ఇండ్లు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు పట్టాల పంపిణీ
![]()
పరిగి, జూలై 03 (ప్రజాజ్యోతి):
వికారాబాద్ జిల్లా, కొడంగల్ నియోజకవర్గం లోని మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి పనులలో భాగంగా ఇండ్లు కోల్పోయిన వారికి మొత్తం 86 గృహాలను సేకరించడం జరిగింది. ఈ సేకరణకు సంబంధించి మొత్తం (పదకొండు కోట్లు ముప్పై ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల నాలుగు వందల పదిహేను) రూపాయలు మాత్రమే నష్టపరిహారంగా చెల్లించబడింది.
ఈ సేకరణ కారణంగా మొత్తం 95 కుటుంబాలు నిర్వాసితులుగా మారనున్నాయి. ప్రతి నిర్వాసిత కుటుంబానికి పునరావాసం మరియు పునఃస్థాపన ప్రయోజనాల కింద( ఏడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు మాత్రమే నగదు సహాయం మరియు 120 చదరపు గజాల విస్తీర్ణం గల ఒక ప్లాటును కేటాయించడం జరుగుతోంది.
మొత్తం నిర్వాసిత కుటుంబాలకు కేటాయించాల్సిన ప్లాట్లలో ప్రస్తుతం 76 పట్టా సర్టిఫికెట్లు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో నందారం కుటుంబానికి చెందిన 5 కుటుంబాలు తమకు కేటాయించిన ప్లాట్లను స్వచ్ఛందంగా వదులుకొనుటకు అంగీకరించాయి.
మిగిలిన 14 పట్టాలు సిద్ధం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ 14 కుటుంబాలలో 4 కుటుంబాలు ఇప్పటివరకు తమ సమ్మతిని తెలియజేయకపోవడంతో వారికి అవార్డు సిద్ధం చేయలేదు. మిగిలిన 10 కుటుంబాలకు సంబంధించిన అవార్డుల తయారీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.
ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథి కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఏ. తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకట చారి, కాడ స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, తహసిల్దార్ రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంబయ్య, వివిధ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఉన్నతాధికారులు, ఇల్లు కోల్పోయినటువంటి ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.

