అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి

Vikarabad Staff Reporter
2 Min Read

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి

కొడంగల్ అక్టోబర్ 21 ప్రజా జ్యోతి న్యూస్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి గురువారం కొడంగల్ పర్యటనకు రానున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఇంటెలిజెన్స్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, వారికి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహరాతో కలిసి అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ఏఎస్ఎల్) సమావేశం నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను పరిశీలించి, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రతా పరంగా ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎత్తైన భవనాలపై పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బందోబస్తు విధుల్లో పోలీసు శాఖకు చెందిన వాహనాల డ్రైవర్లనే వినియోగించాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అగ్నిమాపక వాహనాన్ని అందుబాటులో ఉంచాలని తెలిపారు.
ఆర్‌అండ్‌బీ అధికారులు రహదారులపై ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, రోడ్లపై పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వైద్య సిబ్బందితో పాటు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచాలని, వాటిలో అత్యవసర వైద్య పరికరాలు, ఎమర్జెన్సీ కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఆసుపత్రిలోని అత్యవసర విభాగం వద్ద వైద్యులు అందుబాటులో ఉండాలని తెలిపారు. విద్యుత్ అంతరాయాలు ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు అత్యవసర పరిస్థితుల కోసం జనరేటర్లను సిద్ధం చేయాలని సూచించారు.
ఆహార భద్రత అధికారులు ఆహార పదార్థాలను తనిఖీ చేసి, నాణ్యతను నిర్ధారించిన తర్వాతే సంబంధిత వ్యక్తులకు అందించాలని స్పష్టం చేశారు. అటవీ శాఖ అధికారులు పరిసర ప్రాంతాల్లో క్రిమికీటకాల సమస్యలను పరిశీలించి, అవసరమైన నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ఏర్పాట్లను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. రహదారులపై ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తాచెదారాన్ని తొలగించి పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ రెండు అంబులెన్స్‌లను అవసరమైన వైద్య సిబ్బందితో సిద్ధంగా ఉంచాలని తెలిపారు.
విద్యుత్, మున్సిపల్, ఆహార భద్రత శాఖలతో పాటు ఇతర శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని, భద్రత, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా, డీఎస్పీ శ్రీనివాస్, పోలీసు శాఖకు చెందిన సీఐలు, ఎస్‌ఐలు, ఆర్‌అండ్‌బీతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *