మిర్యాలగూడలో రెండు ఆసుపత్రులు, ఐదు ల్యాబ్ లు సీజ్...

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 12:26
 Two hospitals, five labs seized in Miryalaguda...

-ఆరు ఆసుపత్రులకు షోకాజు నోటీసులు

-మిర్యాలగూడలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు

మిర్యాలగూడ, సెప్టెంబర్23,(ప్రజాజ్యోతి) : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అపరిశుభ్రంగా ఉన్న ఆసుపత్రులతో పాటు వైద్యం సక్రమంగా అందించని ఆసుపత్రులను శుక్రవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ కొండల్ రావు, డిప్యూటీ వైద్యాధికారి కేస రవిలు సీజ్ చేశారు. ఈసందర్భంగాజిల్లా వైద్యాధికారి డాక్టర్ కొండల్ రావు, డిప్యూటీ వైద్యాధికారి కేస రవిలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలలో భాగంగా మిర్యాలగూడలోని 16 ఆసుపత్రులను తనిఖీలు చేయగా రెండు ఆసుపత్రులను సీజ్ చేయటంతో పాటు ఐదు ల్యాబ్ లను మూసివేశారు. అదే విధంగా మరో ఆరు ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. వైద్యాధికారులు సీజ్ చేసిన ఆస్పత్రులలో సాయి రిత్విక ఆసుపత్రి, శ్రీ చాణక్య చిల్డ్రన్స్ ఆస్పత్రులు ఉన్నాయి. అదేవిధంగా సీజ్ చేసిన ల్యాబ్ లలో ఆదిత్య హాస్పిటల్స్ లోని ఎక్స్రే ప్లాంట్ సీజ్ చేయడంతో పాటు వసంత మెటర్నిటీ హాస్పటల్ లోని ల్యాబ్, పద్మావతి హాస్పిటల్ లోని ల్యాబ్ , అను మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలోని ల్యాబ్, ఎలైట్ ఆసుపత్రిలోని ల్యాబ్ లను సీజ్ చేశారు.వీటితోపాటు అసౌకర్యంగా ఉన్న మరో ఆరు ఆసుపత్రులకు ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. షోకాజు నోటీసులు జారీచేసిన ఆస్పత్రులలో ఎలైట్ చెస్ట్ హాస్పిటల్, యశోద జనరల్ హాస్పిటల్, ప్రసాద్ హాస్పిటల్, శ్రీ సాయి డయాగ్నస్టిక్స్ సెంటర్ హాస్పిటల్, శ్రీ సూర్య హాస్పిటల్ ఉన్నాయి. అనంతరం జిల్లా వైద్యాధికారి డాక్టర్ కొండలరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల తనిఖీలలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేట్ హాస్పటల్ తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు . పేదలకు అందించే వైద్యంతో పాటు ఆసుపత్రిలోని సౌకర్యాలు, వైద్యులు, ల్యాబ్ సౌకర్యాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. అదే విధంగా ఆస్పత్రిలో ఫీజుల బోర్డును తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.నిబంధనల మేరకు లేని హాస్పటల్ సీజ్ చేశామన్నారు. కొన్ని ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీచేశామని తెలియజేశారు. మరో వారం రోజులపాటు జిల్లాలో తనిఖీలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట డి ఈ ఎం ఓ రవిశంకర్, అడవిదేవులపల్లి పీహెచ్ సి వైద్యులు ఉపేందర్, తదితరులు, పాల్గొన్నారు.