ఆధునిక భారతంలో మారని తీరు కుల బహిష్కరణ..?
— సమాజానికి అపచారమే..!
— సామాజిక బహిష్కరణ నేరం..?
కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 24 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని గిరిజన తండా లో కుల బహిష్కరణ జరిగిందని కొన్ని బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేయడం జరిగిందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన పై సంబంధిత బాధితుల ఫిర్యాదు పై అధికారులలో ఇంకా క్లారిటీ లేదు..? ఆ యొక్క బాధిత కుటుంబాలు సభ్య సమాజంలో గౌరవంగా బతకాలనుకున్న ఆ కుటుంబాలకు “బాసట” లేకుండా చేస్తున్నారని బాధిత కుటుంబం వాపోయింది. బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం సవాయి రామ్, బాల్ సింగ్, బాబ్యా, తారాచంద్, బాబు కుటుంబాలను గిరిజన పండగ సందర్భంగా ప్రాధాన్యత ఇవ్వలేదని వారిని బహిష్కరించారని బాధితులు స్థానిక సంబంధ పోలీస్ స్టేషన్, స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని బాధితులు తెలిపారు.
ఇంకా ఈ కుల బహిష్కరణలు..!
అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపుతూ, డిజిటల్ విప్లవంతో దూసుకుపోతున్న మన దేశంలో కొన్ని గ్రామాలు, ప్రాంతాల్లో ఇంకా ‘కుల బహిష్కరణ’ లాంటి దురాచారాలు సజీవంగా ఉండటం సామాజిక పురోగతికి పెద్ద మచ్చ. సామాజికంగా ఒక కుటుంబాన్ని లేదా వ్యక్తిని ఒంటరిని చేయడం మానవ హక్కుల ఉల్లంఘనే కాకుండా, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల నిరాకరణకు దారితీస్తోంది.
రాజ్యాంగం మరియు చట్టపరమైన రక్షణలుప్రాథమిక హక్కులు..!
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రతీ ఒక్కరికీ సమానత్వాన్ని, ఆర్టికల్ 21 స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పిస్తున్నాయి. కుల బహిష్కరణ వల్ల ఈ ప్రాథమిక హక్కులు తీవ్రంగా భంగపడతాయి.కుల పంచాయతీలు లేదా వర్గాల పెద్దలు సమాజం నుండి ఎవరినైనా వెలివేస్తే అది కఠినమైన క్రిమినల్ నేరం. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఇండియన్ న్యాయ సంహిత మరియు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయవచ్చు.
ప్రత్యేక చట్టాల అవసరం..!
మహారాష్ట్ర తరహాలోనే సామాజిక బహిష్కరణకు వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రత్యేక చట్టాలు తెచ్చి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.
బాధితుల వేదన – సామాజిక పర్యవసానాలు
ఒక కుటుంబాన్ని బహిష్కరించడం అంటే కేవలం మాటలతో ముగించడం కాదు. కిరాణా కొట్టులో వస్తువులు ఇవ్వకపోవడం, తాగునీటి వసతి నిలిపివేయడం, పండగలు-శుభకార్యాలకు రానివ్వకపోవడం, ఆఖరికి వైద్యం లేదా రవాణా సదుపాయాలు అందకుండా చేయడం వంటి అమానుష చర్యలకు పాల్పడతారు. దీనివల్ల బాధితులు తీవ్రమైన ఆర్థిక, మానసిక కుంగుబాటుకు గురవుతున్నారు.
పరిష్కారం ఎక్కడ ఉందంటే…?
తక్షణ పోలీసు చర్యలు బహిష్కరణ వార్తలు రాగానే రెవెన్యూ మరియు పోలీసు యంత్రాంగం వేగంగా స్పందించి బాధితులకు పూర్తి రక్షణ కల్పించాలి.చట్టపరమైన చైతన్యం గ్రామీణ ప్రాంతాల్లో ‘సామాజిక బహిష్కరణ నేరం’ అని స్పష్టం చేస్తూ ప్రజలకు, పంచాయతీ ప్రతినిధులకు విస్తృతంగా అవగాహన కల్పించాలి.పాతకాలపు మూఢాచారాలు, కుల ఆధిపత్య ఆలోచనలను పక్కనబెట్టి సమాజంలో మార్పు కోసం యువత ముందుకు రావాలి.సంస్కృతి, సంప్రదాయాల పేరుతో రాజ్యాంగాన్ని, మానవత్వాన్ని కాలరాసే హక్కు ఎవరికీ లేదు. మనుషులందరూ సమానమే అనే భావనను విస్తరింపజేసి, కుల బహిష్కరణలు లేని సమసమాజాన్ని నిర్మించడమే నిజమైన ప్రగతి. ఇకనైనా ఈ యొక్క సభ్య సమాజంలో గౌరవంగా ఉండడానికి అధికారులు తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నారు.
