చిన్నకోడూర్ , ఆగస్టు 01, (ప్రజా జ్యోతి) : ఇండియన్ ఆయిల్ అండ్ సీడ్ కార్పొరేషన్ ఫౌండేషన్ డే సందర్భంగా వ్యవసాయ రంగంలో వినూత్న సాగు విధానాలతో విశేష ఫలితాలు సాధించిన రైతులను శనివారం హైదరాబాద్ లో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ డాక్టర్ ఆర్.కె. మాథుర్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ జి.డి. సతీష్ కుమార్ హాజరై ఎంపికైన రైతులకు శాలువాలు కప్పి, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శాస్త్రీయ సాగు పద్ధతులు, ఆధునిక సాంకేతికత, నాణ్యమైన విత్తనాలు, ప్రకృతి వ్యవసాయాన్ని సమన్వయం చేసుకుంటున్న రైతులు దేశ వ్యవసాయాభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. పరిశోధనా సంస్థలు సూచించే సాంకేతికతలను రైతులు అవలంబిస్తే దిగుబడులు పెరగడంతో పాటు సాగు వ్యయం తగ్గి ఆదాయం కూడా మెరుగుపడుతుందని వివరించారు.వ్యవసాయంలో విశేష ప్రతిభ కనబరిచిన రైతులను గుర్తించి సన్మానించడం ద్వారా ఇతర రైతులకు స్ఫూర్తినివ్వడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.చిన్నకోడూర్ మండలం మాచాపూర్ గ్రామానికి చెందిన ఏలేటి భూపతి రెడ్డి ,చౌదారం కి చెందిన ఆన్నది తిరుపతి రెడ్డి ,శంకరాయకుంట గ్రామానికి చెందిన మాకు మహేష్ రైతులను సన్మానించారు. సన్మానం పొందిన రైతులు మాట్లాడుతూ శాస్త్రీయ పద్ధతులను ప్రకృతి వ్యవసాయంతో కలిపి అమలు చేస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ఇటువంటి గుర్తింపులు రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి మరింత నాణ్యమైన వ్యవసాయానికి ప్రేరణగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ అండ్ సీడ్ కార్పొరేషన్ అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, పలువురు రైతులు పాల్గొన్నారు.
