకు సంబంధించిన సర్వే పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలో 11 రెవెన్యూ మండలాలలో  మొగులపల్లి మండలం మినహాయించి 10 మండలాల్లోని 92 గ్రామాలలో 172 ఆవాసాలు నుంచి స్వీకరించిన 25 వేల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పకడ్బందీగా  సర్వే చేపట్టాలని కలెక్టర్ సూచించారు.సర్వే నిర్వాహన సమయంలో సంబంధిత అధికారులు తప్పనిసరిగా తమ వెంట చెక్ లిస్ట్ తీసుకుని వెళ్ళాలని,  సూచించిన నమూనా ఫారంలో పూర్తిస్థాయి వివరాలను నింపాలని అన్నారు. పోడు వ్యవసాయ భూముల సర్వే క్షేత్రస్థాయిలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని, వివాదాలకు తావివ్వకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని, అర్హత అనర్హత అంశాలను సర్వేలో వెల్లడించకూడదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.


ఎఫ్.ఆర్.సి కమిటీ సమావేశం నిర్వహించిన అనంతరం పూర్తి సాక్షాదారాలు  వెల్లడించాల్సి ఉంటుందని దీనికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలని కలెక్టర్ తెలిపారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, తహసిల్దార్లు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు పొడుగు సర్వేపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.రెవెన్యూ, పంచాయతీరాజ్, అటవీ శాఖలు సమన్వయంతో గ్రామస్థాయిలో  పర్యటించి 2005 సంవత్సరానికి ముందు నుంచి అన్యాక్రాంతం అయిన పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులు, 3 తరాల నుంచి సాగు చేస్తున్న గిరిజనేతరుల దరఖాస్తులు గ్రామస్థాయి కమిటీలో వారి సమక్షంలో సర్వే చేపట్టాలని  , ఆయా స్థాయి కమిటీలో తీర్మానాలను రిజిస్టర్లను పక్కగా నమోదు చేయాలని ఆయన సూచించారు. అటవీ భూములలో ఎప్పటినుండి జరుగుతుందన్న వివరాలను సాంకేతికతను వినియోగిస్తూ జి.పి.ఎస్. ద్వారా సరిహద్దు వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.  నిర్ణీత ప్రొఫార్మాలలో పోడు  రైతులకు సంబంధించి  వివరాల నమోదు జరగాలని అన్నారు. సర్వే కొరకు నియమించిన బృంద సభ్యులు వారికి కేటాయించిన గ్రామాల, ఆవాసాల  యొక్క సంపూర్ణ సమాచారం ముందస్తుగా కల్గిఉండాలని సూచించారు.


ఎంపిడిఓ లు ఫారెస్ట్ రేంజ్ అధికారులతో సమన్వయం చేసుకొని  నిర్దేశించిన నమూనా ప్రకారం డిజిటల్ సర్వే నిర్వహించి, గ్రామాలనుంచి తీర్మానాలు పంపాలని సూచించారు. అర్హత కలిగిన గిరిజనులకు , గిరిజనేతరులకు ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు అందించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పని చేస్తుందని కలెక్టర్ తెలిపారు.భవిష్యత్తులో ఇంచు అటవీ భూమి సైతం ఆక్రమణలకు గురికాకుండా అడవుల పునర్జీవనానికి పటిష్ట చర్యలు చేపట్టాలని, అటవీ రక్షణ చట్టం పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.ఈ  సమావేశంలో  జెడ్పి సి.ఈ. ఓ. డి.ఆర్.ఓ.ఓ. పురుషోత్తం,   మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్ లు,  ఎం.పి.డి.ఓ.లు, అటవీ, రెవెన్యూ అధికారులు, ఎం.పి.ఓ.లు సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.