జక్కాపూర్ విద్యార్థికి బంపర్ ఆఫర్

తల్లిదండ్రులతో తిరుపతికి విమాన ప్రయాణం

Siddipet Bureau
2 Min Read

నారాయణరావుపేట,ఆగస్టు 16,(ప్రజాజ్యోతి):ప్రతిభ కనబరిచే విద్యార్థులను ప్రోత్సహించేందుకు రిటైర్డ్ ఆర్టీసీ ఆర్‌ఎం, విద్యాభిమాని దొంతుల సుధాకర్ వినూత్న పురస్కారాన్ని ప్రకటించారు. జక్కాపూర్ పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌లో చదువుతున్న విద్యార్థుల్లో రాబోయే పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థికి తన తల్లిదండ్రులతో కలిసి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లేందుకు రానుపోను ఉచిత విమాన ప్రయాణం కల్పించనున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు విద్యార్థికి పది వేల నగదు బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు.అత్యధిక మార్కులు సాధించే తదుపరి ఇద్దరు విద్యార్థులకు కూడా చెరో పది వేల నగదు పురస్కారం అందజేస్తామని ప్రకటించారు.80వ స్వాంతత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన 2025-26 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 50 వేల రూపాయల విలువైన నగదు బహుమతులు అందజేశారు. భౌతిక, రసాయన శాస్త్ర ప్రతిభా పరీక్షలో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించిన ఎం. అశ్విత్ రెడ్డి, ఎన్‌ఎంఎంఎస్ ప్రతిభా పరీక్షలో జిల్లా స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన కారంకంటి ప్రచేతన, పదో తరగతి ఫలితాల్లో 549 మార్కులు సాధించిన బెజగాం కావ్యకు చెరో పది వేల నగదు పురస్కారంతో పాటు వారి తల్లిదండ్రులను సన్మానించారు.6 నుంచి 10వ తరగతుల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు కూడా చెరో రెండు వేల చొప్పున నగదు బహుమతులు అందించారు.ఈ సందర్భంగా దొంతుల సుధాకర్ మాట్లాడుతూ.. విద్యార్థులను వివిధ పోటీ పరీక్షలకు సిద్ధం చేయడంలో ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని అభినందించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడం ఉపాధ్యాయుల కృషికి నిదర్శనమన్నారు. ఉపాధ్యాయుల అంకితభావానికి ఆకర్షితుడై తన సొంత నిధులతో 40 లక్షల వ్యయంతో దొంతుల సుశీలమ్మ బాల నారాయణ మెమోరియల్ మీటింగ్, డైనింగ్ హాల్ నిర్మించి ఇచ్చినట్లు తెలిపారు.ప్రతి సంవత్సరం విద్యార్థులను ప్రోత్సహించేందుకు తన వంతు సహకారం అందిస్తానని, పాఠశాలకు అవసరమైన వసతుల కల్పనకు కూడా ముందుంటానని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తన సొంత నిధులను వెచ్చిస్తూ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న దొంతుల సుధాకర్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కొమ్మూరి పద్మ, ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *