కాంగ్రెస్ పార్టీకి హౌజ్ బుజుర్గు గ్రామ పార్టీ మాజీ అధ్యక్షులు రాజీనామా
గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేసినా గుర్తింపు లేదని ఆవేదన
ఆత్మకూరు, అక్టోబర్ 27 (ప్రజాజ్యోతి):
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం హౌజ్ బుజుర్గ్ గ్రామానికి చెందిన షేక్ ఖాసీం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసినప్పటికీ, ఇటీవలి కాలంలో పార్టీ కార్యక్రమాలకు తనను ఆహ్వానించకుండా పక్కన పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేశానని షేక్ ఖాసీం తెలిపారు. తాను బాధ్యతలు చేపట్టిన సమయంలో గ్రామంలో కేవలం 5 నుంచి 10 మంది కార్యకర్తలు మాత్రమే ఉండేవారని, యువతను ప్రోత్సహిస్తూ, సీనియర్ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని గ్రామంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశానని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలోనూ, పార్టీ నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లోనూ ముందుండి పనిచేశానని, స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి తన వంతు కృషి చేశానని తెలిపారు. తన సేవలు, పార్టీ పట్ల తనకున్న నిబద్ధత మండల, జిల్లా స్థాయి నాయకులకు తెలుసని అన్నారు. అయితే స్థానిక ఎన్నికల అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న పార్టీ సమావేశాలు, కార్యక్రమాలకు తనకు సమాచారం ఇవ్వడం లేదని, కనీసం ఆహ్వానించకుండా పక్కన పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వ్యక్తిగత పదవులు, స్వప్రయోజనాల కోసం కాకుండా పార్టీ అభివృద్ధి కోసమే పనిచేశానని, ప్రస్తుత పరిస్థితులు తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపారు. ఈ విషయం పై నాయకులకు చెప్పిన వారు పట్టించుకోలేదు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తన రాజీనామా నిర్ణయానికి పార్టీ సిద్ధాంతాలపై గౌరవం లేకపోవడం కారణం కాదని, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తగా ఎదురవుతున్న పరిస్థితులే ప్రధాన కారణమని షేక్ ఖాసీం పేర్కొన్నారు.
