సిద్ధిపేట, జులై 11, (ప్రజాజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. భూ భారతి అమలు, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై శనివారం ఖమ్మం సమీకృత కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ పాల్గొనగా, సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కె. హైమావతి, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, డీఆర్వో నాగరాజమ్మ, సర్వే అండ్ ల్యాండ్ ఏడి సుదర్శన్ పాల్గొన్నారు.మంత్రి మాట్లాడుతూ, ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూ భారతి చట్టం ద్వారా రైతుల భూములకు సంపూర్ణ భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ధరణి కాలంలో పెండింగ్‌లో ఉన్న 9.6 లక్షల సాదాబైనామా దరఖాస్తులను నిబంధనల మేరకు వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.భూ భారతి సమర్థవంతమైన అమలుకు భూ రీ-సర్వే తప్పనిసరి అని పేర్కొన్న మంత్రి, రాష్ట్రంలో శిక్షణ పొందిన 5,700 మంది లైసెన్స్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి జిల్లాలో తొలి విడతగా 70 గ్రామాలను ఎంపిక చేసి రీ-సర్వే చేపడుతున్నామని, మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా రీ-సర్వే పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.రీ-సర్వే కోసం అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేసి, అవసరమైన సిబ్బంది, మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. సర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి 60 రూపాయల చొప్పున పారితోషికం చెల్లిస్తామని, విధులకు హాజరుకాని సర్వేయర్ల లైసెన్సులు రద్దు చేయాలని తెలిపారు. ఒక సర్వే నంబరులో కొంత భూమి మాత్రమే ప్రభుత్వ అవసరాలకు సేకరించినా మొత్తం భూమిని నిషేధిత జాబితాలో ఉంచిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సాదాబైనామా దరఖాస్తులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.ఇందిరమ్మ ఇళ్ల తొలి విడత నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్నడబుల్బీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రస్తుత స్థితిలోనే లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు. నిధులు విడుదలైనా పనులు ప్రారంభించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. రెండో విడత లబ్ధిదారుల ఎంపికలో గుడిసెల్లో నివసించే కుటుంబాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, మొదటి విడతలో మంజూరు కాని అర్హులను కూడా చేర్చాలని ఆదేశించారు.ఈ సందర్భంగా తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 41 వేల గుడిసెలను గుర్తించామని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.సెర్ప్ సీఈవో దివ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల విద్యార్థులకు స్వయం సహాయక సంఘాల మహిళా టైలర్ల ద్వారా యూనిఫాంలు కుట్టిస్తున్నామని తెలిపారు. ఈ నెల 15లోపు బాలికలకు, 30లోపు బాలురకు యూనిఫాంలు అందజేయాలని, ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి కనీసం ఒక జత యూనిఫాం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 26 వేల మంది స్వయం సహాయక సంఘాల టైలర్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నట్లు తెలిపారు.
