- స్తంభించిన జాతీయ రహదారి.. 300 మీటర్ల మీద నిలిచిన వాహనాలు..
నర్సాపూర్ (ప్రజాజ్యోతి) నర్సాపూర్ పట్టణ కేంద్రం ఆదివారం నాడు వాహనాల రద్దీతో భాగ్యనగర రహదారులను తలపించింది. సెలవు దినం కావడంతో హైదరాబాద్ జంట నగరాల నుంచి వేలాది మంది భక్తులు కుటుంబ సమేతంగా మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. దర్శనానంతరం భక్తులు తిరుగు ప్రయాణం కావడంతో మెదక్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న నర్సాపూర్ ప్రధాన కూడలి వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కూడలి నుంచి సుమారు 300 మీటర్ల పొడవునా వందలాది వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. అటు దైవదర్శనాలకు వెళ్లే భక్తులు, ఇటు స్థానిక వాహనదారులతో పట్టణ ప్రధాన రహదారి కిక్కిరిసిపోయింది. నిత్యం సాఫీగాసాగే ఈ కూడలి మార్గం ఆదివారం ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సెలవు దినాన ఈ సమస్య పునరావృత్తం అవడం విశేషం.
