సివిల్ సప్లయి గాడిలో పడేనా...? రైస్ మిల్లుల నిర్వహణ అక్రమాలు...: అక్రమాలపై విచారణ చేయాలని కాంగ్రెస్ డిమాండ్... కొత్త డీ ఎం గా బాధ్యతలు స్వీకరించిన జగదీష్

Submitted by SANJEEVAIAH on Thu, 19/01/2023 - 14:17
ఫోటో

 సివిల్ సప్లయి గాడిలో పడేనా.?

 రైస్ మిల్ వ్యవస్థపై ఆరోపణలు

 లెక్కలు తేల్చని అధికారులు 

కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డిఎం 

ఇకనైనా గడిలో పడేనా.?

(నిజామాబాద్ ప్రతినిధి, ప్రజాజ్యోతి, ఎడ్ల సంజీవ్)

 నిజామాబాద్ జిల్లాలోని రైస్ మిల్లులకు వడ్ల కేటాయింపు వ్యవహారం పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ వడ్ల కేటాయింపులో అవినీతి అక్రమాలు జరిగాయని అందుకు డిఎస్ఓ తో పాటు జిల్లా కో-ఆపరేటివ్ అధికారి కూడా ఉన్నట్లు డిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి బహిరంగంగానే ఆరోపించారు. అధికారుల తప్పిదాల వల్లనే 5.22 లక్షల క్వింటాళ్ల వడ్లను నిబంధనలకు విరుద్ధంగా కేటాయించాలని బహిరంగంగా ఆరోపణ చేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులతో పాటు ఈ అక్రమాలకు కారణం అయిన రైస్ మిల్లుల యాజమాన్యాలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు(గురువారం) ధర్నాకు పిలుపు నిచ్చారు. ఇది ఇలా ఉండగా ఇటీవల బోధని ఎమ్మెల్యే షఖిల్ ఆమర్ తమ రైస్ మిల్లులపై వచ్చిన ఆరోపణలవై డిఎస్ఓ చంద్ర ప్రకాష్ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విచారణ నివేదిక కలెక్టర్ కు చేరిన మరుసటి రోజు సాక్షాత్తుగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించడంపై ప్రతిపక్ష పార్టీలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. కలెక్టర్ ప్రకటించాల్సిన వివరాలను ఎమ్మెల్యే ఎలా ప్రకటిస్తారనేది ప్రధాన అస్త్రంగా తీసుకొని విమర్శలకు దిగుతున్నారు. కానీ అధికారులు మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి వివరాలను వెల్లడించకపోవడం విశేషం. ఈ తరుణంలో మహబూబ్ నగర్ సివిల్ సప్లయ్ డి ఎం జగదీష్ కుమార్ ను నిజామాబాద్ కు బదిలీపై తీసుకు రావడం గమనార్హం. అయితే ఈయన సివిల్ సప్లయ్ కార్పొరేషన్ ను గాడిలో పెడతారా అనే చర్చ మొదలైంది.

రెండు శాఖలు ఒకే అధికారి 

నిజామాబాద్ జిల్లా సివిల్ సప్లై డి ఎస్ వో తో పాటు డిఎం సివిల్ సప్లై పోస్టుకు చంద్రప్రకాష్ ఒకరే ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తాయి. గత కొన్నేళ్లుగా డిఎం సివిల్ సప్లై పోస్ట్ ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. జిల్లాలో పంట దిగుబడి పెరగడంతో పాటు రైస్ మిల్లుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా బోధన్ డివిజన్ లోనే ఈ రైస్ మిల్లుల సంఖ్య ఎక్కువగా పెరిగింది. కీలకమైన రెండు శాఖలకు ఒకే అధికారి ఉండటంతో డిఎస్ఓ కు  సహకారిగా డి సి ఓ సింహాచలంను కు ప్యాడి ప్రోక్యుర్ మెంట్ బాధ్యతలను అప్పగించారు. గత రెండేళ్లుగా ఇదే తంతు కొనసాగుతుంది. అనూహ్యంగా రైస్ మిల్లులు పెరగడం, దానికి తోడు పంట దిగుబడి పెరగడం మిల్లర్లకు కలిసి వచ్చింది. ఈ తరుణంలో బోధన్ లోని రైస్ మిల్లులు కేటాయింపులపై ఆరోపణలు రావడం గమనార్హం. ఓ పత్రికలో వచ్చిన కథనంపై ఎమ్మెల్యే స్పందించడంతో రాజకీయంగా వ్యవహారం ముదిరింది. ఒకవైపు బిజెపి ఎంపి అరవింద్ ఘాటుగా విమర్శలు చేయగా కాంగ్రెస్ సైతం ఈ అక్రమాలపై ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది.

నెట్టుకొచ్చేనా..?

సివిల్ సప్లై శాఖలో సీనియర్ గా తనదైన ముద్ర వేసుకున్న జగదీష్ కుమార్ మంగళవారం నిజామాబాద్ డి ఎం గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే పలు సమస్యలు, అక్రమాలు ఆరోపణలతో ఉన్న సవిల్ సప్లయ్ శాఖను ఏ మేరకు గాడిలో పెడతారో వేచి చూడాలి మరి.