జులై 31లోపు రేషన్ కార్డుల ఈ-కేవైసీ పూర్తి చేయాలి

Siddipet Bureau
1 Min Read

సిద్ధిపేట ,జులై 17,(ప్రజాజ్యోతి): రేషన్ కార్డుదారులందరూ ఈ నెల 31వ తేదీలోపు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు నిరంతరాయంగా ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగించేందుకు ఈ-కేవైసీ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాల్సి ఉందన్నారు.సిద్ధిపేట జిల్లాలో మొత్తం 10,47,075 మంది లబ్ధిదారులు ఉండగా, ఇప్పటివరకు 8,48,446 మంది ఈ-కేవైసీ పూర్తి చేశారని తెలిపారు. దీంతో జిల్లాలో 81.03 శాతం ఈ-కేవైసీ పూర్తయిందన్నారు. కొన్ని రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల్లో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేసి, మిగిలిన సభ్యులు ఇంకా చేయించుకోలేదని గుర్తించామని చెప్పారు. ఈ-కేవైసీ పూర్తి చేయని కుటుంబ సభ్యుల వివరాలను క్షేత్రస్థాయి సిబ్బందికి అందజేశామని, సంబంధిత అధికారులు, చౌక ధరల దుకాణాల డీలర్లు, ఫీల్డ్ సిబ్బంది ఆయా కుటుంబాలను సంప్రదించి ఈ-కేవైసీ పూర్తి చేయించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.ఇంకా ఈ-కేవైసీ పూర్తి చేయని రేషన్ కార్డుదారులందరూ తమ సమీప చౌక ధరల దుకాణాన్ని సంప్రదించి వెంటనే ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *