పోక్సో కేసు పగ… ఆరు ప్రాణాలు బలి!

Rangareddy Bureau
2 Min Read

పోక్సో కేసు పగ… ఆరు ప్రాణాలు బలి!
ఒకే రాత్రిలో ఆరుగురిని పొట్టనబెట్టుకున్న నిందితుడు
కేసు పెట్టిన కుటుంబంతో పాటు భార్య, ఇద్దరు చిన్నారుల దారుణ హత్య
తండ్రికి ఫోన్ చేసి ‘ఆత్మహత్య చేసుకుంటా’నంటూ పరారీ

చేవెళ్ల జూలై 11 (ప్రజా జ్యోతి): రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఆరు హత్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తనపై పోక్సో కేసు నమోదు కావడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ వ్యక్తి కక్షతో వ్యవహరించి.. కేసు పెట్టిన కుటుంబంతో పాటు తన భార్య, ఇద్దరు చిన్నారులను కూడా అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

పోక్సో కేసుతో మొదలైన కక్ష

షాబాద్ మండలం దైవాలగూడకు చెందిన రాజ్‌కుమార్ కొన్నేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన సరితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబంతో కలిసి షాబాద్ మండల కేంద్రంలో నివాసం ఉంటున్నాడు. ఇంటి పక్కనే ఉండే మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో బాలిక తల్లి లక్ష్మి ఈ ఏడాది మే 16న షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రాజ్‌కుమార్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు.

మొదట కేసు పెట్టిన కుటుంబంపై దాడి

శుక్రవారం రాత్రి షాబాద్‌కు వచ్చిన రాజ్‌కుమార్ ముందుగా తనపై ఫిర్యాదు చేసిన లక్ష్మిపై దాడి చేసి హత్య చేశాడు. అడ్డుకునేందుకు వచ్చిన లక్ష్మి అత్త రుక్కమ్మను కూడా హతమార్చాడు. అనంతరం మైనర్ బాలికను బలవంతంగా తీసుకెళ్లి తన స్వగ్రామమైన దైవాలగూడ సమీపంలోని చెరువు వద్ద హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

భార్య, పిల్లలపై కూడా కిరాతకం

అనంతరం తన ఇంటికి వెళ్లిన నిందితుడు భార్య సరితతో పాటు కుమారులు పరీక్షిత్, పృధ్వాన్ష్‌లను కూడా అత్యంత దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

తండ్రికి ఫోన్… తర్వాత స్విచ్ ఆఫ్

హత్యల అనంతరం రాజ్‌కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి “ఆరుగురిని హత్య చేశాను.. నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను” అని చెప్పి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు సమాచారం. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలంలో ఉన్నతాధికారులు


సమాచారం అందుకున్న పోలీసులు ఆరు మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫ్యూచర్ సిటీ సీపీ, డీసీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఘటనాస్థలాలను పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *